స్పాట్ ఎక్స్చేంజ్ వైస్ ప్రెసిడెంట్ అరెస్టు
ముంబై: సుమారు రూ. 5,600 కోట్ల చెల్లింపుల కుంభకోణానికి సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్ విభాగం) అమిత్ ముఖర్జీని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అరెస్టు చేసింది. ఈ కేసులో ఇది మొట్టమొదటి అరెస్టు. బుధవారం ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు ఈవోడబ్ల్యూ అదనపు పోలీస్ కమిషనర్ రాజ్వర్ధన్ సిన్హా తెలిపారు. మరోవైపు, ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షాతో పాటు డెరైక్టర్లు జోసెఫ్ మాసీ, శ్రీకాంత్ జవల్గేకర్, దేవాంగ్ల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. గత నెల 30 నుంచి ముఖర్జీని విచారణ జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని సిన్హా తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో సంస్థ ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్-ఎస్ఎక్స్) బోర్డు సభ్యత్వానికి జిగ్నేష్ షా రాజీనామా చేశారు. అలాగే, వైస్ చైర్మన్ జోసెఫ్ మాసీ కూడా వైదొలిగారు.