‘విషతుల్యం’పై సీరియస్
- ‘సాక్షి’ కథనంపై స్పందించిన యంత్రాంగం
- మద్యం వ్యర్థాల సరఫరాపై ఎస్ఓటీ పోలీసుల నిఘా
- ఇబ్రహీంపట్నంలో ట్యాంకర్ సీజ్
- నమూనాలను ల్యాబ్‌కు తరలించిన అధికారులు
- రెండురోజుల్లో రిపోర్టు: ఆర్జేడీ వరప్రసాద్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పశువుల దాణాలో మద్యం వ్యర్థాలను కలుపుతున్న వ్యవహారంపై ఆగస్టు 24న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అమృతాహారం విషతుల్యం’ కథనానికి యంత్రాంగం స్పందించింది. మద్యం వ్యర్థాలను విక్రయించడంపై నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలో అనుమానాస్పద వ్యర్థ పదార్థాలను విక్రయిస్తున్న ట్యాంకర్‌ను పట్టుకున్నారు. అందులో మద్యం సంబంధిత వ్యర్థాలున్నట్లు ప్రాథమికంగా తేల్చిన అధికారులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ట్యాంకర్ యజమానులపై కేసు నమోదు చేశారు.
యూనివర్సిటీ ల్యాబ్‌కు నమూనాలు..
ఇదిలా ఉండగా.. మద్యం వ్యర్థాల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పశుసంవ ర్థక శాఖ అధికారులు పూర్తిస్థాయి పరిశీలనకు ఉపక్రమించారు. దాణాలో కలిపే మద్యం వ్యర్థాలకు సంబంధించిన నమునాలను సేకరించి వాటిని విశ్లేషించేందుకు రాజేంద్రనగర్‌లోని జయశంకర్ యూనివర్సిటీలో ఉన్న వెటర్నరీ ల్యాబ్‌కు పంపించారు. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన రిపోర్టు వస్తుందని, వాటిని పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.