దిగ్గజ ఈతగాడు
అంబర్‌పేట ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్‌లో రోజూ ఉదయాన్నే ఒక ‘జలపుష్పం’ కనిపిస్తుంది. డెబ్బయ్యారేళ్ల ఆ విన్యాసకుని పేరు డాక్టర్ రాజ్‌కుమార్. నిజాంతో పోరాడి, హైదరాబాద్ స్టేట్‌కు స్విమ్మింగ్ క్రీడను పరిచయం చేసిన ఖాన్‌దానీ! స్విమ్మింగ్ క్రీడలో దేశంలోనే మరెవరూ సాధించనన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలను గెలిచిన లివింగ్ లెజెండ్, ‘ట్రయథ్లెట్’ (స్విమ్మింగ్-సైక్లింగ్-రన్నింగ్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కుమార్‌తో సంభాషణ ఆయన మాటల్లోనే...
మా కుటుంబం తమిళనాడు నుంచి 1920ల్లో నగరానికి వచ్చింది. నాన్న కోమలేశ్వర్ జగన్నాథం నిజాం ప్రభుత్వ ఆహ్వానంపై ఉన్నతోద్యోగిగా ఏజీ ఆఫీసులో చేరారు. అప్పటి మద్రాసు రాష్ట్రంలో నాన్న పేరున్న స్విమ్మర్. ఈత ఆయనకు ఆరో ప్రాణం. హైదరాబాద్ స్టేట్ స్పోర్ట్స్ కరిక్యులంలో ఈత ఉండేది కాదు. బ్రిటిష్ ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఈతను ఒక క్రీడగా గుర్తించి ప్రోత్సహించాలని దాదాపు పదేళ్లు నిజాం ప్రభుత్వంతో పోరాడారు.
ఇల్లు.. ఇందిరా పార్క్
ట్యాంక్‌బండ్ కట్ట మైసమ్మ గుడిని ఆనుకుని రెండెకరాల్లో మా ఇల్లు ఉండేది. తర్వాత ఈ ప్రాంతం ఇందిరా పార్క్ అయింది. నాన్న పట్టుదలతో ఇంటి ముందు ఈత కొలను ఏర్పాటు చేశారు. సొంతగా ఒక టీమ్ తయారు చేశారు. హనుమాన్ వ్యాయామశాల ‘రత్నం’ ఆ టీమ్ సభ్యుడే. మా పెద్దన్న సుబ్రహ్మణ్యం, అక్క సరస్వతీబాయి టీమ్ సభ్యులే. అక్క హైదరాబాద్ స్టేట్‌లోనే తొలి మహిళా స్విమ్మర్. ఈ జట్టు జాతీయ స్థాయిలో పతకాలు సాధించ డం, పత్రికలు ప్రశంసించడం గమనించిన నిజాం 1930వ దశకంలో ఈతను క్రీడగా గుర్తించాడు.
పదేళ్ల వయసులోనే గోల్డ్ మెడల్
నేను 1948లో పదేళ్ల వయసులోనే తొలి గోల్డ్ మెడల్‌ను అందుకున్నా. 66 ఏళ్లుగా ఏటా ఈత పోటీల్లో మెడల్స్ సాధిస్తున్నా. నిరుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన నేషనల్ స్విమ్మింగ్ 4 విభాగాల్లో బంగారు పతకాలు వచ్చాయి. 1959, మే 17న తాళ్లతో కాళ్లూ చేతులు కట్టుకుని, హుస్సేన్‌సాగర్‌లో దూకా. శరీరాన్ని కదిలిస్తూ 27 గంటలు ఈదా. అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్య అభినందించారు.
ఈత వస్తే ప్రమోదాలే!
ఈత వస్తే ప్రమాదాలు నిశ్చయంగా కనీస స్థాయికి తగ్గుతాయి. ప్రమాదాలను ప్రమోదాలుగా మార్చుకోవచ్చు. వాస్తవానికి ప్రతి ఒక్కరికీ పుట్టక ముందే ఈత వస్తుంది. తల్లి కడుపులో ఈదే కదా లోకంలోకి వస్తాం. ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేసిన అనుభవంతో చెబుతున్నా... క్రీడగా ఈత నేర్చుకుంటే ప్రాణభయం ఉండదు. 90 శాతం ఫిట్నెస్ ఉంటుంది.
జలాశయాలేవి!
నా నగరం చేపలతో నిండిన జలాశయంలా ఉండాలి ప్రభూ అన్నారు కులీకుతుబ్ షా. ఇప్పుడు జనం కిటకిటలాడుతున్నా, జలాశయాలే కనుమరుగయ్యాయి. ఈతను నిర్బంధ విద్యలో భాగం చేయాలి. ఎంత ఐటీ చదువులు చదివినా ఏంలాభం? బతుకు జ్ఞానం లేకపోతే! నీవు అజ్ఞానివి అని పడవ వాడిని ఈసడించిన ‘వేదజ్ఞాని’ ఈత రాక అంతమైన కథ నుంచి మనం నేర్వాల్సిన పాఠం అదే!
పున్నా కృష్ణమూర్తి