సేవకు మరణం లేదు!
దిక్కులేని వాళ్లు కనిపిస్తే...
ఒక జాలి చూపు చూస్తారు...
అనాథ శవం కనిపిస్తే...
దగ్గరకు పోతే ఏమవుతుందో అని పారిపోతారు.
ఎవరైనా ఒంట్లో శక్తి లేకుండా
బిచ్చమెత్తుకుంటూ ఉంటే...
ఒక రూపాయి దానం చేసి
ఛాతీ నిండా గాలిపీల్చుకుంటారు.
శ్రీనివాస్ మాత్రం...
రాణంతో ఉంటే వైద్యం చేయిస్తాడు...
ప్రాణం లేకపోతే మార్చురీకి తరలిస్తాడు.
మనిషికి మరణం ఉంటుంది
కానీ సేవతో అమరం కావాలంటాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ రోడ్ల మీద వెళ్తుంటే ఒక వాల్‌పోస్టర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందులో మదర్ థెరిసా, శిలువ, ఓం, కృపాణాలు, మసీదు, స్వామి వివేకానంద చిత్రాలు, వాటి కింద ఒక వ్యక్తి ఫొటో ఉంటాయి. పక్కన వృద్ధులు, వికలాంగులు, గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీకి తరలించాలన్నా, అంధులు, హెచ్ఐవి, కుష్టు రోగులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ దిక్కులేకుండా పడి ఉన్నా, వారిని హాస్పిటల్‌కు తరలించాలన్నా ఒక ఫోన్ కాల్ చేయండి అంటూ 9849420641ఫోన్ నంబరు ఉంటుంది. ప్రకటనలో చెప్పినట్లే... ఫోన్ కాల్ అందుకున్న వెంటనే నిమిషాల్లో అక్కడ ప్రత్యక్షమవుతారు శ్రీనివాస్. రోగులను హాస్పిటల్‌కు చేరవేస్తారాయన. వారందరి ఫొటోలు తీసి దగ్గరుంచుకుంటాడు. ‘‘వేలి ముద్రల సేకరణ పోలీసులకు ఉపయోగపడుతుంది. ఇక ఫొటోలు... కొంతమంది తమ వాళ్లు తప్పిపోయారని వెతుకుతుంటారు. వారికి నా దగ్గరున్న ఫొటోలు ఉపయోగపడతాయి’’ అంటాడు.
శ్రీనివాస్ తండ్రి వరంగల్ జిల్లా జనగాం నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ముషీరాబాద్‌లో ఆరవ తరగతి చదువుకుంటున్న రోజుల్లో చేపల మార్కెట్ దగ్గర ఒక వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. అతడి ముఖం మీద నీళ్లు చల్లి లేవదీసి తన బాక్సులో అన్నం పెట్టాడు శ్రీనివాస్. స్థానికుల సహాయంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఒకరు బాధలో ఉంటే మనసు స్పందించిన తొలి సంఘటన అదేనంటారాయన. స్కూల్లో టీచర్లు, తోటిపిల్లలు ప్రశంసలతో ముంచెత్తడంతో తాను చేసింది మంచి పని అని తెలిసింది. డిగ్రీలో సోషల్ వర్క్ ఒక సబ్జెక్టుగా చదవడానికి ఇవన్నీ కారణమే అంటూ... ‘‘ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడాన్ని ఒక పద్ధతిగా చేయడానికి చదువు బాగా ఉపయోగపడింది. నగరంలోని 24 పోలీస్ స్టేషన్లలో నా వివరాలు, పోస్టర్లు ఉంటాయి. బేకరీలు, రోడ్డు పక్కన ఉండే కిళ్లీ బడ్డీలకు నా ప్రకటన పత్రికలు కనిపిస్తాయి. ఎప్పుడు ఎవరికి నా అవసరం ఏర్పడుతుందో ఊహించలేం. రోడ్డు మీద దిక్కులేకుండా పడి ఉన్న వాళ్లను చూసిన వాళ్లకు ఈ ప్రకటన గుర్తొస్తే చాలు. నాకు ఒక ఫోన్ చేస్తారు’’ అంటారు. ప్రాణాలు కోల్పోయిన వారిని మార్చురీకి తరలించడం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని హాస్పిటల్లో చేర్చడం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అనాథ ఆశ్రమాలకు పంపించడం ఇతడి దైనందిన కార్యక్రమం. అనారోగ్యం నుంచి సాంత్వన పొందిన వారికి దారి ఖర్చులకు డబ్బిచ్చి మరీ సొంత ఊరికి పంపిస్తారు. ‘‘సెకండ్ హ్యాండ్ బైకులు, కార్లను కొనడం, అమ్మడం నా వ్యాపారం. రాబడి బాగానే ఉంటుంది. కాబట్టి ఇంతవరకూ ఇబ్బంది రాలేదు. నా భార్య అనూరాధ మొదట్లో నన్ను ప్రోత్సహించింది. కానీ, పిల్లలు పెద్దవుతున్నారు, స్కూల్లో చేరిస్తే ఖర్చులు పెరుగుతాయి, పైగా ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియక ఇంట్లో వాళ్లకు ఆందోళన. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న గొడవలవుతున్నాయి’’ అన్నారు శ్రీనివాస్ నవ్వుతూ.
నగరంలో యాచకులు, రోడ్డు మీద ప్రాణాలు వదిలే అభాగ్యులు ఉండకూడదన్నదే తన జీవితాశయం అంటారు శ్రీనివాస్. ఇలాంటి బృహత్తర యజ్ఞాన్ని ఒక్కరుగా చేస్తూ పోతే కొంతకాలానికి ఆగిపోతుంది. కాబట్టి తన ఆలోచనలకు ప్రభావితమవుతున్న యువకులను సమీకరించి, తన కార్యకలాపాల్లో భాగం చేస్తున్నారు. ‘‘మనకు చావు ఉంటుంది, కానీ మనం చేసే పనికి మరణం ఉండకూడదు. అందుకే నా ప్రయత్నాన్ని విస్తరించాలనే ఉద్దేశంలో ఉన్నాను. ప్రతి ఒక్కరూ సామాజికసేవకులు కావాలి’’ అంటారు శ్రీనివాస్.
- వాకా మంజులారెడ్డి
ఎక్కడ అవసరమైతే...
నాకు శ్రీనివాస్ ఏడాదికి పైగా తెలుసు. రోడ్డు మీద నిస్సహాయంగా పడిపోయిన వాళ్లని లేపి అన్నం తినిపించి, స్నానం చేయించి బట్టలిస్తాడు. మాకంటే ముందు అతడికే సమాచారం వెళ్తుంది. కొన్నిసార్లు అతడే మాకు సమాచారం అందిస్తాడు.
బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టాలంటే మరుసటి రోజుకు రక్తదానం చేయాలనే ఆసక్తి ఉన్నవారిని తీసుకొచ్చి మా ముందు నిలబెడతాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆపన్నులకు మా నుంచి అందే సర్వీస్ కంటే శ్రీనివాస్ నుంచి ఎక్కువ అందుతోంది.
- అమరకాంత్ రెడ్డి, ఏసీపీ, హైదరాబాద్