తెప్పపై వినాయకుడి విహారం
కాణిపాకం, న్యూస్‌లైన్: స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరిదైన తెప్పోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు కొలువుదీరి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
అనంతరం చందనాలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాల సమర్పణ జరిపారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారిని వేంచేపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య స్వామివారిని సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులను చేశారు. స్వామివారు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. జై గణేశ.. జై జై గణేశ నామస్మరణతో కాణిపాకం మారుమోగింది.
తెప్పోత్సవానికి పుండరీకనాయుడు, శేషాద్రినాయుడు ఆయన సోదరులు, దామోదరనాయుడు, హనుమంతనాయుడు, రామకృష్ణారెడ్డి కుమారులు, కొత్తపల్లె దామోదరనాయుడు, రామచంద్రనాయుడు, లంకిపల్లె మోహన్‌బాబు ఆయన సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈవో పూర్ణచంద్రరావు, ఈఈ వెంకటనారాయణ, ఏసీ ఆదికేశవపిళ్లె, ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి తది తరులు పాల్గొన్నారు.
వినాయకుని మహాప్రసాదం వేలం
వినాయకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా 21కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఆదివారం రాత్రి బహిరంగ వేలం వేశారు. 21రోజుల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 21కేజీల లడ్డూ ప్రసాదాన్ని మూలవిరాట్ వద్ద నైవేద్యంగా ఉంచి ఆస్థాన మండపంలో బహిరంగవేలం వేశారు. ఈ లడ్డూ ప్రసాదం కోసం భక్తులు పోటీ పడ్డారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి తెప్పోత్సవంతో విజయవంతంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు దేవస్థానం వారు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తదుపరి 11రోజులు ఉభయదారుల అధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారికి వాహనసేవలు నిర్వహించారు.