ఆన్లైన్లో ఉగ్రవాద దాడి వీడియో!
భీకర దాడులతో రక్తపాతం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ వీడియోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా.. జనవరి 9న తూర్పు పారిస్‌లోని కోషర్ మార్కెట్లో నలుగురిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది అమెడి కౌలిబాలి అప్లోడ్ చేసిన వీడియో ఆన్లైన్లో కలకలం రేపుతోంది. కోషర్ మార్కెట్లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అమెడి మరణించాడు. నలుగురిని చంపిన ఆ ఉగ్రవాది.. తాను చావడానికి కొన్ని నిమిషాల ముందు అదే మార్కెట్లో ఉన్న ఓ కంప్యూటర్ను ఉపయోగించి ఓ వీడియోను అప్లోడ్ చేసినట్టు పారిస్ పోలీసు అధికారుల తెలిపారు.
ఆ వీడియోలో అమెడి రకరకాల గెటప్‌లో కనిపించాడు. చార్లీ హెబ్డోపై జరిగిన దాడితో తనకు సంబంధం ఉందని, ఆ దాడిలో తానూ పాల్గొన్నానని చెప్పుకొన్నాడు. తమపైన, తమ ప్రజలపైన అన్యాయంగా పాశ్చాత్యదేశాలు దాడులు చేస్తున్నందున తాము దాడులు జరపాల్సి వస్తుందని సమర్థించుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని హెచ్చరించాడు. తమ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నాశనం చేసేందుకు వైమానిక దాడులు కూడా చేస్తున్న ఫ్రాన్స్‌లో మరిన్ని దాడులు జరుపుతామని బెదిరించాడు.
ఇంతకుముందు పారిస్‌లోని చార్లీ హెబ్డో అనే వ్యంగ్య పత్రికపై దాడులు జరిపి ఇద్దరు పోలీసులు సహా 12 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆ తర్వాత విడుదల చేసిన వీడియోలో తమ పాశవిక చర్యను సమర్థించుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ వీడియోను కూడా వాళ్లు బయటపెట్టారు.