మనకంటే ముందే అమెరికాకు ఎలా?
మాంచెస్టర్ బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారం లండన్ పోలీసులు మీడియాకు చెప్పడానికి ముందే అమెరికా మీడియాలో ఆ విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. వాళ్లకు ఈ సమాచారం లీక్ కావడం బ్రిటిష్ హోం మంత్రికి బాగా చికాకు తెప్పించింది. పేలుడుకు సంబంధించి బయటకు వెళ్లే సమాచారం మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించి, తమ దర్యాప్తునకు విఘాగం కలగకుండా చూసుకోవడంలో బ్రిటిష్ పోలీసులకు అన్ని రకాలుగా స్పష్టమైన సూచనలు ఇచ్చామని, కానీ అదేమీ లేకుండా అమెరికన్ మీడియా మాత్రం ఇష్టారాజ్యంగా ఏవి పడితే అవి ప్రచురించిందని హోం మంత్రి అంబర్ రడ్ బీబీసీ రేడియోతో చెప్పారు.
ఇది చాలా ఇరిటేటింగ్‌గా ఉందని, అధికార వర్గాల నుంచి కాకుండా వేరే వర్గాల నుంచి సమాచారం లీక్ అవ్వడానికి వీల్లేదని, ఇదే విషయాన్ని తన మిత్రులకు (అధికారులకు) మళ్లీ మళ్లీ చెబుతున్నానని ఆమె అన్నారు. దర్యాప్తు సక్రమంగా సాగకుండా అమెరికన్ అధికారులు ఏమైనా అడ్డుపడుతున్నారా అని ప్రశ్నించగా, తాను అంత దూరం వెళ్లబోనన్నారు. ఇక్కడి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని, ఇలాంటిది ఇంకోసారి జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అమెరికన్ పాప్ స్టార్ అరియానా గ్రేండ్ కచేరీ సాగుతుండగా సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించిన సంగతి తెలిసిందే. సల్మాన్ అబేది అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అతడి పేరు ముందుగా అమెరికన్ మీడియాలోనే వచ్చింది. అందుకే అక్కడి హోం మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.