60 వేల యువతకు ఓటు హక్కు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో కొత్తగా 60 వేల మంది యువతకు ఓటు హక్కు కల్పించామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవంపై అధికారులతో ఆయన కలెక్టరేట్లో మంగళవారం సమీక్షించారు. ఓటర్ల జాబితా సవరణలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న యువత 60 వేల మందికి ఓటు హక్కు లభించడం జిల్లాలో ఇదే ప్రథమమని చెప్పారు.
జిల్లాలో బూత్‌లెవెల్ అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారులు, పలు కళాశాలల ప్రత్యేక కృషి ఫలితంగా కొత్త ఓటర్ల నమోదు విజయవంతమైదని పేర్కొన్నారు. ఓటర్ల దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విద్యార్ధులకు వక్తృత్వం, క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో గెలుపొందిన విజేతలకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా స్థాయి పోటీలను ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లా స్ధాయి విజేతలను హైదరాబాదులో ఈ నెల 24న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. గురువారం ఉదయం సీఆర్ఆర్ కళాశాల నుండి ర్యాలీ ప్రారంభిస్తామని దీనిలో ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, టీచర్లు, యువత వివిధ సేవా సంఘాల సభ్యులు, ఎస్సీసీ క్యాడెట్లు, వలంటీర్లు, క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 25 ఉదయం 10 గంటలకు సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తామన్నారు.
24న 3కే రన్
ఈ నెల 24 ఉదయం 6 గంటలకు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఇండోర్ స్టేడియం వరకూ నిర్వహించనున్న 3కే రన్లో యువత, క్రీడాకారులు, ఔత్సాహికులు, పోలీసులు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాలల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జేసీ టి. బాబూరావునాయుడు, డీఆర్వో కె. ప్రభాకరరావు, ఏలూరు ఆర్డీవో బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.