amalapuram police
-
బొమ్మ తుపాకీతో డ్యాన్సులు.. దిమ్మ తిరిగే షాకిచ్చిన పోలీసులు
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): ఇద్దరు యువకులు ఓ బొమ్మ తుపాకీతో సరదాగా చేసిన హడావుడి.. చివరకు వారికి దిమ్మ తిరిగేలా చేసింది. అమలాపురం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాంబాబు శుక్రవారం సాయంత్రం ఈ వివరాలను విలేకర్లకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన పోలిశెట్టి శివ గంగాధర్ ఏడాది కిందట కాకినాడలో ఏర్పాటు చేసిన ఓ క్రాఫ్ట్ బజారులో రూ.1,500కు ఓ బొమ్మ తుపాకీ కొన్నాడు. దానిని అలంకారంగా ఇంట్లో గోడకు తగిలించాడు. గ్రామంలో గురువారం రాత్రి మరిడమ్మ జాతర జరిగింది. ఆ జాతరకు తన అన్న కొడుకైన ఎనిమిదేళ్ల నందన్‌తో కలిసి శివ గంగాధర్ వెళ్లాడు. ఆ బాలుడి ముచ్చట పడటంతో వెంట బొమ్మ తుపాకీ కూడా తీసుకు వెళ్లాడు. వారికి దగ్గర బంధువైన పోలిశెట్టి నరసింహమూర్తి కూడా కలిశాడు. జాతరలో ఒక స్టేజీపై యువకులు సినిమా పాటలకు అనుగుణంగా డీజేలతో డ్యాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓ పాటకు అనుగుణంగా శివ గంగాధర్, నరసింహమూర్తి కూడా నృత్యాలు చేశారు. ఆ క్రమంలో బొమ్మ తుపాకీ పైకెత్తి చిందులు వేస్తూ సందడి చేశారు. అయితే నిజమైన తుపాకీతో వారు హల్చల్ చేసినట్టు ఒక టీవీ చానల్‌తో పాటు సోషల్ మీడియాలో శుక్రవారం ఉదయం వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. చల్లపల్లి చేరుకుని లోతైన విచారణ జరిపారు. చివరకు జాతరకు ఓ చిన్న పిల్లాడితో కలిసి వచ్చిన ఆకతాయిలు ఆ బొమ్మ తుపాకీ పట్టుకుని సరదాగా తిరిగారని తేల్చారు. బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకుని, దానితో జాతరకు వచ్చిన శివ గంగాధర్, నరసింహమూర్తిలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. చెక్క, పల్చటి రేకు గొట్టాలతో ఆట»ొమ్మలా తయారు చేసిన ఆ బొమ్మ తుపాకీని డీఎస్పీ విలేకర్లకు చూపించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ విలేకర్ల సమావేశంలో అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు, ఉప్పలగుప్తం ఎస్సై జి.వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. -
'దొంగ' పనిమనిషి అరెస్ట్
సాక్షి, అమలాపురం టౌన్(తూర్పు గోదావరి): ఓ వృద్ధురాలి వద్ద పనిమనిషిగా చేరిన రోజే రూ.8.60 లక్షల విలువైన 23 కాసుల బంగారు నగలను దోచుకెళ్లిన మాయ‘లేడీ’ని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేసి దోచుకెళ్లిన సొత్తు అంతా ఆమె నుంచి రికవరీ చేశారు. అమలాపురం కల్వకొలనువీధిలో పక్షవాతంతో మంచంపై చికిత్స పొందుతున్న పలచర్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్దురాలికి సపర్యలు కోసం పనిమనిషిగా ఎరువ మేరీ సునీత రావడం..వచ్చిన రోజే అంటే ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బంగారు నగలతో పరారు కావడం వంటి పరిణామాలు తెలిసిందే. పనిమనిషిగా చేరి చోరీకి పాల్పడిన 42 ఏళ్ల మేరీ సునీత గుంటూరు జిల్లా గురజాల మండలం రెంటచింతల గ్రామవాసిగా అమలాపురం పోలీసులు గుర్తించారు. చోరీ జరగగానే విజయవాడ, హైదరాబాద్‌కు వెళ్లిన రెండు పోలీసు బృందాలు ఆమెను వెంటాడి అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నాయి. విజయవాడ శ్రీనివాస హోం కేర్ సర్వీస్ సెంటర్ ద్వారా మేరీ సునీతను అమలాపురంలో అనంతలక్ష్మి వద్ద పనిమనిషిగా పెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 9 గంటలకు అమలాపురం ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద మేరీ సునీతను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న రూ.8.60 లక్షల విలువైన బంగారు నగలను డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఎస్కే బాజీలాల్ స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చూపించి, వివరాలను వెల్లడించారు. (చదవండి: తొలి రోజే 24 కాసుల బంగారంతో ఉడాయింపు) ప్రతిచోటా పనిమనిషి ముసుగులోనే చోరీలు గత కొన్నేళ్లుగా ధనికులైన వృద్ధుల వద్ద సపర్యలకు పనిమనిషిగా చేరి ఆ ముసుగులో చోరీ చేయడంలో మేరీ సునీత చేయి తిరిగిన నేరస్థురాలని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ తరహాలో హైదరాబాద్‌లో ఆమె 11 కేసులు, విశాఖపట్నంలో రెండు కేసుల్లో నిందితురాలు. ఈ 13 కేసులకు సంబంధించి మూడు కేసుల్లో జైల్లో శిక్షలు కూడా అనుభవించిందని చెప్పారు. అమలాపురం చోరీ కేసుకు సంబంధించి ఆమె ఎంత బంగారం దోచుకెళ్లిందో అంత బంగారాన్ని కేవలం రెండు రోజుల్లో సీఐ బాజీలాల్ బృందం రికవరీ చేసిందన్నారు. మేరీ సునీత సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా సాంకేతికత సహాయంతో ఆమె కదలికలను గుర్తించి పట్టుకున్నామన్నారు. ఈ కేసులో డీఎస్పీ మాధవరెడ్డి, ఇన్చార్జి డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, సీఐ బాజీలాల్, పట్టణ ఎస్సైలు ఎం.ఏసుబాబు, కె.చిరంజీవి, జిల్లా ఐటీ కోర్ క్రైమ్ ఎస్సై ఎం.ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ మామిళ్లపల్లి సుబ్బరాజు, కానిస్టేబుళ్లు మల్లాడి హరిబాబు, రమేష్‌బాబు, వీరబాబు, నాగేంద్రబాబు, ఎం.మూర్తి, సీహెచ్ మాధవిలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి అభినందించారు. -
రైస్ 'కిల్లింగ్'!
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: బియ్యాన్ని ఆకర్షించే మహిమ కలిగిన అద్భుత యంత్రం ఇంట్లో ఉంటే మహర్దశ పడుతుందనే మూఢ నమ్మకం నిండు కుటుంబాలను బలి తీసుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్ పెన్మెత్స రామకృష్ణంరాజు కుటుంబ ఆత్మహత్యకు రైస్ పుల్లర్ మోసమే కారణమని పోలీసులు నిర్ధారించారు. రైస్ పుల్లర్ పేరుతో రూ.5 కోట్లు కాజేసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకట వేణుధరప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు అమలాపురం పోలీసులు మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రసాద్ మరో ముగ్గురితో కలసి ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు రామకృష్ణంరాజు నుంచి రూ.5 కోట్లకుపైగా వసూలు చేశాడు. అప్పుల పాలైన రామకృష్ణంరాజు (55), భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు డాక్టర్ కృష్ణసందీప్ (25) నాలుగు రోజుల క్రితం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే. అతీత శక్తుల పేరుతో మోసాలు.. బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాన్ని రైస్ పుల్లర్‌గా పరిగణిస్తారు. అత్యంత అరుదైన, ఖరీదైన ఇరీడియం లోహాన్ని కలిగి వుండే వీటిని చూపించి మోసగిస్తున్నారు. అతీత శక్తుల పేరుతో వీటిని విక్రయించడం భారతీయ శిక్షాస్మృతి 415, 420 ప్రకారం నేరం. తేలికగా డబ్బులు సంపాదించేందుకు కొందరు ముఠాలుగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో రేడియేషన్ ఆర్టికల్ అమ్మకాలతో మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి దివ్య శక్తులు ఉంటాయని, ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని నమ్మించి మోసగిస్తున్నారు. రాగి లోహంతో చేసిన గ్లాసులు, గిన్నెలు, బిందెలు, మూతలు, విగ్రహాలు, నగలు, పాతకాలం నాణేలు లాంటివి రైస్ పుల్లర్ పరికరాలుగా చలామణి అవుతున్నాయి. నల్ల పసుపు, ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర కలబంద లాంటి మొక్కల్లో కూడా రైస్ పుల్లర్ లక్షణాలున్నాయని నమ్మబలుకుతున్న ముఠాలు కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్న ఏడుగురితో కూడిన ముఠాను ఈ ఏడాది జూలైలో మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసగిస్తున్న ముఠాను ఇటీవల తిరువనంతపురంలో అరెస్టు చేశారు. రైస్ పుల్లింగ్ అంటే...? రైస్ అంటే బియ్యం... పుల్లింగ్ అంటే లాక్కోవడం. సాధారణంగా ఓ వస్తువుకు కొద్ది గంటలపాటు అయస్కాంతాన్ని రాపిడి చేస్తే కొద్దిసేపు ఆకర్షణ గుణాన్ని పొందుతుంది. రైస్ పుల్లింగ్‌లో దీన్ని అద్భుత శక్తిగా నమ్మిస్తారు. పురాతన లోహ విగ్రహాలు, పాత్రలు, నాణేలను రైస్ పుల్లింగ్ ముఠా తమ మోసాలకు ముడి సరుకుగా వాడుతుంది. వీటికి అయస్కాంతాన్ని రుద్దడం ద్వారా బియ్యపు గింజలను ఆకర్షించి ప్రజలను మోసగిస్తున్నారు. పురాతన వస్తువుల పేరుతో రూ.కోట్లు కాజేస్తున్నారు. -
అయ్యా.. రౌడీషీటర్ గారూ..
- అమలాపురం పోలీసుల రివర్స్ ఎటాక్ అమలాపురం టౌన్: ఓ రౌడీషీటర్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఝలక్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు. ఆ రౌడీషీటర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై ఆయనో రౌడీ అంటూ మరో ఫ్లెక్సీ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు. అమలాపురంలో ఆరు రౌడీ గ్యాంగ్‌లున్నాయి. దానిలో కొలగాని స్వామినాయుడు ఎలియూస్ నాయుడుపై కూడా రౌడీషీట్ ఉంది. శనివారం అతని పుట్టినరోజు కావడంతో అతని అనుచరులు పట్టణంలో 22 చోట్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే విధంగా గడియారంస్తంభం సెంటర్లో, అందునా మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న ట్రాఫిక్ ఐల్యాండ్పై భారీ సైజులో నాయుడు ఫ్లెక్సీ పెట్టటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అదే ఫ్లెక్సీపై ‘రౌడీషీటర్ గారు శ్రీ కొలగాని నాయుడు గారు... ఇట్లు అమలాపురం టౌన్ పోలీసు’ అని రాసి ఉన్న చిన్న ఫ్లెక్సీలను అతికించారు. ఒకపక్క క్రికెట్ బ్యాట్, మరోపక్క నెత్తురుతో ఉన్న కత్తి బొమ్మలను ఆ ఫ్లెక్సీపై ముద్రించారు. పోలీసుల చర్య పట్టణవాసుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఇటీవల రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. ఆ చర్యల్లో భాగంగానే ఈ రివర్స్ ఫ్లెక్సీని పోలీసులు ఏర్పాటు చేశారు.