అమృతం అంతంతే..!
♦ అమృత్ పథకం కింద రూ.700 కోట్లకు పైగా ప్రతిపాదనలు
♦ రూ.36 కోట్లు మాత్రమే మంజూరు కేవలం తాగునీటి
♦ అవసరాలకు మాత్రమే వినియోగించే అవకాశం
సాక్షి కడప: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకంలో స్థానం పొందిన నగరాలు, పట్టణాల రూపురేఖలు మారిపోతాయని అందరూ కలలు గన్నారు. అయితే అటు ప్రజా ప్రతినిధులు.. ఇటు అధికారుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని చెప్పక తప్పదు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఆశిస్తే కొంతమేర మాత్రమే కేటాయించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. కడప నగరం, ప్రొద్దుటూరు పట్టణంలో అభివృద్ధికి సుమారు రూ. 700 కోట్లకు పైగా అవసరమని ప్రతిపాదనలు పంపితే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.36 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. కడపపై చంద్రబాబు సర్కారు వివక్ష చూపుతూ నిధుల కేటాయింపు విషయంలో ఓ వైపు అన్యాయం చేస్తుంటే.. మరో వైపు కేంద్రం కూడా జిల్లాలో అమృత్ పథకం కింద ఎంపికయిన కడప, ప్రొద్దుటూరుకు పూర్తి స్థాయి నిధులు కేటాయించక పోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
తాగునీటికి మాత్రమే పరిమితం
కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద మంజూరు చేసిన నిధులతో కేవలం తాగునీటి అవసరాలను మాత్రమే తీర్చాలని కడప నగరపాలక సంస్థ భావిస్తోంది. పొడిచెత్తను కంపోస్టుగా తయారు చేయడం మెదలు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ..తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నగరపాలక అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే కేంద్రం మాత్రం రూ.350 కోట్ల ప్రతిపాదనలకు కేవలం రూ.35 కోట్లు మాత్రమే విదిల్చింది. దీంతో ఈ నిధులను వేసవిలో తాగునీటి సమస్యను తీర్చేందుకు వినియోగింంచాలని యోచిస్తున్నారు. అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా కేవలం రూ.50 లక్షలు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకూ చాలవని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.50 కోట్లు ఇస్తామని చెప్పి..
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాలను అమృత్ కింద ఎంపిక చేసిన అనంతరం ఒక్కో నగరం, పట్టణానికి సుమారు రూ.50 కోట్ల నిధులు ఇస్తామని ప్రచారం చేసింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుకాని చాలా నగరాలు.. పట్టణాలకు తీవ్ర అన్యాయం చేశారు.. కనీసం రూ. కోటి కూడా కాకుండా ప్రొద్దుటూరుకు రూ.50 లక్షలు కేటాయించారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. కేంద్రం విదిల్చిన రూ.50 లక్షలతో ఏం అభివృద్ధి జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంజూరు చేసిన ఆ నిధులు కూడా ఈ వేసవిలో కేవలం తాగునీటికే వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం పేరుతో జిల్లాకు అన్యాయం చేసిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.