నువ్వు హీరోనా...? అన్నారు
– ఆనంద్ రవి
ఆనంద్ రవి డైరెక్ట్ చేసిన ‘పేరెంట్స్’ మూవీ చూసిన రోజే ఇతను మంచి దర్శకుడు అవుతాడనుకున్నా. తను ‘నెపోలియన్’ సినిమాలో నటిస్తున్నాడని తెలియగానే ఎందుకు నటన పట్ల ఆసక్తి చూపుతున్నాడనిపించింది. ట్రైలర్, పోస్టర్స్ చూడగానే ఈ సినిమాను తనే డైరెక్ట్ చేసి, హీరోగా చేయడం కరెక్ట్ అనిపించింది’’ అని నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ అన్నారు. ఆనంద్ రవి, కోమలి, రవివర్మ, కేదార్ శంకర్, మధుమణి, అల్లు రమేశ్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ రవి దర్శకత్వంలో బోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘నెపోలియన్’.
ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, హీరో సందీప్‌కిషన్ విడుదల చేశారు. ఆనంద్ రవి మాట్లాడుతూ– ‘‘నేనీ కథతో చాలా మందిని కలిశా. ‘నీడపోయింది’ అనే పాయింట్ చెప్పగానే షార్ట్ మూవీయా? అన్నారు. హీరోగా నేనే చేయబోతున్నా అనగానే.. ‘నువ్వు హీరోనా! ప్రొడ్యూసర్ ఎవరు?’ అనడిగారు. అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. థ్రిల్లర్ జోనర్ సినిమా అయినా, కొత్త కాన్సెప్ట్‌తో ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా’’ అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత బోగేంద్ర గుప్తాకు చెందిన ట్రిపుల్ ఎస్ అనే ఎన్.జి.ఒ సంస్థ అనారోగ్యంతో బాధపడుతున్న సినిమా జర్నలిస్ట్ వరప్రసాద్‌కు 25,000 చెక్‌ను సీనియర్ పాత్రికేయులు బీఏ రాజు, పసుపులేటి రామారావులకు అందజేశారు.