పాత కేసు.. ములాయంకు కొత్త కష్టాలు
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు కొత్త కష్టాలు ఎదురవనున్నాయి. గతంలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలకు సంబంధించి మరోసారి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌ను బెదిరించినట్లు గతంలో నమోదైన కేసుకు సంబంధించి ఆయన బెదిరించింది నిజామా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ముందడుగు వేస్తున్నారు. త్వరలో ములాయం స్వరానికి సంబంధించి నమూనాలు సేకరించబోతున్నారు. 2015లో ములాయం తనను ఫోన్లో బెదిరించారంటూ ఠాకూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
అక్రమాస్తులు పోగేశారని ఆరోపిస్తూ గాయత్రి ప్రజాపతిపై లోకాయుక్తలో ఠాకూర్, ఆయన సతీమణి నూతన్ ఠాకూర్ పిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ములాయం వారిని బెదిరించారంట. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు విచారణ నెమ్మదిగా జరిగింది. దీంతో ప్రస్తుతం కేసు పరిస్థితిపై దర్యాప్తు అధికారి లక్నో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సంధ్యా శ్రీవాత్సవ ముందు హాజరై ఎన్నికల కారణంగా పోలీసులు ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేకపోయారని, త్వరలోనే యాదవ్ ఠాకూర్ మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేయడంతోపాటు ములాయం స్వర నమూనాలు కూడా సేకరిస్తామని చెప్పారు. ఈ కేసు ఏప్రిల్ 24న తిరిగి విచారణకు రానుంది.