ఒంటరి విహారం
ఒంటరి మహిళ.. ప్రపంచ పర్యటన... అంటే మాటలు కావు. దానికి ఎంతో గుండె ధైర్యం, సంకల్ప బలం ఉండాలి. ఈ రెండూ మెండుగా ఉన్న యువతి అలిస్సా రామోస్. 6 ఖండాల్లోని 44 దేశాలలో ఎవరితోడూ లేకుండా పర్యటించింది. మనదేశంలోనూ నెలరోజులపాటు పర్యటించింది. ప్రపంచదేశాల స్థితిగతులు, ఆచార వ్యవహారాలను దగ్గరుండి చూసింది. తాను ఒంటిరిని అన్న ఆలోచనతో ఏనాడూ కుంగిపోలేదు. ప్రతిరోజూ తన ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించింది. ఆమె యాత్రా విశేషాలు మనమూ తెలుసుకుందాం!
అలిస్సా రామోస్ దృఢసంకల్పం కలిగిన నేటితరం యువతి. అదే ఆమెను ప్రపంచం మొత్తం పర్యటించేలా చేసింది. స్నేహితులు గానీ కుటుంబ సభ్యులు గానీ ఎవరూ వెంట రాలేదు. కేవలం గోప్రో కంపెనీ కెమెరాను మాత్రమే తోడుగా తీసుకెళ్లింది. ‘మై లైఫ్ ఎ ట్రావెల్ మూవీ.కామ్’ అనే ప్రముఖ ట్రావెల్ ఏజె న్సీతో కలిసి తన ప్రయాణం సాగించింది. ఈ ప్రయాణంలో 28 ఏళ్ల అలిస్సా రామోస్‌కు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభించింది. అలిస్సా ఇన్‌స్టాగ్రామ్‌లో 60 వేల మంది ఫాలోవర్లు అమెకు అండగా నిలవడం విశేషం.
ఒంటరి ప్రయాణం..!
అలిస్సా ఒంటరిగా ప్రపంచ పర్యటన చేయడం వెనక ఓ కథ ఉంది. తొలుత స్నేహితులంతా కలిసి సరదాగా దక్షిణాఫ్రికాకు వెళ్లొద్దామని అనుకున్నారు. తీరా వెళ్లే సమయానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె ఒక్కతే వెళ్లాలని నిర్ణయించుకుంది. ముందు అనుకున్న ప్రకారమే అలిస్సా దక్షిణాఫ్రికా వెళ్లింది. ఈ పర్యటన విజయవంతం అయింది. దీంతో ప్రపంచాన్ని చుట్టి వస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన ఆమె జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. దక్షిణాఫ్రికా అంటే ఎలాగోలా పర్యటించిందిగానీ, ప్రపంచమంటే అంత డబ్బు ఎలా వస్తుంది? అని ఆలోచించింది. ఇందుకోసం తన దక్షిణాఫ్రికా పర్యటనలను రచనలో రూపంలో సోషల్ మీడియా ఆధారంగా పనిచేస్తున్న పలు వెబ్సైట్లకు అందించింది. ఆ విధంగా ఆమెకు వచ్చిన డబ్బునే పర్యటన కోసం వెచ్చించింది.
భారత్ ఓ ప్రత్యేక అనుభూతి..
అలిస్సా భారత్ నుంచి ఎన్నో నేర్చుకున్నారు. ఇండియాలో ప్రతి రాష్ట్రం ప్రత్యేకంగా ఉంటుంది. వివిధ భాషలు, ఆచారాలు, మతాలు అన్ని వేటి కవే ప్రత్యేకం. ప్రధానంగా భారతీయ వస్త్రాధారణ ఆమెను అమితంగా ఆకర్షించింది. అదే ఆమెను చీరకట్టుకోవడం నేర్చుకునేలా చేసింది. ఇక్కడి వంటకాలు కూడా ఆమెకు ఎంతగానో నచ్చాయి. పన్నీర్ కూరలు, ఇరానీ టీ, స్వీట్లు అత్యంత ఇష్టమైన వంటకాలుగా మారాయి. ‘భారతీయలు ఎంతో మర్యాద కలిగి ఉంటారు. వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు. ఇండియాలో క్రికెట్, బాలీవుడ్‌లకు ఎక్కువ ఆదరణ ఉందన్నారు.
అలిస్సా తన పర్యటనల గురించి ఎప్పటికప్పుడు పలు ఆన్లైన్ వెబ్సైట్లకు కథనాలు రాస్తూనే ఉన్నారు. మహిళ ప్రపంచ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు ఎలా ఉంటాయి? అన్న ఆసక్తి తన రచనలకు ఎక్కువ ఆదరణ కలిగేలా చేసిందని అలిస్సా తెలిపారు.
సంస్కృతుల నిలయం
భారతదేశం అలిస్సాను అమితంగా ఆకర్షించింది. ఇక్కడ పర్యటించడం అంటే ఓ విస్తారమైన సంప్రదాయాలు, సంస్కృతులను తెలుసుకోవడమేనని అలిస్సా అభిప్రాయపడ్డారు. ఆసియా పర్యటనల్లో భారత్ పర్యటన ఓ అద్భుతమైన అనుభవాన్ని కలిగించింది అని అలిస్సా అన్నారు. నెల రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ, ఆగ్రా, జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, ముంబై, గోవాలలో పర్యటించారు. భారత్‌లో ఉన్న ప్రజలు అలిస్సాను ఎంతో గౌరవించారని, ఇక్కడ పర్యటన ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. రాజస్థాన్‌లో పర్యటించడం ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందన్నారు. జైపూర్‌లో తొలిసారిగా పర్యటించినప్పుడు అక్కడి రాజభవనాన్ని చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. తాను అక్కడ కొన్న గాజులు, ఏనుగుపై ప్రయాణం చాలా ఆనందాన్ని ఇచ్చాయన్నారు. జోధ్‌పూర్ అత్యంత ప్రియమైన నగరం అని తెలిపారు. జోధ్‌పూర్ ప్యాలెస్‌లో బస చేసినప్పుడు నిజమైన తనకు తాను రాణిగానే భావించానంది.