మొజాంబిక్ గ్యాస్ క్షేత్రంలో ఓవీఎల్‌కు 10% వాటా
న్యూఢిల్లీ: దేశీయ ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్జీసీ మొజాంబిక్ గ్యాస్ క్షేత్రంలో 10% వాటాను సొంతం చేసుకోనుంది. అంతర్జాతీయ అనుబంధ కంపెనీ ఓఎన్జీసీ విదేశీ ద్వారా యూఎస్ సంస్థ అనడార్కో పెట్రోలియం కార్పొరేషన్‌కు గల 10% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు 264 కోట్ల డాలర్ల(సుమారు రూ. 17,000 కోట్లు)ను వెచ్చించనుంది. గడిచిన ఏడాది కాలంలో ఓవీఎల్‌కు ఇది నాలుగో డీల్ కావడం విశేషం. గతేడాది సెప్టెంబర్ నుంచి చూస్తే కంపెనీ 1,100 కోట్ల డాలర్ల విలువైన డీల్స్‌ను కుదుర్చుకుంది.
మొజాంబిక్లోగల రోవుమా-1 ఆఫ్‌షోర్ క్షేత్రం 65 ట్రిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ నిల్వలను కలిగి ఉన్నట్లు అంచనా. ఈ క్షేత్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను ఎల్‌ఎన్‌జీగా మార్పుచేసి ఇండియాకు దిగుమతి చేసుకోవాలనేది ఓవీఎల్ ప్రణాళిక. కాగా, ఆయిల్ ఇండియాతో కలిసి జూన్‌లో వీడియోకాన్ గ్రూప్ నుంచి ఇదే బ్లాకులో 10% వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు 247 కోట్ల డాలర్లను చెల్లించనుంది. రోవుమా-1లో ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్‌కు సైతం 10% వాటా ఉంది. వెరసి రోవుమా-1లో దేశీయ కంపెనీలు మొత్తం 30% వాటాను సొంతం చేసుకోనున్నాయి.
తద్వారా రోజుకి 60-80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను పొందేందుకు వీలు కలగనుంది. ఓఎన్జీసీ ఓవీఎల్ ఏర్పాటయ్యాక 2011 వరకూ మొత్తం 15 దేశాలలో 32 ఆస్తులను కొనుగోలు చేసింది. ఇందుకు 17 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇక గత ఏడాది కాలంలో మరో 11 బిలియన్ డాలర్లను వెచ్చించడం ద్వారా మరో నాలుగు డీల్స్‌ను కుదుర్చుకోవడం గమనార్హం.