alugulu
-
అభయారణ్యంలో అలుగుల వేట
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యంలో అరుదైన వన్యప్రాణులు అలుగులు సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలియన్ అని కూడా పిలుస్తారు. వీటి మూతి ముంగీసను పోలి ఉంటుంది. వీటి జీవితకాలం సుమారు 20 ఏళ్లు. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవికి పొడవైన నాలుక ఉంటుంది. వీటి చర్మంపై ఉండే పెంకులు (పొలుసులు) దృఢంగా ఉంటాయి. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకూ సంచరిస్తున్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు చెప్పారు. అలుగులు రాత్రి సమయంలోనే ఆహారం కోసం ఎక్కువగా సంచరిస్తుంటాయి. పగటిపూట గోతుల్లో, తొర్రల్లో, చెట్ల పైన దాగి ఉంటాయి. ఇవి సంచరిస్తున్న సమయంలో ఎటువంటి అలికిడి వచ్చినా బెదిరిపోయి బంతిలాగా ముడుచుకుపోతాయి. వీటి వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును తేలి గట్టిగా ఉంటాయి. అలుగులపై వేటగాళ్ల కన్ను అభయారణ్యంలో సంచరిస్తున్న అలుగులపై వేటగాళ్ల కన్ను పడింది. అలుగు జంతువు వీపుపై ఉండే పెంకులకు మంచి డిమాండ్ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలుగు పెంకులను చైనాలో మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారని చెప్తున్నారు. దీంతో అటవీప్రాంతంలో కూడా అలుగుల కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు అలుగును పట్టుకుని రూ.20 లక్షలకు విక్రయిస్తామని ఫేస్బుక్లో అలుగు వీడియోను అప్లోడ్ చేశారు. దీనిపై అధికారులు స్పందించి అలుగును అమ్మకానికి పెట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అరుదైన వన్య ప్రాణులను పట్టుకుని విక్రయించాలని చూస్తే చట్ట ప్రకారం ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధిస్తారని వైల్డ్ లైఫ్ అధికారులు పేర్కొన్నారు. వన్యప్రాణులను వేటాడితే శిక్షిస్తాం చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. – జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ రేంజ్ అధికారి, పోలవరం -
కేబీఆర్ పార్కులో ‘అలుగు’
-
కేబీఆర్ పార్కులో ‘అలుగు’
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కులో అరుదైన జంతువులు అటు సందర్శకులు.. ఇటు వాకర్లకు కనువిందు చేస్తున్నాయి. కొన్ని జంతువులు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంటాయనడం అతిశయోక్తికాదు. ఆ కోవలోకే వస్తుంది అలుగు. చూస్తూనే చిన్న డైనోసార్ గుర్తుకొచ్చేలా ఉన్న తొండజాతికి చెందిన జంతువు అలుగు. దీని ముక్కు సూటిగా పొడవుగా ఉండి చీడ పురుగులు, చీమలను మాత్రమే తింటుంది. పొలుసుల్లా.. రాయిని పోలినట్లు మందంగా దీని చర్మం ఉంటుంది. ఈ జంతువు ఎవరికీ హాని తలపెట్టదని.. చాలా అరుదుగా కనిపిస్తుంటుందని పార్కు వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా వాక్ వేలో మెల్లగా వెళ్తున్న ఈ జంతువును వాకర్లు తమ కెమెరాల్లో బంధించారు. -
అక్రమంగా తరలిస్తున్న అలుగు స్వాధీనం
తూర్పుగోదావరి, వీఆర్‌పురం (రంపచోడవరం): అక్రమంగా తరలిస్తున్న అలుగును అటవీశాఖాధికారులు దాడి చేసి స్వాధీనపరచుకొని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధి పాతరాజుపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొంది. రేంజర్ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. పాతరాజుపేట గ్రామంలోని ఒక ప్రదేశంలో అడవి అలుగును దాచి ఉంచారన్న సమాచారం తెలుసుకున్న రేంజర్ సిబ్బందితో దాడి చేశారు. దీంతో అక్కడున్న నలుగురు దుండగులు ఫారెస్ట్ అధికారులు రావడాన్ని పసిగట్టి అలుగును వదిలేసి ఆ ప్రదేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. సిబ్బంది వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో ముగ్గురు దొరకగా మరో వ్యక్తి పరారయ్యాడు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రేంజర్ చెప్పారు. వాలుగను విశాఖ అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చినట్టు పొంతనలేని సమాధానాలను నిందితులు చెబుతున్నారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందన్నారు. ఈ దాడిలో డీఆర్ఓ వీరన్నరాజు, ఎఫ్‌ఎస్‌ఓలు జి.భిక్షం, టి.సాయి, దేశయ్య,ఆరీఫ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వేటగాళ్ల ఉచ్చులో ఆలుగులు
మన్యంలో విసృ్తతంగా వేట బలైపోతున్న వన్యప్రాణులు గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్ : అడవుల్లో కనిపించే అరుదైన ఆలుగులు వేటగాళ్ల ఉచ్చులకు చిక్కుతున్నాయి. ఆలుగు వీపుపై ఉండే పెంకుల్లాంటి చిప్పలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు ఆలుగుల వేటకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. శరీరంపైన గట్టిగా పొలుసుల మాదిరిగా ఉంటాయి. కిలో చిప్పలకు రూ.3-4 వేలు ధర పలుకుతుంది. ఇదే అంతర్జాతీయ మార్కెట్లో రూ.25 వేల వరకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఇవి పగలంతా నేలలో బొరియల్లో నివసిస్తూ రాత్రి సమయాల్లోఆహారం కోసం బయటికి వస్తుంటాయి. ఇవి సొంతంగా బొరియలు తయారు చేసుకుని వాటిలో నివాసం ఉంటాయి. అయితే ఈ బొరియలను బట్టి వాని నివాసాలను గిరిజనులు గుర్తించి వేటాడుతున్నారు. ఆ బొరియల్లో మంటలు పెడతారు. ఈ పొగకు తాళలేక అవి బయటకురాగానే పట్టుకుంటారు. అంతేకాకుండా బొరియల వద్ద ఉచ్చులు అమర్చడం ద్వారా సైతం వాటిని పట్టుకుంటారు. ఒక్కో ఆలుగుపై 3-5 కిలోల చిప్పలు లభ్యమవుతాయి. ఈ ఆలుగుకు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష వరకూ ధర ఉంటుందని తెలుస్తోంది. దీంతో స్మగ్లర్లు వాటి కోసం గిరిజనులను మచ్చిక చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న ఈ అరుదైన జీవుతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.