ఆశ్రయమిచ్చే అమ్మ
అంగవైకల్యం.. ఎదుటివారిపై ఆధారపడేలా చేస్తుంది. కానీ, ఇక్కడ పిల్లలందరి మధ్యలో వీల్‌చైర్‌లో కూర్చున్న పావని... ఎదుటివారికి... అదీ అన్ని అవయవాలు బాగున్నవారికి అండగా నిలవాలనుకుంది. బతికున్నంతకాలం తల్లిదండ్రులకు చంటిపాపలా ఉండాల్సిన పావని తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథపిల్లలకు తల్లిగా మారింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలానికెళ్లి ‘అమ్మ ఆశ్రమం’ గురించి అడిగితే అందరూ ముందు పావని గురించే చెబుతారు.
ఒకరోజు వార్తాపత్రికలో.. ‘తల్లిదండ్రులు లేని ఈ అనాథపిల్లలకు ఆర్థిక సాయం చేయగలరు’ అనే ప్రకటన చదివింది పావని. తన స్నేహితులకు విషయం చెప్పి వారి సాయంతో కోటగిరికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మన్‌దేవ్‌పల్లికి వెళ్లింది. తొమ్మిదేళ్ల వయసున్న భారతి, ఏడేళ్ల శోభను కలిసి వారిని తనకిమ్మని పెద్దలతో మాట్లాడింది. తన గురించి పూర్తిగా చెప్పి పెద్దల్ని ఒప్పించి ఆ అనాథలిద్దర్ని ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికే తల్లితో తన ఆశ గురించి, ఆశయం గురించి వివరంగా చెప్పింది పావని. బిడ్డ మనసెరిగిన వెంకటరమణ అలా వచ్చిన అనాథ పిల్లలందరికీ అమ్మమ్మ అయ్యింది.
ఆశే.. ఆశయమైంది
కొన్నిసార్లు ఏదో ఆలోచనతో మొదలుపెట్టిన పని...రకరకాలు మలుపులు తిరుగుతూ సరికొత్త ఫలితాలను అందజేస్తుంది. పావని తనకు తోడు కావాలనుకుని మొదలుపెట్టినా... అనాథపిల్లల జీవితాలు చూసి ఓ క్షణం వారి గురించి ఆలోచించి వారందరికీ తోడుగా నిలవాలనుకుంది. ‘‘భారతి, శోభ మా ఇంటికొచ్చి నాలుగేళ్లు దాటింది. అన్నయ్య పెళ్లయ్యాక ఉద్యోగరీత్యా విజయవాడ వెళ్లిపోయాడు. ఇక ఇంట్లో అమ్మా, నాన్న, నేను. అమ్మ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన పథకం కింద వంటచేసే పని చేస్తుంది. నాన్న ఏ పనీ చేయకపోయినా కాలక్షేపానికి ఊళ్లోకి వెళ్లిపోతాడు.
అమ్మానాన్న ఉన్నప్పుడే ఇలా ఉందంటే.. వారి తర్వాత నా పరిస్థితి ఏంటని బాగా ఆలోచించాను. నావాళ్లంటూ ఓ నలుగురు ఉండాలని అనుకున్నాను. ఒకరో ఇద్దరో అనాథల్ని పెంచుకుంటే వారి నీడనే జీవితం గడిపేయొచ్చుకదా! అన్న ఆశతో మొదలుపెట్టాను. విచిత్రం ఏమిటంటే..అది అక్కడితో ఆగకుండా...నా చుట్టుపక్కలున్న అనాథపిల్లలందరికీ నన్ను అమ్మగా మార్చేసింది. మనకు తెలియకుండానే మన జీవితం మలుపు తిరుగుతుందని ఎవరో అంటే నాకు అర్థం కాలేదు.
నా ఇంట్లో అనాథపిల్లల సంఖ్య పెరుగుతున్నప్పుడల్లా నా మనసులో కలిగింది ఆశ కాదు, ఆశయమని అర్థమవుతుంటుంది’’ అంటూ చెప్పే పావని వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. శరీర బరువు కారణంతో ఓ ఇద్దరు సాయం ఉంటేగాని కదల్లేదు. వీల్‌చైర్ ఎక్కిందంటే మాత్రం అన్ని పనులూ చకచకా చేసేస్తుంది. ఓ పక్క కుట్లు, అల్లికల పనిచేస్తూనే పదో తరగతి పరీక్ష రాసి పాసైంది పావని. తర్వాత ఇంట్లో నుంచి ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేసింది.
అమ్మ సాయంతోనే...
పిల్లలకు ఆస్తులివ్వకపోయినా వారి ఆశయాలు నెరవేరితే చాలంటుంది పావని తల్లి వెంకట రమణ. పల్లెల్లో పనుల్లేక కన్నబిడ్డల్ని పెంచడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇంతమంది అనాథ పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవడం అంటే మాటలు కాదు. అదెలా సాధ్యం అంటే... ‘‘పావని మొదట్లో చెబితే నాకు అర్థం కాలేదు. ఓ ఇద్దరు పిల్లలు ఇంట్లో అడుగుపెట్టగానే పావని ముఖంలో తెలియని ధైర్యం చూశాను. ఆ అనాథపిల్లలకోసం ఏదైనా చేయాలనే పావని పట్టుదలను గమనించాక అప్పటివరకూ పావని గురించి ఉన్న బెంగ పోయింది నాకు. పిల్లలందరినీ నేను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. మధ్యాహ్నం భోజనం అక్కడే తినేస్తారు. సాయంత్రం భోజనం కోసం ఆమె కుట్లు, అల్లికల డబ్బును ఉపయోగిస్తుంది. దాతల సాయం కూడా ఉంది’’ అని చెప్పింది వెంకటరమణ.
పెరుగుతున్న పిల్లల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పావని ఆ ప్రాంత పెద్దల సలహాలతో ఆశ్రమం నడుపుతోంది. రెండు గదుల ఇరుకింట్లో ఇరవైమంది ఉండడాన్ని చూసి స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ మధ్యనే ఆశ్రమం నిర్మాణం కోసం మూడు లక్షల నగదు సాయం చేశారు. దానికి మిగతా దాతలు తోడు కావడంతో కొత్తగా మరో భవనం నిర్మాణానికి పూనుకుంది పావని.
ఒక్క తల్లి బిడ్డల్లా...
పదిహేడు మంది పిల్లల్లో ఎనిమిదిమంది ఆడపిల్లలు, తొమ్మిదిమంది మగపిల్లలూ ఉన్నారు. రోజు పొద్దునే వారి పనులు వారు చేసుకుని బడికి వెళ్లిపోవడం సాయంత్రం వచ్చాక కాసేపు టీవీ చూడ్డం, చదువుకోవడం... అన్నీ సొంతింట్లో ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి పూర్తిచేసిన భారతి తన గురించి చెప్పినపుడు ‘నేను పావనిగారి పెద్దమ్మాయి’ని అంటూ పరిచయం చేసుకుంది. అలాగే రమేష్ అనే అబ్బాయి మాట్లాడుతూ... ‘ఇంతమంది అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవరికి ఉంటారు? అమ్మ గురించి చెప్పాలంటే... మా ప్రోగ్రెస్ రిపోర్టులు చూసుకుని తెగ మురిసిపోతుంటుంది. మార్కులు తక్కువొచ్చాయా... ఇక వారితో మాట్లాడదు. మేమంతా బాగా చదవాలన్నది ఆమె కోరిక’’ అని చెప్పాడు.
తోటివారికి చేతనైనంత సాయం చేయడం మానవధర్మమైతే...చేయగలిగినదానికంటే ఎక్కువగా చేయడం సేవాధర్మం. ఆ ధర్మానికి కట్టుబడే తన దృష్టికి వచ్చిన ప్రతి అనాథపట్ల స్పందిస్తోంది పావని. ఎంతమందికైనా ఆశ్రయం ఇవ్వగలనన్న ఆమె మనోధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.
‘‘ఎవరడిగినా ఇది మా ఇల్లనే చెబుతాం. ఆశ్రమం అనే మాట ఎవరో బయటి నుంచి వచ్చినవాళ్లే అంటారు. అమ్మ, అమ్మమ్మ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ‘నాకంటే కాళ్లు లేవు... మీరలా కాదు... జీవితంలో ఏదైనా సాధించగలరు’ అని మాటిమాటికీ అమ్మ చెప్పే మాటలు మేం ఎప్పటికీ మరచిపోలేం’’ అని చెప్పింది భారతి అనే అమ్మాయి.