అక్కడికి ఒక్క రూపాయితో వెళితే చాలు...
ఆదర్శం
ఒక్క రూపాయితో ఆకలి తీరుతుందా?
ఆకలి తీరడం వరకు ఎందుకు? సింగిల్ టీ కూడా తాగలేము.
కానీ అక్కడికి ఒక్క రూపాయితో వెళితే చాలు... కమ్మని భోజనంతో కడుపు నిండుతుంది. తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక్కరూపాయికి పేదసాదలకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు వెంకట్రామన్.
ఈరోడ్ జనరల్ హాస్పిటల్ సమీపంలో తాను నిర్వహిస్తున్న ‘ఏఎంవీ హోమ్లీ మెస్’లో ఒక్క రూపాయికే పేదలకు భోజనం సమకూరుస్తున్నడు వెంకట్రామాన్.
ప్రతి మంచి పని వెనుక ఏదో ఒక సంఘటన ఉంటుంది. వెంకట్రామన్ విషయంలోనూ ఇది జరిగింది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక యువతి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వెంకట్రామన్ రెస్టారెంట్‌కు వచ్చింది. ఆమె ఇడ్లీలు కొనడానికి వచ్చింది.
ఆరు ఇడ్లీలకు పది రూపాయలు.
పది రూపాయలు పెట్టి ఇడ్లీలు కొనడానికి ఆమె సుముఖంగా లేకపోవడంతో దోశలు కొనమని చెప్పాడు వెంకట్రామన్. పది రూపాయలకు మూడు దోశలు. మూడు దోశలు తన కుటుంబానికి సరిపోవంటూ కొనడానికి తిరస్కరించింది. ఆమె పరిస్థితికి జాలి పడి పది రూపాయలకే ఆరు దోశలు ఇచ్చాడు వెంకట్రామన్.
వేరే రెస్టారెంట్ యజమానులు అయితే ఈ సంఘటనను ఇక్కడితో మరిచిపోయి ఉండేవారు. అయితే వెంకట్రామన్ చాలా రోజుల వరకు ఈ సంఘటనను మరవలేకపోయాడు.
కొందరు కేవలం పది రూపాయల మీదే రోజంతా వెళ్లదీస్తున్న కఠిన వాస్తవాన్ని గ్రహించాడు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పేద రోగుల దీనపరిస్థితిని, ఆకలిని కళ్లారా చూశాడు. మనసు కదిలిపోయింది.
‘‘నా పరిధిలో ఏదైనా చేయాలి’’ అని అప్పుడే గట్టిగా అనుకున్నాడు వెంకట్రామన్.
తన భార్యతో కలిసి రోజూ పొద్దున హాస్పిటల్‌కు వెళ్లి పేదవారికి రూపాయి కూపన్ ఇస్తాడు. కూపన్ తీసుకున్నవారు మధ్యాహ్నం రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం తెచ్చుకుంటారు.
ఒకప్పుడు 20 మందికి టోకెన్లు ఇచ్చేవాడు. ఇప్పుడు 70 మందికి ఇస్తున్నాడు.
ఈ రెస్టారెంట్లో రెగ్యులర్ కస్టమర్ల విభాగం కూడా ఉంది. అక్కడ మాత్రం ప్లేట్ భోజనం రూ.50కి విక్రయిస్తారు.
రూపాయి భోజనానికయ్యే ఖర్చు కోసం మొదట్లో ఎవరీ దగ్గర సహాయం తీసుకోలేదు వెంకట్రామన్. తన రెస్టారెంట్ లాభాల నుంచే ఈ మొత్తాన్ని కేటాయించేవాడు. అయితే రెస్టారెంట్‌కు వచ్చే లాభాలు తక్కువ కావడంతో ఖర్చులు సర్దుబాటు చేయడం కష్టంగానే ఉండేది. అయితే వెంకట్రామన్ చేస్తున్న పని నచ్చి అడగకుండానే దాతలు ఆయనకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు.
వెంకట్రామన్ కూతురికి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చినప్పుడు కాలేజీ ఫీజు కట్టడానికి అతని దగ్గర డబ్బులేదు. ఇది తెలిసిన చెన్నై రామక్రిష్ణ మఠ్ వెంకట్రామన్ కూతురు ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందడానికి అవసరమైన సహాయం చేసింది.
‘‘కష్టం ఉందని బాధ పడనక్కర్లేదు. ఆ కష్టాన్ని తీర్చే ఆపన్న హస్తం కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది’’ అని నమ్ముతాడు వెంకట్రామన్.
‘‘చదువు అయిపోయిన తరువాత నా కూతురుకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నేను మరింత ఎక్కువ మందికి సహాయం చేయగలను’’ అంటున్నాడు వెంకట్రామన్.
యోగా టీచర్‌గా పని చేస్తున్న వెంకట్రామన్ భార్య తనవంతుగా సహాయం అందిస్తోంది.
‘‘పేద కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పటికీ నేనేమీ ఆర్థికంగా స్థిరపడలేదు. అయినా... ఒక్క రూపాయికి భోజనం మాత్రం సమకూర్చడాన్ని మాత్రం మానుకోను. రోజుకు వంద కూపన్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం’’ అంటున్నాడు వెంకట్రామన్.
‘‘మానవత్వం అనేది సముద్రం లాంటిది. అందులో రెండు చుక్కలు కలుషితం అయినంత మాత్రాన... సముద్రం అంతా కలుషితం కాదు’’ అంటారు మహాత్మగాంధీ.
వెంకట్రామన్ చేస్తున్న మంచిపనిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మహాత్ముడి మాటలు గుర్తుకు వస్తాయి. మానవత్వం మీద పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఈ కాలానికి ఇంత కంటే కావాల్సింది ఏముంది!