ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించండి
జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి
షాబాద్: ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. గురువారం మండలంలోని హైతాబాద్ బాలికల హాస్టల్‌ను, షాబాద్ కస్తూర్బాగాంధీ పాఠశాలను ఆమె సందర్శించారు. హైతాబాద్ హాస్టల్లో బియ్యం, నూనె, పప్పు తదితర సామగ్రిని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదివే పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఓటర్ ఐడీ కార్డులను ఆధార్‌కు అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ సత్యనారాయణరాజుకు ఆమె సూచించారు.
గ్రామాలలో వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని చెప్పారు. మండలంలోని సీతారాంపూర్, ఊబగుంట, దామర్లపల్లి, బోనగిరిపల్లి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూములు కొంతమంది కబ్జా చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, దాని నివేదికను సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్ సత్యనారాయణరాజు, ఎంపీడీఓ పద్మావతి, డిప్యూటీ తహసీల్దార్ హైదర్అలీ, ఏఎస్ఓ రుక్మిణీదేవి, అంగూర్‌నాయక్ తదితరులున్నారు.