యాంబీ వ్యాలీ వేలం
కొనసాగించాల్సిందే: సుప్రీం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పుణెలోని రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలాన్ని నిలిపివేయాలని సహారా చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారం, వేలం నిర్వహించడానికి అధికారిక లిక్విడేటర్‌కు అనుమతి ఇచ్చింది. యాంబీవ్యాలీలో తన 26 శాతం వాటాను రాయల్ పార్ట్‌నర్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు విక్రయించి 1.6 బిలియన్ డాలర్లు సమీకరించుకోడానికి అనుమతించాలని, అప్పటి వరకూ వ్యాలీ జప్తును నిలిపివేయాని అత్యున్నత న్యాయస్థానానికి సహారా విజ్ఞప్తి చేసింది.
అయితే దీన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరిస్తూ, తగిన ఒప్పందం ద్వారా నిధులు సమీకరించి, డిపాజిట్ చేస్తే, తదుపరి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి నిధులు వసూలు చేయటమే కాక... పునఃచెల్లింపుల్లో విఫలమైన కేసులో యాంబీ వ్యాలీ వేలానికి ఇంతక్రితం బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్‌ను నియమిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. చెల్లించాల్సిన మొత్తం రూ.24,000 కోట్ల నిధుల్లో మిగిలిన దాదాపు రూ.9,000 కోట్ల చెల్లింపులకు 18 నెలల సమయాన్ని ఇప్పటికే సహారా కోరింది. అయితే వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు ఉన్నాయని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది.