అదిగదిగో ప్రమాద ఘంటికలు!
జీవప్రపంచం
వాతావరణంలో జరిగే మార్పులు ఆల్పైన్ జాతి మేకల బరువుపై ప్రభావం చూపుతున్నట్లు తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. ఆల్పైన్ మేకలు 1980తో పోలిస్తే 25 శాతం మేర బరువు తగ్గినట్లు ఉత్తర ఇంగ్లాండ్‌లోని డర్హమ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆల్పైన్ మేకలు రొమేనియా పర్వత ప్రాంతాలు, పోలండ్‌లోని టార్టా పర్వత ప్రాంతాలు, టర్కీలోని కొన్ని ప్రాంతాలు, న్యూజిలాండ్‌లోని దక్షిణ దీవిలో ఎక్కువగా కనిపిస్తాయి.
‘‘శరీర పరిణామం, బరువు తగ్గిపోవడం అనేది ఆల్పైన్ మేకలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాకపోవచ్చు. జంతు ప్రపంచంలో చాలా జాతులపై వాతావరణ మార్పులు ప్రభావం చూపుతున్నాయి అనడానికి ఇది తిరుగులేని సాక్ష్యం’’ అంటున్నారు పరిశోధనకు నేతృత్వం వహించిన డా. టామ్ మాన్సన్. బరువు, పరిమాణం తగ్గడం అనేది వాటి శక్తిసామర్థ్యాలపై కూడా ప్రభావం చూపుతుంది. మునపటిలా చలికాలాన్ని తట్టుకునే సామర్థ్యం వాటిలో ఉండడం లేదు.
గతంతో పోల్చితే ఆహారాన్వేషణలో చూపే ఉత్సాహం మేకలలో తగ్గిపోయింది. ఆహార అన్వేషణ కంటే విశ్రాంతికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు పరిశోధన బృందంలో ఒకరైన డా.స్టీఫెన్ విల్స్. ప్రమాదం నుంచి తప్పించుకోవడంలో ఆల్పైన్ మేకలకు గొప్ప పేరు ఉంది. ఎంత ప్రమాదం
చుట్టుముట్టినా...అప్పటికప్పుడు వచ్చిన మెరుపు ఆలోచనతో అవి ప్రమాదం నుంచి బయటపడతాయి. రకరకాల ఈలలు, కూతలతో తోటి మేకలకు కూడా ప్రమాద హెచ్చరికను చేరవేస్తాయి. అసాధారణ నైపుణ్యాలతో ప్రమాదాల నుంచి బయటపడే ఆల్పైన్ మేకలకు తాజా ప్రమాదం గురించి తెలియకపోవచ్చు. తెలిసినా చేయగలిగేది ఏమీ లేక పోవచ్చు. పాపం!