కృష్ణా జిల్లాలో టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
► రాజీనామాకు సిద్దమంటున్న ముద్రబోయిన వర్గం
నూజివీడు: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా ఉంటూ వస్తున్న కాపా శ్రీనివాసరావుకు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం గత కొంతకాలంగా రెండు గ్రూపుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది.
తాజాగా కాపా శ్రీనివాసరావుకు నూజివీడు ఏఎంసీ పదవి ఇవ్వాలని పార్టీ అథినేత నిర్ణయించినట్లు సమాచారం. అయితే కాపాకు పదవి ఇవ్వడాన్ని ముద్రబోయిన వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రస్తుతం పరిస్థతి రసవత్తరంగా మారింది. పదవిని దక్కించుకుకోవడానికి ఇరువర్గాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకున్నాయి. అందులో ముద్రబోయిన వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కాపా శ్రీనివాసరావుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని ముద్రబోయిన వర్గం నిర్ణయించుకున్నట్లు సమాచారం.