బోసిపోయిన అమ్మవారి ఆలయం
తిరుచానూరు, న్యూస్‌లైన్: పద్మావతీదేవి కొలువైన తిరుచానూరులోని ఆలయానికి మంగళవారం సమైక్య సెగ తగిలింది. అమ్మవారి ఆలయం భక్తులు లేక వెలవెలబోయింది. సమైక్య రాష్ట్రం కోరుతూ మంగళవారం జిల్లాలో బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉద్యోగ జేఏసీతో పాటు వివిధ ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొని హైవేలలో వాహనాలను దిగ్బంధం చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో తిరుపతికి చేరుకున్న భక్తులు సైతం బస్సులు, ఇతరత్రా వాహనాలు లేకపోవడంతో ఆలయానికి చేరుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయం భక్తులు లేక బోసిపోయింది. క్యూలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కొందరు కాలినడకతో ఆలయానికి చేరుకున్నారు. రద్దీ లేకపోవడంతో భక్తులు పద్మావతి అమ్మవారిని తనివి తీరా దర్శించుకున్నారు.