నిషేధాలు లేని పాలన అవసరం
అల్వాల్: ప్రజాస్వామ్య ఉద్యమాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో నిషేధాలు, నిర్బంధాలు, షరతులు లేని స్వపరిపాలన ప్రజలకు అందించాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు. అమరుల బంధుమిత్రుల సంఘం, విప్లవ రచయితల సంఘాల ఆధ్వర్యంలో అల్వాల్ సుభాష్‌నగర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్లవ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు.
ఇటీవల అమరులైన మంగన్న, సంజీవప్ప, మొగిలి, రాములు, సరోజ, బాబూరావు, భారతి, కవితలకు జోహార్లు అర్పించారు. అనంతరం వరవరరావు మాట్లాడుతు ప్రజాస్వామ్య యుతంగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలలో దళిత, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి జరిగినప్పుడే ప్రజలు హర్షిస్తారన్నారు. సామాజిక, ఆర్థిక హామీలను నెరవేరుస్తామంటున్న ప్రభుత్వాధినేతలు నిషేధాలు, నిర్బంధాలు లేని స్వపరిపాలనను అందించాలన్నారు.
బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయడంతో పాటు ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆరు విప్లవ సంఘాలపై విధించిన నిషేదం ఎత్తివేయాలన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలు ఏ రాష్ర్టంలో ఉండాలన్న వాదనను పక్కనపెట్టి గిరిజన హక్కులను కాలరాసే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏడు మండలాలను ముంపునకు గురిచేసి సాధించుకున్న తెలంగాణ హర్షణీయం కాదన్నారు.
స్వర్ణాంద్ర నిర్మిస్తాన్నంటున్న చంద్రబాబు నాయుడు, బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తానంటున్న కె.చంద్రశేఖర్‌రావులు ప్రజాస్వామిక విప్లవ పోరాటంలో అమరులైన వారి కుటుంబాల కడుపుకోతను గమనించాలన్నారు. ప్రజాకళా మండలి, విరసం, డప్పు రమేష్ బృందాలు విప్లవ గీతాలు ఆలపించాయి. ముందుగా సుభాష్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద జెండా ఎగరవేశారు. ఇలా ఉండగా అమరులను తలచుకుంటూ సభలో కన్నీరు పెట్టిన వారి కుటుంబ సభ్యులను చూసిన వారి హృదయాలు ద్రవించాయి.
దమనకాండపై విచారణ జరపాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: శ్రీలంకలో తమిళులపై జరిగిన మారణకాండపై అంతర్జాతీయ జాతీయ స్థాయిలో స్వతంత్ర విచారణ జరపాలని విప్లవ సంఘం నేత పరిమిళ పంజా(తమిళనాడు) డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అమరుల బంధు మిత్రుల సంఘం, విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో గంటి ప్రసాదం ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఇందులో భాగంగా ‘విప్లవ బాటసారి గంటి ప్రసాదం స్మృతి గీతాలు’ సీడీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పరిమిళ పంజా మాట్లాడుతూ ఇప్పటికీ శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న హత్యాకాండను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ప్రజా నాయకత్వంతో ప్రస్తుతం దండకారణ్యంలో నూతన మానవావిష్కారం జరుగుతోందని అన్నారు. నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు కలిసి, పోలవరం పేరిట ఆదివాసులను నిండా ముంచుతున్నార ని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా గంటి ప్రసాదంపై ఉషా పాడిన పాట సభికులను కన్నీరు పెట్టించింది. అమరుల బంధు మిత్రుల సంఘ అధ్యక్షురాలు అంజమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, విరసం కార్యదర్శి వరలక్ష్మి, ప్రొఫెసర్ కాశీం, గంటి ప్రసాదం సతీమణి కామేశ్వరి, యూనివర్సిటీ డిస్కషన్ ఫోరం నాయకులు డేవిడ్ పాల్గొన్నారు.