amby valley
-
యాంబీ వ్యాలీ నిర్వహణ కష్టం
న్యూఢిల్లీ: వేలానికి సిద్ధమవుతున్న సహారా గ్రూప్ యాంబీ వ్యాలీ ఆస్తుల నిర్వహణ కష్టమని బొంబాయి హైకోర్టుకు చెందిన అఫీషియల్ రిసీవర్ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు. గతేడాది నవంబర్ 23న కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేస్తూ.. యాంబీ వ్యాలీ ఆక్రమణలకు అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకని వేలం పూర్తయ్యే వరకూ యాంబీ వ్యాలీ ఆస్తుల కస్టోడియన్‌గా వ్యవహరించాలని హైకోర్టు అధికారిక రిసీవర్‌ను ఆదేశించింది. అయితే కస్టోడియన్‌గా విధుల నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రత్యేక ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ అధికారిక రిసీవర్ సుప్రీంను ఆశ్రయించారు. ఒక తేదీని నిర్ణయించి కేసు విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ సూచించింది. మదుపరులకు రెండు సహారా గ్రూప్ కంపెనీలు దాదాపు రూ.25,000 కోట్ల పునఃచెల్లింపుల కేసులో యాంబీ వ్యాలీ వేలానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
యాంబీ వ్యాలీ వేలానికి సహకరించట్లేదు..!
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీ వేలానికి సహారా సహకరించడం లేదని పేర్కొంటూ సహారాపై సుప్రీంకోర్టులో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. సత్వరం ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్‌ని సెబీ న్యాయవాది కోరారు. మంగళవారం నుంచీ వేలం ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా సహారా సహకరించకపోవడం వల్ల ఆలస్యం అవుతోందని వివరించారు. అయితే కేసును విచారిస్తున్న బెంచ్‌లోని మరో ఇరువురు న్యాయమూర్తులతో చర్చించి, పిటిషన్ విచారణ తదుపరి తేదీని తెలుపుతామని జస్టిస్ గొగోయ్ చెప్పారు. కేసును విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో సభ్యులైన ప్రధాన న్యాయమూర్తి మిశ్రా, జస్టిస్ శిక్రీలు వేర్వేరు బెంచ్‌ల్లో (కాంబినేషన్లలో) ఉన్న నేపథ్యంలో జస్టిస్ గొగోయ్ ఈ విషయం తెలిపారు. సహారా సంస్థలు రెండు ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 37,000 కోట్లు చెల్లించాల్సిన కేసులో యాంబీ వ్యాలీ వేలానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
యాంబీ వ్యాలీ వేలం
కొనసాగించాల్సిందే: సుప్రీం న్యూఢిల్లీ: మహారాష్ట్ర పుణెలోని రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలాన్ని నిలిపివేయాలని సహారా చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారం, వేలం నిర్వహించడానికి అధికారిక లిక్విడేటర్‌కు అనుమతి ఇచ్చింది. యాంబీవ్యాలీలో తన 26 శాతం వాటాను రాయల్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు విక్రయించి 1.6 బిలియన్ డాలర్లు సమీకరించుకోడానికి అనుమతించాలని, అప్పటి వరకూ వ్యాలీ జప్తును నిలిపివేయాని అత్యున్నత న్యాయస్థానానికి సహారా విజ్ఞప్తి చేసింది. అయితే దీన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరిస్తూ, తగిన ఒప్పందం ద్వారా నిధులు సమీకరించి, డిపాజిట్ చేస్తే, తదుపరి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి నిధులు వసూలు చేయటమే కాక... పునఃచెల్లింపుల్లో విఫలమైన కేసులో యాంబీ వ్యాలీ వేలానికి ఇంతక్రితం బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్‌ను నియమిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. చెల్లించాల్సిన మొత్తం రూ.24,000 కోట్ల నిధుల్లో మిగిలిన దాదాపు రూ.9,000 కోట్ల చెల్లింపులకు 18 నెలల సమయాన్ని ఇప్పటికే సహారా కోరింది. అయితే వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు ఉన్నాయని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. -
సీప్లేన్ ఆగిపోయింది...
ముంబయి నుంచి సహారా సంస్థకు చెందిన ఆంబీవ్యాలీకి వెళ్లడానికి ఓ సీప్లేన్ సర్వీస్‌ను సిద్ధం చేసింది సహారా. రూ.4000-4500 టికెట్‌తో ఎంచక్కా 120 కిలోమీటర్ల దూరాన్ని సీప్లేన్‌లో చుట్టేద్దామనుకునేవారి కోసం ఈ సర్వీసును సోమవారం నుంచి ఆరంభించాల్సి ఉండగా... సుబ్రతోరాయ్ జైల్లో ఉండటం దీనికి కలిసిరాలేదు. ‘‘మా అధినేత జైల్లో ఉన్నారు కనక ఈ సర్వీసును ఇప్పుడే ఆరంభించొద్దు. దయచేసి వాయిదా వేయండి’’ అంటూ ఆంబీ వ్యాలీ అధికారుల నుంచి సమాచారం రావటంతో ఆపరేటింగ్ సంస్థ మెహ్ ఎయిర్‌కు దీన్ని నిలిపేయక తప్పలేదు.