బీహార్ టు బనగానపల్లె
బనగానపల్లె, న్యూస్‌లైన్: దొంగనోట్ల చెలామణి జోరందుకుంది. సీమ ముఖద్వారంలో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఇటీవల కాలంలో ఏటీఎంలలోనూ ఈ నోట్లు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బనగానపల్లె కేంద్రంగా కర్నూలు, ఆదోని, గూడూరు తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా వీటి చెలామణి విస్తరిస్తోంది. నాపరాతి మైనింగ్‌కు బనగానపల్లె ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో చుట్టుపక్క ప్రాంతాలైన బేతంచెర్ల, అవుకు, కొలిమిగుండ్ల ప్రాంతాల్లో రూ.1000, రూ.500 దొంగనోట్ల చెలామణి చాపకింద నీరులా జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలుగా చేరుతున్న వారే ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బేతంచర్లలో దొంగనోట్లతో పట్టుబడిన బీహార్ వాసులే ఇందుకు తాజా నిదర్శనం. ఇక్కడి మైనింగ్ ఫ్యాక్టరీల్లో సుమారు 20వేల మంది కూలీలు పని చేస్తున్నారు. వీరిలో అధిక శాతం కూలీలు సులభంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో దొంగనోట్ల చెలామణిని ఎంచుకున్నట్లు సమాచారం.
బీహార్ నుంచి మధ్యవర్తుల ద్వారా దొంగనోట్లను తెప్పించుకొని జిల్లాలో చెలామణి చేస్తున్నట్లు పోలీసులు విస్తున్నారు. ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు కూలి చెల్లింపు సమయంలో వీటిని సులువుగా చెలామణి చేస్తుండటం గమనార్హం. ఇందుకోసం ఈ ప్రాంతంలోని కొందరు మైనింగ్ యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొలిమిగుండ్ల మండల సమీపంలోని నాపరాతి పాలిషింగ్ ఫ్యాక్టరీ వ్యాపారులు కొందరు తాడిపత్రి నుంచి దొంగనోట్లను తెప్పించి దందా నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఇలాంటి నోట్లు లావాదేవీల సమయంలో తరచూ వస్తున్నాయని బనగానపల్లె, బేతంచర్ల, కొలిమిగుండ్ల బ్యాంకులో పనిచేస్తున్న అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తాము చించేస్తున్నా.. బయటి మార్కెట్లో అమాయకులు మోసపోతున్నట్లు వారు చెబుతున్నారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ దొంగనోట్లు విస్తృతంగా చెలామణి అయినట్లు తెలుస్తోంది. మద్యానికి, ఇతరత్రా ఖర్చులకు కొందరు నాయకులు వీటినే వినియోగించినట్లు సమాచారం. ఇటీవల బేతంచర్ల పోలీసులకు బీహార్‌వాసులను అదుపులోకి తీసుకుని గుట్టుగా సాగుతున్న దొంగనోట్ల చెలామణిని రట్టు చేశారు. బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్ సిన్హా, అమరేంద్ర సిన్హా, సత్యేద్రకుమార్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు 32 నకిలీ వెయ్యి రూపాయల నోట్లు, రూ.7వేల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపారు. వీరి ద్వారా ముఠాలోని మరికొందరు సభ్యులను పట్టుకొనే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టబడిన వీరు గతంలో కడప జిల్లాలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలోను కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తూ దొంగనోట్లు చెలామణి చేసినట్లు విచారణలో వెల్లడైందని సమాచారం.