పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు..
అహ్మదాబాద్: భారత్-పాకిస్తాన్ల వైరం ఓ జంటకు సమస్య తెచ్చిపెట్టింది. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్‌కు చెందిన అల్తాఫ్ పలేజా.. పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన సిద్రాను పెళ్లి చేసుకున్నాడు. కాగా సిద్రా పాకిస్తాన్ జాతీయురాలు అయినందున సరిహద్దు జిల్లా అయిన కచ్‌లోకి ఆమె, కుటుంబ సభ్యులు వెళ్ళేందుకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో అల్తాఫ్ భార్య, అత్తమామల కోసం ఊరికి దూరంగా ఉంటున్నాడు.
ఎనిమిది నెలల క్రితం సిద్రా, ఆమె కుటుంబ సభ్యులు భారత్‌కు వచ్చారు. అయితే కచ్ తప్ప ఇతర ప్రాంతాల్లో ఉండాలన్న షరతుతో వీసా మంజూరు చేశారు. దీంతో కచ్‌కు సమీపంలోని మోర్బి జిల్లాలో వారు బస చేశారు. అల్తాఫ్ తన భార్య సిద్రి, ఆరు నెలల కొడుకుతో కలసి వారితో ఉంటున్నాడు. మోర్బిలో అద్దె ఇంటి కోసం అన్వేషించగా, పాకిస్తాన్ నుంచి వచ్చారనే కారణంతో ఇల్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకురాలేదు. భుజ్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు దూరంగా అల్తాఫ్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు మోర్బిలో ఇల్లు లేక హోటల్లో ఉండాల్సి వచ్చింది. తన భార్యను సొంతూరుకు తీసుకెళ్లేందుకు అధికారులు ఎందుకు అనుమతించడం లేదో కారణం కనిపించడం లేదని అల్తాఫ్ వాపోయాడు.