వేద పరిరక్షణ అందరి బాధ్యత
బోట్‌క్లబ్ :
వేద పరిరక్షణ అందరి బాధ్యతని ప్రముఖ అధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. రామారావుపేట శివాలయంలో ఆదివారం వేద విజ్ఞాన ప్రతిష్టానమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేదస్మార్త పరీక్షలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేదాలను పరిరక్షించడం ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని అందరూ కాపాడినవారవుతారన్నారు. ప్రతిష్టాన వేద విభాగ అధ్యక్షుడు పండిత రాయప్రోలు ప్రసాదశర్మ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా క్రమం తప్పకుండా వేద స్మార్త పరీక్షలు నిర్వహిస్తూ ఆలయ పూజా విధానంలో సుశిక్షితులైన పండితులను తయారుచేసేందుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు. వేద విజ్ఞాన ప్రతిష్టానమ్ అధ్యక్షుడు, ప్రముఖ జ్యోతిషు్యడు చెరుకుపల్లి లక్ష్మీనృశింహశర్మ మాట్లాడుతూ మంత్రోచ్చరణతో అనేక మంచి కార్యక్రమాలు ప్రజలకు, సమాజానికి అందించవచ్చునని దాని కోసం స్వరభరిత మంత్ర పఠనానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతర పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. పండితులు దువ్వూరి సర్వేశ్వర ఘనాపాటి, కపిలవాయి రామశాస్త్రి, యనమండ్ర వెంకట సూర్యనారాయణ , చింతా చలపతిశర్మ, శ్రీపాద రాజశేఖర శర్మ, కోట పంచముఖి శర్మ, మహంకాళి రాజదత్తాత్రేయ శర్మ పాల్గొన్నారు.