కార్పొరేట్ కంపెనీలు గ్రామాలపై దృష్టి పెట్టాలి
నైపుణ్యం పెంచుకుంటే ఆదాయం పెరుగుతుంది
⇒అమరరాజా గ్రోత్ కారిడార్ ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు
చిత్తూరు నుంచి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి: నైపుణ్యం పెంచుకుంటే అధికాదాయాన్ని పొందవచ్చని, ఇందుకోసం గ్రామీణ యువత నైపుణ్యం సంపాదించడంపై దృష్టిసారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గ్రామీణ యువత స్కిల్స్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తగుచర్యలు తీసుకుంటోందన్నారు.
గురువారం చిత్తూరు సమీపంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అమరరాజా గ్రోత్ కారిడార్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలన్నారు. మౌలికవసతులు లేని మారుమూల గ్రామాల్లో యూనిట్‌ను ఏర్పాటు చేసి అమరరాజా కార్పొరేట్ సంస్థలకు ఆదర్శంగా నిలిచిందని, అదే బాటలో మిగిలిన సంస్థలు కూడా నడవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అనేక మౌలిక వసతులు ఉన్నాయని, వీటిని వినియోగించుకోవడం ద్వారా 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
నంబర్ వన్ స్థానంపై దృష్టి ..
వచ్చే పదేళ్లలో బ్యాటరీల తయారీలో మొదటి స్థానంలో నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమరరాజా గ్రూపు వైస్ చైర్మన్ జయదేవ్ గల్లా పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలను కొనుగోలు అంశాలను కూడా పరిశీలిస్తామన్నారు. 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రోత్ కారిడార్ వచ్చే నాలుగైదేళ్ళలో రూ. 4,500 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా మరో 20,000 మందికి ఉపాధి కల్పించగలదన్నారు. ప్రస్తుతం అమరరాజా గ్రూపులో సుమారు 12,500 మంది పనిచేస్తున్నారు.