Anand Ravi
-
‘కొరమీను’ మూవీ రివ్యూ
టైటిల్: ‘కొరమీను.. ‘స్టోరీ ఆఫ్ ఈగోస్’ నటీనటులు: ఆనంద్ రవి, , హరీష్ ఉత్తమన్, శత్రు, కిశోరీ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్ తదితరులు నిర్మాత: పెళ్లకూరు సమన్య రెడ్డి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: ఆనంద్ రవి దర్శకత్వం: శ్రీపతి కర్రి పాటలు: అనంత నారాయణన్ ఏజీ నేపథ్య సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని సినిమాటోగ్రఫీ: కార్తీక్ కొప్పెర ఎడిటర్: విజయ్ వర్ధన్ కె విడుదల తేది: డిసెంబర్ 31, 2022 కథేంటంటే.. మీసాల రాజు (శత్రు) ఓ పవర్ఫుల్ పోలీసు అధికారి. ఆయనకు మీసాలు అంటే చాలా ఇష్టం. బదిలీపై విజయవాడ నుంచి వైజాగ్‌కు వచ్చిన తొలి రోజే కొంతమంది అపరిచితులు మీసాల రాజు మీసాలను బలవంతంగా తీసేస్తారు. పరువుగా భావించే తన మీసాలను తీసేయ్యాల్సిన అవసరం ఎవరికుందని విచారించడం మొదలుపెడతాడు మీసాల రాజు. ఈ క్రమంలో జాలరి పేట కరుణ గురించి తెలుస్తుంది. వైజాగ్‌లోని జాలరిపేటను తన గుప్పిట్లో పెటుకుంటాడు కరుణ( హరీశ్ ఉత్తమన్ ). అక్కడ డ్రగ్స్, ఇతర చట్ట విరుద్ద వ్యాపారాలు చేస్తూ.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు కోటి(ఆనంద్ రవి). అతనికి అదే గ్రామానికి చెందిన మీనాక్షి( కిశోరీ ధాత్రక్) అంటే పిచ్చి ప్రేమ. కానీ మీనాక్షి మాత్రం కరుణను ప్రేమిస్తుంది. కరుణ మాత్రం ఆమెను శారీరకంగా వాడుకొని వదిలేస్తాడు. ఆ తర్వాత మీనాక్షి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆమెను కోటీ చేరదీశాడా లేదా? మీసాల రాజు మీసాలను ఎవరు తీశారు? ఎందుకు తీశారు? అసలు మీసాల రాజు విజయవాడ నుంచి వైజాగ్‌కు ఎందుకు బదిలీ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈరోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీతలు చెరిగిపోయాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథలతో సినిమాలు వస్తున్నాను. ‘కోరమీను’ కూడా అలాంటిందే. ఇగో క్లాషెస్ నేపథ్యంలో కథనం సాగుతుంది. కొన్ని సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి. కానీ ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కోరమీను కథ పుట్టిందే అక్కడ నుంచి. పేదవాడికి, గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను ఈ సినిమాలో చూపించారు. ఓ డ్రైవర్, అహంకారం, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో ఓ పవర్ఫుల్ పోలీస్... ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ కూడా ఉంది. కరుణ అరచాకాలు.. కోటీ, మీనాక్షి మధ్య జరిగే డ్రామా సన్నివేశాలతో ఫస్టాఫ్ సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. క్లైమాక్స్‌కు 30 నిమిషాల ముందు కథలో వచ్చే ట్విస్టులు సినిమా స్థాయిని పెంచేశాయి. ఎవరు ఎవరి ట్రాప్‌లో పడ్డారనే విషయాన్ని ఊహించని విధంగా, ఆసక్తికరంగా చూపించారు. ఓ సింపుల్ స్టోరీని నెటివిటీ టచింగ్ ఇచ్చి, ఆసక్తిరకంగా చూపించడంతో దర్శకుడు శ్రీపతి కర్రి సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ రవి నటనలో ఈజ్ ఉంది. జాలరిపేట యువకుడు కోటి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కావాలని హీరోయిజం చూపించకుండా..కథకు అనుగుణంగా కొన్ని సందర్భాలతో మాత్రమే ఆయన హీరోలా కనిపిస్తాడు. మిగతా అన్ని సన్నివేశాల్లో సాదారణ యువకుడిలా సింపుల్‌గా కనిపిస్తాడు. మీనాక్షీ పాత్రలో కిశోరీ ధాత్రక్ పరకాల ప్రవేశం చేసింది. రొటీన్ హీరోయిన్ల పాత్రకు భిన్నంగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. ఇక విలన్ కరుణ పాత్రకు హరీశ్ ఉత్తమన్ న్యాయం చేశాడు. మీసాల రాజుగా శత్రు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దేవుడుగా రాజా రవీంద్ర, సీఐ కృష్ణగా గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సిద్ధార్థ్ సదాశివుని నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశారు. ఆనంద్ రవి రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. ‘డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ, అసలైన పవర్ భయానిదేరా’, ‘మొగుడు లేకపోతే ఆడదానికి సుఖం ఉండదు..కానీ ప్రపంచం అంతా ఆడదానికే సుఖం ఇవ్వాలనుకుంటుంది’ లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ, విజయ్ వర్ధన్ కె ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కొరమీను’ నిరుత్సాహపరచదు: హీరో ఆనంద్ రవి
ఏడాది చివర్లో (డిసెంబర్ 31) మా ‘కొరమీను’ సినిమా వస్తోంది. ప్రేక్షకులను మా మూవీ నిరుత్సాహపరచదు’’ అని హీరో ఆనంద్ రవి అన్నారు. శ్రీపతి కర్రి దర్శకత్వంలో ఆనంద్ రవి, కిషోరి జంటగా నటించిన చిత్రం ‘కొరమీను’. ‘స్టోరీ ఆఫ్ ఈగోస్’ అనేది ఉపశీర్షిక. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మహేశ్వర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీపతి కర్రి మాట్లాడుతూ– ‘‘ఒక డైరెక్టర్లా కాకుండా ఓ ప్రేక్షకుడిలా చెబుతున్నా.. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ప్రేక్షకులే మా సినిమాను ప్రమోట్ చేస్తారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది.. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి’’ అన్నారు సమన్య రెడ్డి. కొరమీను, లక్కీ లక్ష్మణ్..ఒకరికొకరు మద్దతు పరిమితమైన బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాలకు సంబంధిచి కొరమీను, లక్కీ లక్ష్మణ్ సినిమా టీమ్స్ కలిసి ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఒకరోజు ముందుగా వస్తున్న లక్కీ లక్ష్మణ్ టీమ్ మంగళవారం రాత్రి జరిగిన తమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొరమీను టీమ్‌ను ఆహ్వానించగా హీరో ఆనంద్ రవి, హీరోయిన్ కిశోరి వెళ్లి టీమ్‌కు విషెష్ తెలియజేశారు. అలాగే బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లక్కీ లక్ష్మణ్ టీమ్‌ని కొరమీను టీమ్ ఆహ్వానించగా.. సోహైల్, హీరోయిన్ మోక్ష హాజరై తమ విషెష్‌ను అందించారు. ఇలా ఒకరికొకరు సపోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే సరికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం పలికాయి. దీన్ని ఇలాగే అందరూ కొనసాగిస్తే బావుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. -
'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?'.. ఆసక్తికరంగా కొరమీను టైటిల్ పోస్టర్
ఆనంద్ రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కొరమీను'. ఈ సినిమాకు శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టైటిల్ కూడా వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఆ పోస్టర్ విడుదల చేశారు. ఆనంద్ రవి ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా ఓ బోట్ మీద ఆ లైన్స్ కనిపించాయి. 'కోరమీను' ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తే సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథగా తెలుస్తోంది. సముద్ర తీరంలో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ ఆసక్తి కలిగించేలా ఉంది. ఒక బోట్ పై 'మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?' క్యాప్షన్ కూడా రాసి ఉంది. దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. 'ఈ మూవీలో జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో కథ సాగుతుంది. ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది' అని అన్నారు. కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
'నెపోలియన్' మూవీ రివ్యూ
టైటిల్ : నెపోలియన్ జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : ఆనంద్ రవి, రవివర్మ, కోమలి సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని దర్శకత్వం : ఆనంద్ రవి నిర్మాత : భోగేంద్ర గుప్తా ఇటీవల తొలి పోస్టర్, టీజర్ నుంచే ఎంతో ఆసక్తి కలిగించిన సినిమా నెపోలియన్. ఓ వ్యక్తి తన నీడ పోయిందంటూ పోలీస్ లను ఆశ్రయించటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో ఆనంద్ రవి దర్శకుడిగా, నటుడిగా పరిచయం అవుతున్నాడు. నారా రోహిత్ హీరోగా మంచి విజయం సాధించటంతో సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ప్రతినిథి సినిమాకు కథ రచయిత ఈ ఆనంద్ రవి. తానే స్వయంగా డైరెక్టర్ గా, ప్రధాన పాత్రలో తెరకెక్కించిన నెపోలియన్ మరోసారి ప్రతినిథి స్థాయిలో ఆకట్టుకుందా..? దర్శకుడిగా.. నటుడిగా ఆనంద్ రవి విజయం సాధించాడా..? అసలు నీడ పోవటమేంటి..? కథ : సీఐ రవివర్మ(రవివర్మ).. రొటీన్ కేసులను డీల్ చేసి బోర్ కొట్టిన రవివర్మ ఓ ఆసక్తికరమైన కేసు కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో నెపోలియన్ (ఆనంద్ రవి) అనే వ్యక్తి నా నీడ పోయిందంటూ కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అతడ్ని పరీక్షించిన పోలీసులు నిజంగానే నీడపడకపోవటం చూసి షాక్ అవుతారు. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న నెపోలియన్ మరో షాక్ ఇస్తాడు. తనకు దేవుడు కలలో కనిపించాడని.. నందినగర్ లో చనిపోయిన తిరుపతి అనే వ్యక్తిది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పాడని చెప్తాడు. ఆ కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి..? చనిపోయిన తిరుపతికి నెపోలియన్ కు సంబంధం ఏంటి..? నెపోలియన్ నీడ ఎలా మాయమైంది..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : మూడు కీలక పాత్రల నేపథ్యంలోనే కథ నడవటంతో నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సినదేమీ లేదు. ఉన్నవాళ్లలో సీనియర్ నటుడైన రవివర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవివర్మ ఒదిగిపోయాడు. తొలిసారిగా నటుడిగా మారిన ఆనంద్ రవి పరవాలేదనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన కోమలి నటన ఆకట్టుకున్నా.. ఆ పాత్రకు పరిచయం ఉన్న నటిని తీసుకుంటే బాగుండనిపిస్తుంది. ప్రతినిథి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆనంద్ రవి తానే దర్శకుడిగా నటుడిగా పరిచయం అయ్యే సినిమాతో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో మొదలుపెట్టినా.. పోను పోను సినిమా ఓ మామూలు రివేంజ్ డ్రామాల మారింది. సిద్ధార్థ్ సదాశివుని అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి , నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమా మొదలు పెట్టిన విధానం నేపథ్య సంగీతం సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ : కీలక పాత్రల నటన స్క్రీన్ ప్లే - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
కొత్త కాన్సెప్ట్‌తో...
ఆనంద్ రవి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నెపోలియన్’. కోమలి, రవివర్మ, కేదార్ శంకర్, మధుమణి, గురురాజ్ కీలక పాత్రలు చేశారు. ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కాన్సెప్ట్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆనంద్ రవి మాట్లాడుతూ– ‘‘నీడ పోయిందని రిపోర్ట్ ఇచ్చే కామన్ మ్యాన్ కథే ఈ చిత్రం. సినిమాకు మంచి క్రేజ్ ఉంది. చిన్న సినిమాగా మొదలై పెద్ద రేంజ్ అయింది. ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా విడుదలలో çసహకారం అందించిన నిర్మాత ‘బన్నీ’ వాసుగారికి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో చేసిన చిత్రమిది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. యూఎస్, యూకెల్లో కూడా రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు భోగేంద్ర గుప్త. కోమలి, రవివర్మ, సంగీత దర్శకుడు సిద్ధార్థ్ సదాశివుని, కెమెరామేన్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
నువ్వు హీరోనా...? అన్నారు
– ఆనంద్ రవి ఆనంద్ రవి డైరెక్ట్ చేసిన ‘పేరెంట్స్’ మూవీ చూసిన రోజే ఇతను మంచి దర్శకుడు అవుతాడనుకున్నా. తను ‘నెపోలియన్’ సినిమాలో నటిస్తున్నాడని తెలియగానే ఎందుకు నటన పట్ల ఆసక్తి చూపుతున్నాడనిపించింది. ట్రైలర్, పోస్టర్స్ చూడగానే ఈ సినిమాను తనే డైరెక్ట్ చేసి, హీరోగా చేయడం కరెక్ట్ అనిపించింది’’ అని నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ అన్నారు. ఆనంద్ రవి, కోమలి, రవివర్మ, కేదార్ శంకర్, మధుమణి, అల్లు రమేశ్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ రవి దర్శకత్వంలో బోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘నెపోలియన్’. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, హీరో సందీప్‌కిషన్ విడుదల చేశారు. ఆనంద్ రవి మాట్లాడుతూ– ‘‘నేనీ కథతో చాలా మందిని కలిశా. ‘నీడపోయింది’ అనే పాయింట్ చెప్పగానే షార్ట్ మూవీయా? అన్నారు. హీరోగా నేనే చేయబోతున్నా అనగానే.. ‘నువ్వు హీరోనా! ప్రొడ్యూసర్ ఎవరు?’ అనడిగారు. అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. థ్రిల్లర్ జోనర్ సినిమా అయినా, కొత్త కాన్సెప్ట్‌తో ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా’’ అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత బోగేంద్ర గుప్తాకు చెందిన ట్రిపుల్ ఎస్ అనే ఎన్.జి.ఒ సంస్థ అనారోగ్యంతో బాధపడుతున్న సినిమా జర్నలిస్ట్ వరప్రసాద్‌కు 25,000 చెక్‌ను సీనియర్ పాత్రికేయులు బీఏ రాజు, పసుపులేటి రామారావులకు అందజేశారు.