అసాంఘిక శక్తుల అణచివేతలో రాజీ పడొద్దు
కర్నూలు: అసాంఘిక శక్తుల అణచివేతలో రాజీ పడొద్దని ఎస్పీ ఆకే రవికృష్ణ హోంగార్డులకు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో హోంగార్డులకు వారం రోజుల పాటు నిర్వహించిన మొబలైజేషన్ తరగతుల ముగింపు వేడుకలను శనివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి హాజరైన హోంగార్డులకు ఇండోర్, ఔట్‌డోర్ తరగతుల్లో శిక్షణనిచ్చారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకుని విధి నిర్వహణలో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వ్యాయామానికి ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పోలీసు శాఖలో పనిచేసే ఉద్యోగి ఒక్కరు తప్పు చేసినా శాఖ అంతటికీ చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు.
నంద్యాల హోంగార్డు యూనిట్లో పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన పవన్‌కుమార్(హెచ్‌జీ527) సతీమణి ఆశకు రూ.28 వేల చెక్కును అందజేశారు. నంద్యాల హోంగార్డు యూనిట్ సిబ్బంది ఈ మొత్తాన్ని పోగు చేసి పవన్‌కుమార్ సతీమణికి ఎస్పీ చేతుల మీదుగా అందించారు. ఆశకు హోంగార్డు ఉద్యోగం కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
మొబలైజేషన్ ముగింపు వేడుకలో మంచి టర్నవుట్‌తో ప్రతిభ కనబరచిన సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డును అందజేశారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. కార్యక్రమంలో హోంగార్డ్ డీఎస్పీ కృష్ణమోహన్, ఆర్ఎస్ఐ మోహన్‌రెడ్డి, హోంగార్డు యూనిట్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.