బొమ్మ తుపాకీని విలేకర్లకు చూపిస్తున్న డీఎస్పీ రాంబాబు. చిత్రంలో సీఐ సురేష్‌బాబు, ఎస్సై వెంకటేశ్వరరావు
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): ఇద్దరు యువకులు ఓ బొమ్మ తుపాకీతో సరదాగా చేసిన హడావుడి.. చివరకు వారికి దిమ్మ తిరిగేలా చేసింది. అమలాపురం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్.రాంబాబు శుక్రవారం సాయంత్రం ఈ వివరాలను విలేకర్లకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన పోలిశెట్టి శివ గంగాధర్ ఏడాది కిందట కాకినాడలో ఏర్పాటు చేసిన ఓ క్రాఫ్ట్ బజారులో రూ.1,500కు ఓ బొమ్మ తుపాకీ కొన్నాడు. దానిని అలంకారంగా ఇంట్లో గోడకు తగిలించాడు. గ్రామంలో గురువారం రాత్రి మరిడమ్మ జాతర జరిగింది.
ఆ జాతరకు తన అన్న కొడుకైన ఎనిమిదేళ్ల నందన్‌తో కలిసి శివ గంగాధర్ వెళ్లాడు. ఆ బాలుడి ముచ్చట పడటంతో వెంట బొమ్మ తుపాకీ కూడా తీసుకు వెళ్లాడు. వారికి దగ్గర బంధువైన పోలిశెట్టి నరసింహమూర్తి కూడా కలిశాడు. జాతరలో ఒక స్టేజీపై యువకులు సినిమా పాటలకు అనుగుణంగా డీజేలతో డ్యాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓ పాటకు అనుగుణంగా శివ గంగాధర్, నరసింహమూర్తి కూడా నృత్యాలు చేశారు. ఆ క్రమంలో బొమ్మ తుపాకీ పైకెత్తి చిందులు వేస్తూ సందడి చేశారు.
అయితే నిజమైన తుపాకీతో వారు హల్‌చల్ చేసినట్టు ఒక టీవీ చానల్‌తో పాటు సోషల్ మీడియాలో శుక్రవారం ఉదయం వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. చల్లపల్లి చేరుకుని లోతైన విచారణ జరిపారు. చివరకు జాతరకు ఓ చిన్న పిల్లాడితో కలిసి వచ్చిన ఆకతాయిలు ఆ బొమ్మ తుపాకీ పట్టుకుని సరదాగా తిరిగారని తేల్చారు. బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకుని, దానితో జాతరకు వచ్చిన శివ గంగాధర్, నరసింహమూర్తిలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. చెక్క, పల్చటి రేకు గొట్టాలతో ఆట»ొమ్మలా తయారు చేసిన ఆ బొమ్మ తుపాకీని డీఎస్పీ విలేకర్లకు చూపించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ విలేకర్ల సమావేశంలో అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు, ఉప్పలగుప్తం ఎస్సై జి.వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment