komali
-
గ్రామీణ ప్రేమకథ
గ్రామీణ ప్రేమకథగా రూపొం దిన చిత్రం ‘శశివదనే’. రక్షిత్ అట్లూరి, కోమలి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్ విడుదలైన పోస్టర్‌పై ఉంది. -
కొత్త స్టోరీతో వస్తోన్న పలాస హీరో.. టీజర్ రిలీజ్!
పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా ఉంది. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన టైటిల్ సాంగ్ ‘శశివదనే’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతుంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్, రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం మందిస్తున్నారు. -
లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ‘శశివదనే’
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజాగా చిత్రం ‘శశివదనే’. మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. మరియు ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. శశివదనే' చిత్రాన్ని కోనసీమ, అమలాపురంలోని సుందరమైన లొకేషన్లలో 50 రోజుల పాటు చిత్రీకరించాం. సినిమాలో ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్‌గా ఉండబోతున్నాయి. గోదావరి ల్యాండ్‌స్కేప్ నేపథ్యంలో గ్రాండియర్ మరియు హై స్టాండర్డ్స్‌తో సన్నివేశాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తాం’అన్నారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె , ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
తెలుగమ్మాయి కోమలి ప్రసాద్ ఫోటోలు
-
మరోసారి ‘సారంగ దరియా’ వివాదం..
లవ్‌స్టారీ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట గత కొన్ని రోజులుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. "దాని కుడి భుజం మీద కడువా... దాని కుత్తెపు రైకలు మెరియా.." అంటూ సాగే ఈ పాట అంతలా మార్మోగిపోతోందీ. యూట్యూబ్‌లో విడుదలైన కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి అన్ని రికార్డులు సృష్టించింది. సింగర్ మంగ్లీ పాడిన ఈ పాటలోని మాస్ బీట్, సాయి పల్లవి ఎనర్జిటిక్ డాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ప్రేక్షకులు సైతం ఈ పాటకు స్టెప్పులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే 'సారంగ దరియా..' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే స్థాయిలో వివాదమూ చుట్టుముట్టింది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ గాయని కోమలి పేర్కొన్న సంగతి తెలిసిందే. పిలిచిన ప్రతీ చానెల్ వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర నిర్వహించిన షోలో కోమలి మరోసారి సారంగదరియా పాటను ఆలపించింది. 'లవ్ స్టోరీ' సినిమాలో తన పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యిందని పేర్కొంది. తాజాగా దీనికి సంబంధించిన ఫ్రోమోను విడుదల చేశారు. ఇది చూసిన నెటిజన్లు కోమలిపై దుమ్మెత్తిపోస్తున్నారు. సారంగ దరియా పాటకు న్యాయం చేసింది సింగర్ మంగ్లీ అని, తన వల్లే పాట హిట్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. మంగ్లీ ఈ పాటకు జీవం పోసింది కాబట్టే సారంగ దరియా అంత సక్సెస్ అయ్యిందని, అసలు మీ వాయిస్ సాయ్ పల్లవికి సూట్ అయ్యేది కాదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. చదవండి : 'డైరెక్టర్ శేఖర్‌కమ్ముల న్యాయం చేస్తానని మాటిచ్చారు' సారంగదరియా.. 100 మిలియన్ల వ్యూస్! -
ఇప్పుడు నాకే అభ్యంతరం లేదు : గాయని కోమలి
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరి’. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన తొలి తెలుగు పాటగా నిలిచింది. మరోవైపు దీనిపై వివాదం కూడా అదే స్థాయిలో నెలకొంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ గాయని కోమలి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ పాటను తనతోనే పాడిస్తానని మాటిచ్చి, మోసం చేశారని తన బాధను చెప్పుకుంది. తాజాగా ఈ విషయంపై చర్చించేందుకు గాయని కోమలి..శేఖర్‌కమ్ములను కలిసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..'సారంగ దరియా పాట విషయంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలోనూ స్టేజీ మీద సారంగ దరియా పాటను నాతోనే పాడిస్తానన్నారు' అని సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు డైరెక్టర్ శేఖర్‌కమ్ముల సైతం ఈ విషయాన్ని అంగీకరించారు. భవిష్యత్‌లో తన సినిమాలో జానపద పాట పాడించే అవకాశం వస్తే తప్పకుండా కోమలికి అవకాశం ఇస్తానని తెలిపారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి : ('సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు') (సాయి పల్లవి దెబ్బకు ‘బుట్ట బొమ్మ’ ఔట్!) -
సారంగదరియా: ఆ క్రెడిట్, డబ్బులు కోమలికే!
‘లవ్ స్టోరీ’ చిత్రంలోని ‘సారంగ దరియా..’ అనే పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ పాటపై వివాదాలు కూడా నెలకొన్నాయి. ‘‘సారంగ దరియా..’ అనే పాటను నేనే వెలుగులోకి తీసుకొచ్చాను.. ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఆ పాట నాతో పాడిస్తామని చెప్పి, పాడించలేదు’ అంటూ గాయని కోమలి మీడియాతో చెప్పిన మాటలు వివాదంగా మారాయి. దీనిపై ‘లవ్ స్టోరీ’ చిత్రదర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘చాలా ఏళ్ల కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరీష అనే అమ్మాయి పాడిన ‘సారంగ దరియా’ పాట నా మనసులో తిరుగుతూనే ఉంది. ‘లవ్ స్టోరీ’కి తగ్గట్టు ‘సారంగ దరియా’ పాట రాయాలని సుద్దాల అశోక్ తేజగారిని కలిశా. ఆయన ఆ పాట పల్లవి తీసుకుని, ప్రత్యేకంగా చరణాలు రాశారు. ఆ పాటని శిరీషతో పాడిద్దామనుకున్నాం. అయితే పాటను తొలుత వెలుగులోకి తీసుకొచ్చిన కోమలితో పాడిద్దామని సుద్దాలగారు అన్నారు. వరంగల్ నుంచి ఆమెని రమ్మని కోరాం.. జలుబు, దగ్గు ఉండటం వల్ల రాలేను అన్నారు. అప్పటికే చెన్నై నుంచి సంగీత దర్శకుడు రికార్డింగ్ కోసం వచ్చి ఉండటంతో మంగ్లీతో పాడించాం. ఆ పాట క్రెడిట్‌తో పాటు డబ్బులు ఇస్తామని కోమలికి చెబితే సరేనన్నారు. పాట రిలీజ్ తర్వాత టీవీల్లో వచ్చిన కోమలి చర్చలు నేను చూడలేదు. ఈ పాట క్రెడిట్ తప్పకుండా ఆమెకి ఇవ్వడంతో పాటు మేము ఇస్తామన్న డబ్బులూ ఇస్తాం. ఆడియో వేడుకలో తనతో పాట పాడిస్తా’’ అన్నారు శేఖర్ కమ్ముల. -
సారంగదరియా నాతో పాడించలేదు: కోమలి భావోద్వేగం
ప్రేక్షకుల టేస్ట్ మారింది. సినిమాలోని మాస్ సాంగ్స్ కన్నా యూట్యూబ్‌లో వచ్చే జానపదాలకే జై కొడుతున్నారు. ఫలితంగా లక్షలాది వ్యూస్‌తో జానపద పాటలు మరోసారి ప్రాణం పోసుకుంటున్నాయి. దీంతో వీటికి సినిమాల్లోనూ స్థానం కల్పిస్తున్నారు. అయితే మొదట పాడినవాళ్ల దగ్గర నుంచి అనుమతి తీసుకోవడమే కాక వారికి క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. లేదంటే చిక్కులు తప్పవు. తాజాగా లవ్ స్టోరీ సినిమాలో సూపర్ డూపర్ హిట్టైన 'సారంగ దరియా..' పాట మీద కూడా ఇలాంటి వివాదమే మొదలైంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ మీడియా ముందుకొచ్చింది కోమలి. అమ్మమ్మ దగ్గర నుంచి ఈ పాట నేర్చుకున్నాని, కానీ ప్రజలకు చేరువ చేసింది తాను కాబట్టి ఈ సాంగ్ తన సొంతమని చెప్తోంది. "రేలారే రేలా ప్రోగ్రాం సమయంలో సుద్దాల అశోక్‌తేజ నా పాట విన్నారు. లవ్ స్టోరీలో ఈ పాటను వాడుకున్నారని తెలియగానే అశోక్ తేజకు ఫోన్ చేశాను. ఇది ఎవరి సొంతం కాదు, నువ్వు పుట్టకముందే ఈ పాట నా దగ్గరుంది అని చెప్పాడు. కానీ ఈ పాటను ఆయన ఎప్పుడూ వెలుగులోకి తీసుకురాలేదు. సినిమాలో ఈ పాట నాతో పాడించనందుకు బాధేసింది. నా బాధను చూసి నాకు నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తానని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారు. కానీ సారంగరదరియా నాతో ఎందుకు పాడించలేదు? ఎందుకు అవకాశమివ్వలేదు? ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు అనేదే నా బాధ" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా ఈ పాట సేకరించింది కోమలి అని సుద్దాల అశోక్ తేజ సైతం అంగీకరించాడు. చదవండి: తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా? -
అనుకున్నది ఒక్కటి
‘మంచి మనసుకు మంచి రోజులు’ చిత్రంలోని ‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట..’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తాజాగా ఇదే పేరుతో ఓ సినిమా రూపొందింది. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. జర్నలిస్టు బాలు అడుసుమిల్లి ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకంపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదలకానుంది. ఈ చిత్రం కొత్త ట్రైలర్‌ని విడుదల చేశారు. బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ– ‘‘మీడియా నుంచి వచ్చి ఒక సినిమాకు దర్శకత్వం వహించడం పెద్ద స్టెప్. చాలామంది దర్శకులు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని దర్శకులందరికీ ఈ సినిమాను అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ధన్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ధన్య బాలకృష్ణ. ‘‘చిన్నప్పటి నుండి స్నేహితులైన నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా’’ అన్నారు సిద్ధీ ఇద్నాని. ‘‘ఈ కథలో నలుగురు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు త్రిధా చౌదరి. ‘‘హాయిగా రెండు గంటలపాటు నవ్వుకోవడానికి మా సినిమాకి రండి’’ అన్నారు కోమలి ప్రసాద్. ‘‘బాలు దర్శకుడు అవుతానని చెప్పినప్పుడు షాకయ్యా. కథ విన్న తర్వాత ట్రై చేయమని చెప్పాను. తర్వాత మేమే సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాం. రఘురామ్‌గారు, శ్రీరామ్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు’’ అన్నారు హిమబిందు. చిత్ర సహనిర్మాత రఘురామ్ యేరుకొండ, నటులు లోబో, బాషా మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎల్ఎ¯Œ వారణాసి, వైజేఆర్, లై¯Œ ప్రొడ్యూసర్: నేహా మురళి, కెమెరా: శేఖర్ గంగమోని, సంగీతం: వికాస్ బాడిస. -
మరీ ఇంత ఘాటు ముద్దా?.. హీరోయిన్ ఆగ్రహం
లిప్‌లాక్‌కు ఒప్పుకున్నాను కానీ మరీ ఇంత ఘాటు ముద్దా.. అంటూ నవ కథానాయకి దర్శకుడిపై మండిపడి షూటింగ్ నుంచే వెళ్లిపోయిన సంఘటన ఉట్రాన్ చిత్రంలో చోటు చేసుకుంది. సాట్ సినిమాస్ పతాకంపై రూపొందిన చిత్రం ఉట్రాన్. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 31వ తేదీన విడుదలకు సిద్ధమైంది. రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నటి హిరోషిణి హీరోయిన్గా నటించింది. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పాపులర్ అయిన హిరోషిణి హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం ఇది. రాజా గజనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశం వివాదంగా మారింది. దీనిపై చిత్ర వర్గాలు మాట్లాడుతూ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారని తెలిపారు. ఆ సన్నివేశానికి దర్శకుడు కట్ చెప్పిన తరువాత హీరోయిన్ ఆగ్రహంతో దర్శకుడి వద్దకు వచ్చి మీరు కథ చెప్పినప్పుడు లిప్‌లాక్ సన్నివేశం ఉంటుందనే చెప్పారని, అందుకే తాను ఓకే చెప్పానని అంది. ఇప్పుడు హీరో స్మూచ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసిందన్నారు. అయితే హీరోయిన్ చెప్పింది దర్శకుడికి అర్థంగాక అయోమయంలో పడడంతో హీరోయిన్ తనే ముద్దు గురించి వివరించిందన్నారు. లిప్‌లాక్ అంటే పెదాలపై చుంభించడం అనీ, స్మూచ్ అంటే పెదాలను దాటి నాలుకను చప్పరించడం అనీ, హీరో అదే చేస్తున్నారని చెప్పిందన్నారు. హీరో కల్పించుకుని ఈ సారి కరెక్ట్‌గా లిప్‌లాక్ చేస్తానని చెప్పడంతో దర్శకుడు హీరోయిన్‌కు సర్దిచెప్పి నటింపజేశారన్నారు. హీరో మళ్లీ స్మూచ్ కిస్ ఇవ్వడంతో మండిపడ్డ నటి హిరోషిణి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయి కార్వాన్లో కూర్చుందన్నారు. యూనిట్ వర్గాలు ఎంత చెప్పినా వినకుండా ఊరుకు వెళ్లిపోయిందని చెప్పారు. ముద్దుల్లో ఎన్నిరకాలు ఉంటాయో తెలియని దర్శకుడు నటి హరిరోషిణి ఇచ్చిన వివరణతో విస్మయం చెందారని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా నటి వెయిల్ ప్రియాంక, వేల రామమూర్తి, మధుసూదనరావ్, ఆర్.రవిశంకర్, జిన్నా, గానా సుధాకర్, ఒరు కన్ ఒరు కన్నాడీ ఫేమ్ మధుమిత, దర్శకుడు సరవణన్ శక్తి, ఇమాన్‌అన్నాచ్చి, విజయ్ టీవీ ఫేమ్ కోదండం, కాదల్ చిత్ర ఫేమ్ సరవణన్, సులక్షణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రఘునంథన్ సంగీతాన్ని, హాలిక్ ప్రభు ఛాయాగ్రహణను అందించారు. -
పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..
సినిమా: ఉట్రాన్ అన్న పేరు కోసమైనా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్ పేర్కొన్నారు. సాయి సినిమాస్ పతాకంపై ఓ.రాజా గజనీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఉట్రాన్. నవ జంట రోషన్, హీరోషిణి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. రోషన్ తమిళనాడు పత్రికల సంఘం అధ్యక్షుడు సుభాష్ కొడుకన్నది గమనార్హం. ఇకపోతే నటి హిరోషిణి పదహారణాల తెలుగమ్మాయి. అంతే కాదు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. కోమలి సిస్టర్స్ అంటే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో తెలియని వారుండరన్నది అతిశయోక్తి కాదు. ఆ సిస్టర్స్ యూట్యూబ్ కార్యక్రమాలతో అంత పాచుర్యం పొందారు. వారిలో పెద్ద సహోదరినే హిరోషిని కోమలి. ఈ చిన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో ఉట్రాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి భిన్నంగా హైదరాబాద్‌కు చెందిన హిరోషిణి రచ్చ గెలిచి ఇంట గెలవడానికి రెడీ అయ్యింది. కాగా రఘునందన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్ మాట్లాడుతూ ఇది తన కుటుంబ వేడుకగా పేర్కొన్నారు. తన జీవితం కమ్యూనిస్ట్ పార్టీ నుంచే మొదలైందన్నారు. తన ప్రియ సహోదరుడి మనుమడు రోషన్ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడన్నారు. ఇతనికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉదయకుమార్ అని చెప్పారు. ఈ చిత్ర టైటిల్ తనకు చాలా నచ్చిందన్నారు. ఉట్రాన్ అన్న పేరుకే ఈ చిత్ర యూనిట్ వేడుకను చేసుకోవాలన్నారు. చిత్రంలో నటుడు రోషన్ చాలా ఈజ్‌గా నటించినట్లు ప్రశంసించారు. దర్శకుడు దీన్ని పలు సమస్యలు, ద్రోహాలను ఎదురొడ్డి రూపొందించారని చెప్పారు. మరో అతిథి దర్శకుడు పేరరసు మాట్లాడుతూ పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చునని, అయితే సినిమాల్లోకి వచ్చిన వారు పనికి రాకుండా పోకూడదన్నారు. నటుడు రోషన్‌ను చూస్తుంటే అల్లుఅర్జున్ మాదిరి ఉన్నాడని అన్నారు. ఉట్రాన్ అంటే దగ్గర బందువు అని అర్ధం అని చెప్పారు. అనంతరం చిత్ర దర్శక నిర్మాత రాజా గజని మాట్లాడుతూ 18 చిత్రాలకు పని చేశానని, అలాంటిది తన కోసం ఏ నిర్మాత ముందుకు రాలేదని అన్నారు. అందుకే తానే నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో ఉట్రాన్ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రేక్షకులకు రుచించే అన్ని అంశాలు ఉట్రాన్ చిత్రంలో ఉంటాయని రాజాగజని తెలిపారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, నిర్మాత కలైపులి ఎస్.థాను, కే.భాగ్యరాజ్, కే.రాజన్, నటుడు ఆరి పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. -
కామెడీ కాస్తా కాంట్రవర్సీ!
‘జయం’ రవి నటించిన కొత్త చిత్రం ‘కోమలి’. ఈ సినిమాలో కామెడీ కోసం వేసిన జోక్ కాంట్రవర్సీ అయింది. రజనీ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ‘కోమలి’ సినిమాలో 16 ఏళ్లు కోమాలో ఉండి బయటకు వస్తారు ‘జయం’ రవి. అయితే తాను కోమాలో ఉన్న విషయాన్ని అతను గ్రహించాడు. దాంతో 16 ఏళ్లు కోమాలో ఉన్నావని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అతన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలోనే పక్కనే ఉన్న టీవీలో న్యూస్ ప్లే అవుతుంటుంది. ‘త్వరలోనే రాజకీయాల్లో అడుగుపెడతాను’ అని రజనీకాంత్ ప్రసంగిస్తుంటారు. దాంతో తానింకా 2003లోనే ఉన్నాను అని హీరో అనుకుంటాడు. ఇది ఈ చిత్రం టీజర్‌లోని సీన్. ఏళ్ల తరబడి రాజకీయాల్లోకి వస్తానని రజనీ ఊరిస్తూ వస్తున్న విషయాన్ని చెప్పేలా ఈ సీన్ ఉందని ఆయన అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ సీన్ తీసేయాలని రజనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల చేశారు. దాంతో చిత్రబృందం కట్ చేస్తున్నట్టు ప్రకటించారు. -
కాజల్ చిత్రానికి అన్ని వీడియో కట్స్ ఎందుకు ?
సినిమా: పాపం నటి కాజల్ అగర్వాల్‌కు మాత్రమే ఎందుకిలా జరుగుతోంది. 2017లో విజయ్‌తో నటించిన మెర్శల్ చిత్రం తరువాత కోలీవుడ్‌లో ఈ అమ్మడు నటించిన చిత్రమేదీ తెరపైకి రాలేదు. అలాగని తెలుగులో ఇటీవల నటించిన చిత్రమేదీ విజయం సాధించలేదు. అలాగని కాజల్‌అగర్వాల్‌కు అవకాశాలు లేకుండా పోలేదు. ముఖ్యంగా ప్రస్తుతం కోలీవుడ్‌నే ఈ బ్యూటీ నమ్ముకుంది. అందులో ఒకటి జయంరవితో డూయెట్స్ పాడిన కోమాలి చిత్రం. ఇది నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 15న తెరపైకి రానుంది. ఇక మరో లక్కీచాన్స్ విశ్వనటుడు కమలహాసన్ సరసన శంకర్ తెకెక్కించనున్న ఇండియన్–2 చిత్రం. ఇంకేంటి కాజల్ çఫుల్జోష్లోనే ఉందిగా? అని అంటారా? ఈ అమ్మడు నటించిన తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ప్యారిస్ ప్యారిస్. ఇది హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్. ఎందరో ప్రముఖ నటీమణులు నటించాలని ఆశ పడ్డ ఈ చిత్రంలోని కథానాయకి పాత్రను పోషించే అవకాశం నటి కాజల్‌అగర్వాల్‌కు దక్కింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇదే చిత్రం తెలుగులో నటి తమన్నా హీరోయిన్గా దటీజ్ మహాలక్ష్మి పేరుతో తెరకెక్కింది. ఇక కన్నడంలో పరూల్‌మాధవ్ హీరోయిన్గా బటర్‌ఫ్లై పేరుతోనూ, మలయాళంలో మంజిమామోహన్ హీరోయిన్గా జామ్జామ్ పేరుతోనూ రూపొందింది. మీడియంట్ ఫిలిం పతాకంపై మనుకుమార్ నాలుగు భాషల్లోనూ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. వచ్చిన చిక్కేంటంటే తెలుగు, కన్నడం, మలయాళం వెర్షన్లకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్లను ఇచ్చారు. కాజల్‌అగర్వాల్ నటించిన తమిళ వెర్షన్‌కే 25 వరకూ ఆడియో, వీడియో కట్స్‌ను ఇచ్చారు. ఒకే కథకు రీమేక్ అయిన ఈ నాలుగు చిత్రాల్లో మూడు చిత్రాలకు సెన్సార్ గ్రీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే కాజల్‌అగర్వాల్ నటించిన తమిళ వెర్షన్ ప్యారిస్ ప్యారిస్ చిత్రానికి అన్ని కట్స్ ఇవ్వడంతో పాపం కాజల్ ఏం చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇదే అభిప్రాయానికి వచ్చిన ప్యారిస్ ప్యారిస్ చిత్ర నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు మీడియాకు ఆదివారం సాయంత్రం వ్యక్తం చేశారు. మరి ఆ కమిటీ కాజల్ చిత్రం ప్యారిస్ ప్యారిస్ చిత్రాన్ని చిన్న చిన్న మార్పులను చూపించి వదిలేస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. -
కోమాలిలో కావాల్సినంత రొమాన్స్
తమిళసినిమా: కోమాలి చిత్రంలో కావాల్సినంత రొమాన్స్ ఉంటుందంటున్నారు ఆ చిత్ర కథానాయకుడు జయంరవి. జయం చిత్రంతో కథానాయకుడిగా సినీ రంగప్రవేశం చేసిన ఈయన ఆ చిత్రం పేరునే తన పేరుకు ముందు చేర్చుకుని తన విజయ పయనాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అలా 24 చిత్రాలు పూర్తి చేశారు. 24వ చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం కోమాలి. కాజల్‌అగర్వాల్, సంయుక్తహెగ్డేలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ పరిచయం అవుతున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరిగణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్హాప్ తమిళా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా కోమాలి చిత్ర కథానాయకుడు జయంరవితో సాక్షీ భేటి అయింది. ప్ర: కోమాలి చిత్రం కథ గురించి వివరించండి? జ: కోమలి చిత్రం నాకు చాలా ప్రత్యేకం. ఇది నాగరికత చెందుతున్న మనిషి జీవన విధానం గురించి ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుంది. సుమారు 20 ఏళ్ల క్రితం భవిష్యత్‌లో నీళ్లను బాటిల్లో విక్రయించే రోజు వస్తుందంటే ఎవరూ నమ్మేవారు కాదు. అలాంటి విషయాల గురించి మాట్లాడే ఒక యువకుడిని జోకర్‌గా చూసేవారు. ఆ యువకుడి ఇతి వృత్తంతో సాగే కథా చిత్రమే కోమలి. ఇది రాతి యుగం నుంచి కాలం ఎలా మారుతూ ఆధునిక యుగంగా రూపాంతం చెందిందన్న పలు విషయాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుంది. ప్ర: చిత్రంలో మీరు చాలా గెటప్‌లలో కనిపించనున్నట్లున్నారు? జ: అవును. ఇందులో చాలా గెటప్‌లలో కనిపిస్తాను. అందులో నాలుగు గెటప్‌లకు కథలో ప్రాధాన్యత ఉంటుంది. మిగిలినవి రాతి యుగం నుంచి మనిషి ఎలా రూపాంతం చెందాడన్నది చూపడానికి ఉపయోగించాం. నాలుగు గెటప్‌లలో విద్యార్థి దశలోని పాత్ర చిత్రంలో సుమారు 20 నిమిషాలు ఉంటుంది. ఆ పాత్ర కోసం మారడానికి చాలా కసరత్తులు చేయాల్సి వచ్చింది. ముందు విద్యార్థిగా వేరే నటుడితో నటింపజేద్దామని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే వేరే నటుడైతే సహజంగా ఉండదని నేనే విద్యార్థిగానూ నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు చాలా బరువు తగ్గాల్సి వచ్చింది. ప్ర: ఇలా బరువు పెరగడం, తగ్గడం కష్టం అనిపించడం లేదా? జ: చాలా కష్టం. అయితే ఇప్పుడు ప్రేక్షకులు మామూలుగా లేరు. వారికి నచ్చకపోతే ఎలాంటి చిత్రాన్నైనా పక్కన పెట్టేస్తున్నారు. సో వారిని సంతృప్తి పరచడానికి మేము శ్రమించక తప్పదు. అంతే కాకుండా కొత్తదనాన్ని నేనూ కోరుకుంటాను. ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తాను. ఇదే మా నాన్న నాకు చెప్పారు. ప్ర: కోమాలి చిత్రంలో ప్రత్యేకతలేంటి? జ: చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్రంలో విద్యార్థి దశ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇక పలు గెటప్‌లు. వీటితో పాటు చెన్నై 2015లో ఎదుర్కొన్న వరద సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సెట్ వేయడానికి 10 మందికి పైగా ప్రముఖ కళాదర్శకులను సంప్రదించి, నాటి వరదలను కళ్లకు కట్టినట్లు సెట్ వేసి సన్నివేశాలను రూపొందించాం. ప్ర: హీరోయిన్గా నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేయడానికి కారణం? జ: కొత్త కాంబినేషన్ బాగుంటుందనే. నిజం చెప్పాలంటే ఇంతకు ముందే మా కాంబినేషన్లో చిత్రం రావాల్సింది. అలా రెండు సార్లు అనివార్యకారణాల వల్ల అది సెట్ కాలేదు. ఈ చిత్రం కోసం కాజల్‌అగర్వాల్‌ను అడిగినప్పుడు నటిస్తానని చెప్పారు. నిజానికి ఇందులో ఆమె పాత్ర పరిది తక్కువగానే ఉంటుంది. కథ నచ్చడంతో మంచి కథా చిత్రంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నానని తను నటించడానికి అంగీకరించారు. ఇందులో మరో హీరోయిన్గా సంయుక్తాహెగ్డే నటించారు. ప్ర: ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి రొమాన్స్ సన్నివేశాలు బాగానే ఉంటాయని భావించవచ్చా? జ: కోమలి చిత్రంలో కావాల్సినంత రొమాన్స్ ఉంటుంది. మరో విషయం ఏమిటంటే సాధారణంగా చిత్రాల్లో ఒక సన్నివేశంలో సెంటిమెంట్, మరో సన్నివేశంలో రొమాన్స్, ఇంకో సన్నివేశంలో వినోదం ఉంటాయి, అయితే కోమాలి చిత్రంలో ప్రతి సన్నివేÔ¶ ంలోనూ రోమాన్స్, కామెడీ, సెంటిమెంట్ వంటి అంశాలు చోటు చేసుకుంటాయి. ఇదే ఈ చిత్రంలో హైలైట్. అందుకే నాకీ చిత్రం ప్రత్యేకం. ప్ర: మీ వారసుడు ఆరవ్‌ను టిక్ టిక్ టిక్ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయం చేశారు. ఆ తరువాత మరే చిత్రంలోనూ ఆరవ్ నటించలేదే? జ: నిజం చెప్పాలంటే ఆరవ్ ఆ చిత్రం తరువాత 25 చిత్రాల అవకాశాలు వచ్చాయి. చదువు పాడవుతుందని ఆ అవకాశాలను అంగీకరించలేదు. ఇప్పుడు ఆరవ్‌కు 9 ఏళ్లు. మరో 10 ఏళ్లలో హీరో అయిపోతాడు. ప్ర: ఆరవ్ హీరోగా పరిచయం అయ్యే చిత్రానికి మీరే దర్శకత్వం వహిస్తానని ఇంతకు ముందు అన్నారు. అదే జరుగుతుందా? జ: నేను దర్శకత్వం చేద్దాం అనుకున్నాను కానీ దర్శకుడు శక్తిశరవణన్ ఆరవ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వాలని నాతో ప్రామిస్ చేయించారు. ప్ర: సరే మీరు దర్శకత్వం వహించేదెప్పుడు? జ: అందుకు 3 కథలను సిద్ధం చేసుకున్నాను. అయితే దర్వకత్వం చేపట్టడానికి ఇంకా టైమ్ పడుతుంది. ప్ర: మీ సోదరుడు మోహన్‌రాజాతో తనీఒరువన్ 2 చేస్తానన్నారు. అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? జ: అన్నయ్య తనీఒరువన్ 2 చిత్ర కథను తయారు చేసే పనిలోనే ఉన్నారు. కథ దాదాపు పూర్తయింది. అయితే నేను ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో అన్నయ్యనే ఆ చిత్రాలు పూర్తి చేయ్యి ఆ తరువాత మనం కలిసి తనీఒరువన్ 2 చేద్దాం అని చెప్పారు. ప్ర: మీరు నటించిన హిట్ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి సరైన ప్రమోషన్ లేక ప్రేక్షకులను రీచ్ అవ్వలేకపోతున్నాయి. కొన్ని చిత్రాలయితే ఛానళ్లకే పరిమితం అవుతున్నాయన్నది తెలుసా? జ: నిజమే. ఈ విషయం నా దృష్టికీ వచ్చింది. నేను నటించిన అడంగుమరు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటే తెలుగులో నా పాత్రను పోషించే నటుడు లేరని చెప్పారు. దీంతో ఆ చిత్రాన్ని అనువాదంగానే విడుదల చేయాలనుకుంటున్నాం. అయితే గత చిత్రాల మాదిరిగా కాకుండా బాగా ప్రమోట్ చేసే నిర్మాత దిల్‌రాజుకు ఆ బాధ్యతలను అప్పగించడానికి చర్చలు జరుగుతున్నాయి. ప్ర: చివరిగా ఒక ప్రశ్న. మీరు తెలుగులో నటించే అవకాశం ఉందా? జ: చెయ్యాలండీ. చాలా మంది అడుగుతున్నారు. కచ్చితంగా తెలుగులో చిత్రం చేస్తాను. -
గ్రూప్-2 ఎగ్జామ్.. విషాదం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని చీడికాడ మండలం ఖండివరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాత్రూమ్లో విద్యుత్ షాక్‌తో గ్రూప్-2 విద్యార్థిని కోమలి మృతి చెందింది. పరీక్ష రాసేందుకు ఆటోనగర్‌లో ఉన్న తండ్రి వద్దకు విద్యార్థిని వచ్చింది. మరికాసేపట్లో ఏపీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జగరనున్న సంగతి తెలిసిందే. పరీక్ష కోసం పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయి.. సిద్ధంగా ఉన్న కోమలి ఆకస్మికంగా మరణించడంతో ఖండివరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆనందం తొమ్మిదింతలు!
సినిమాలో ఒకటీ, రెండు గెటప్స్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. అదే తొమ్మిది గెటప్స్‌లో తమ హీరో కనిపిస్తే ఆనందం తొమ్మిదింతలైనట్టే. ఇప్పుడు అలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ‘జయం’ రవి. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ‘జయం’ రవి నటిస్తున్న చిత్రం ‘కోమలి’. ఇందులో కాజల్ అగర్వాల్, సంయుక్తా హెగ్డే కథానాయికలు. ఈ సినిమాలో ‘జయం’ రవి దాదాపు 9 గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ విషయం గురించి దర్శకుడు ప్రదీప్ మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండే కామెడీ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నాం. ‘జయం’ రవిగారు పోషించే తొమ్మిది పాత్రల్లో ముఖ్యంగా 1990ల్లో గెటప్ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు. -
కోమలి.. విషాద ఝరి
కోమలి(పిట్టలవానిపాలెం): నవంబర్ 19.. గత 41 ఏళ్లుగా ప్రతి ఏడాది ఆ తేదీ కోమలి గ్రామంలో ప్రతి ఒక్కరిని పుట్టెడు దుఃఖంలో ముచ్చెత్తుతోంది. ప్రకృతి ప్రకోపమో... మానవ తప్పిదాలో ఆ గ్రామ ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. పేరుకు తగ్గట్టుగానే కోమలి భౌగోళికంగా చాలా సున్నితమైన ప్రాంతం. నిజాంపట్నం సముద్రతీరానికి కూతవేటు దూరంలో ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడల్లా కోమలి గ్రామం ఉలిక్కిపడుతుంది. సరిగ్గా 41 ఏళ్ల క్రితం 1977 నవంబర్ 19న రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన దివిసీమ తుఫాన్ కోమలి గుండెలపై చెరగని ముద్రవేసింది. తుఫాన్ భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామానికి చెందిన దళితులు సమీపంలోని ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నారు. బిక్కుబిక్కుమంటూ క్షణం ఒక యుగంలా గడిపారు. భయంకర తుఫాన్ వీరికి ఎలాంటి హాని కలిగించలేదు. కానీ ప్రార్థనా మందిరం ఒక్కసారిగా కూలిపోవడంతో ఎందరో మృత్యువాత పడ్డారు. సుమారు 99 మంది ఈ శిథిలాల కింద తుదిశ్వాస విడిచారు. ఈ దురదృష్ట ఘటనకు ప్రతీకగా ప్రార్థనా మందిరం కూలిన ప్రదేశంలోనే స్థూపం నిర్మించారు. ప్రతి ఏడాది నవంబర్ 19 వ తేదీన స్థూపం వద్ద నివాళుల ర్పించే దళితులు దేవుడా మళ్లీ ఇలాంటి పరిస్థితిని రానివ్వకు ప్రభు అంటూ వేడుకుంటారు. ఏడేళ్ల క్రితం గ్రామానికి చెందిన కొందరు ట్రాక్టర్‌పై శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా పిట్టలవానిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం సమీపంలో తెనాలి–నిజాంపట్నం కాలువలో ట్రాక్టర్ ట్రక్కు బోల్తా కొట్టిన ఘటనలో గ్రామానికి చెందిన 11 మంది మృత్యువాత పడ్డారు. స్వల్ప గాయాలతో బయట పడ్డాను అప్పట్లో నా వయస్సు 8 ఏళ్లు. తుఫాను సమయంలో మా అమ్మతో కలిసి ప్రార్థనా మందిరంలోకి వెళ్లాం. ఆ సమయంలో చర్చి కూలుతుండగా మా అమ్మ చాకచక్యంగా మమ్మల్ని కాపాడింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాం. అయితే ఏడేళ్ల క్రితం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మా అమ్మ చనిపోయింది. –పల్లెకోన సుబ్బారావు, స్థానికుడు ఘటన దురదృష్టకరం 1977, నవంబర్ 19న తుఫాను సమయంలో ప్రార్థనా మందిరంలో కూలడం చాలా దురదృష్టకరం.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం అదే రీతిలో ట్రాక్టర్ ప్రమాదం జరిగి ఎక్కువ మంది చనిపోవడం తీరని లోటు .ప్రతి ఏడాది వారి జ్ఞాపకార్థంగా 19 నవంబర్ రోజున స్థూపం వద్ద ప్రార్థన చేసి వారిని స్మరించుకుంటాం. – ప్రభుదాసు, స్థానికుడు -
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..?
సాక్షి, హైదరాబాద్: మాటల్లో చాతుర్యం. మిమిక్రీతో హాస్యంతో అలరించి.. డైలాగ్ పంచులతో ఆకట్టుకునే కోమలి సిస్టర్స్ అందరికీ సుపరిచితమే. చిన్న వయసులోనే అసమాన ప్రతిభతో ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. కోమలి సిస్టర్స్‌లో పెద్ద కోమలి అదేనండి. హిరోషిని కోమలి ఇప్పుడు సినిమా హీరోయిన్ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తన పేరు హిరోషినిలోని హీరోతో పాటు తాను కూడా ఇన్ అంటూ హీరోయిన్గా వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడింది. ఖమ్మంలో పుట్టినా.. నేను, చెల్లి పుట్టింది ఖమ్మంలోనే అయినా నా రెండో యేట నుంచే హైదరాబాద్‌లో పెరిగాను. కోమలి హిరోషిని, కోమలి దేవర్షిని. ఇద్దరం కోమలి సిస్టర్స్‌గా అందరికీ సుపరిచితమే. చిన్నప్పటినుంచే మేం మిమిక్రీలు, ప్రోగ్రామ్స్‌తో అలరిస్తున్నాం. టీవీ షోల్లో ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఇచ్చాం. ప్రస్తుతం నేను యూసుఫ్‌గూడ సెయింట్ మెరీస్‌లో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఫైనలియర్ చదువుతున్నాను. హైదరాబాద్‌లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్‌కు వచ్చేంతవరకు నా మనసు ఊరుకోదు. మిమిక్రీ షోలకు దూరంగా.. కొత్త హిరోషిని కోమలిగా దగ్గర కావాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా మిమిక్రీలాంటి షోలకు దూరంగా ఉన్నాను. చివరగా త్రివిక్రమ్ చిత్రం ‘అ ఆ’ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాను. థియేటర్ వర్క్‌షాప్‌లో సత్యానంద్ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నాను. కొద్దిపాటి ప్రతిభ, అనుభవం ఉన్నా... డ్యాన్సర్‌గా, ఆర్టిస్ట్‌గా అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని వెండితెరకు రావాలన్నదే నా ఆలోచన. ప్రేక్షకులు కొంగొత్తగా హిరోషిని కోమలిని చూడాలని జిమ్, ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నా. కునాల్ గిర్ స్టీల్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నాను. రకుల్, రానా, అంజలి, రవితేజ లాంటి వారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. పుడ్, వ్యాయాయం, యోగాలతో పాటు వర్కవుట్లకు అధిక ప్రాధాన్యమిచ్చాను. రెగ్యులర్ పాత్రల కన్నా చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది. -
నువ్వు హీరోనా...? అన్నారు
– ఆనంద్ రవి ఆనంద్ రవి డైరెక్ట్ చేసిన ‘పేరెంట్స్’ మూవీ చూసిన రోజే ఇతను మంచి దర్శకుడు అవుతాడనుకున్నా. తను ‘నెపోలియన్’ సినిమాలో నటిస్తున్నాడని తెలియగానే ఎందుకు నటన పట్ల ఆసక్తి చూపుతున్నాడనిపించింది. ట్రైలర్, పోస్టర్స్ చూడగానే ఈ సినిమాను తనే డైరెక్ట్ చేసి, హీరోగా చేయడం కరెక్ట్ అనిపించింది’’ అని నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ అన్నారు. ఆనంద్ రవి, కోమలి, రవివర్మ, కేదార్ శంకర్, మధుమణి, అల్లు రమేశ్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ రవి దర్శకత్వంలో బోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘నెపోలియన్’. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, హీరో సందీప్‌కిషన్ విడుదల చేశారు. ఆనంద్ రవి మాట్లాడుతూ– ‘‘నేనీ కథతో చాలా మందిని కలిశా. ‘నీడపోయింది’ అనే పాయింట్ చెప్పగానే షార్ట్ మూవీయా? అన్నారు. హీరోగా నేనే చేయబోతున్నా అనగానే.. ‘నువ్వు హీరోనా! ప్రొడ్యూసర్ ఎవరు?’ అనడిగారు. అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. థ్రిల్లర్ జోనర్ సినిమా అయినా, కొత్త కాన్సెప్ట్‌తో ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా’’ అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత బోగేంద్ర గుప్తాకు చెందిన ట్రిపుల్ ఎస్ అనే ఎన్.జి.ఒ సంస్థ అనారోగ్యంతో బాధపడుతున్న సినిమా జర్నలిస్ట్ వరప్రసాద్‌కు 25,000 చెక్‌ను సీనియర్ పాత్రికేయులు బీఏ రాజు, పసుపులేటి రామారావులకు అందజేశారు. -
పైసాచికట్నం
► కోమలి వృత్తాంతం తెలుసుకుంటే కన్నీరు ఉబుకుతుంది. ► కోమలి పడిన కష్టాలను తలచుకుంటే గుండె కరుగుతుంది. ► కోమలి మానసిక వేదనను ఆమె తండ్రి చెబుతుంటే గుండె అవిసిపోతుంది. ► కోమలి కూతురు మోక్షిత మాటలు వింటుంటే మనసు నీరైపోతుంది. ► వరకట్న ‘పైసా’చికత్వాలను తలచుకుంటే రక్తం సలసలా మరుగుతుంది. ► శివబ్రహ్మం లాంటి భర్తలకు తగిన శాస్తి జరగాలనిపిస్తుంది. ► అలా మరే ఆడకూతురికీ జరగకుండా మనం చూసుకున్నప్పుడే ► మహిళలకు న్యాయం జరుగుతుంది. సమాజం బాగుపడుతుంది. వరకట్న పిశాచం మరో అబలను బలి తీసుకుంది. అత్తింటివారి వేధింపులకు ఇంకో బతుకు అర్ధంతరంగా ముగిసింది. ముద్దులు మూటగట్టే పిల్లల కంటే కట్నపు కాసులే విలువైనవిగా అనిపించాయి ఆ మృగాడికి. నిక్షేపంలాంటి ఉద్యోగం ఉన్నా, అత్తింటివారి అదనపు కట్నకానుకలే ఆకర్షణీయంగా అనిపించింది ఆ కర్కోటకుడికి. అందుకే తన మాటలతో వేధించి, చేతలతో హింసించి... కట్టుకున్న భార్యను కాటికి పంపేశాడు. విజయవాడలో జరిగిన ఈ సంఘటన కరకు గుండెలను సైతం కంటతడిపెట్టిస్తుంది. తల్లి చనిపోయిందని తెలియక ఎప్పుడొస్తుందంటూ అమాయకంగా అడుగుతున్న ఆ చిన్నారులను చూస్తే ఎంతటి వారికైనా మనసు కరిగిపోతుంది. గుండె నీరైపోతుంది. తండ్రి సుబ్బారావు చెప్పిన వివరాల ప్రకారం కోమలి ఉదంతం ఇది. బూదా కోమలి ఎప్పుడూ చలాకీగా ఉండేది. రైల్వే ఉద్యోగి శివబ్రహ్మంతో పెళ్లి జరిగింది. ఎన్నో కలలతో అత్తవారింట అడుగుపెట్టిందామె. విజయవాడలోని అయోధ్యానగర్‌లో వాళ్ల నివాసం. ఆర్థికంగా ఎలాంటి లోటూ లేని కుటుంబం. ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలనుకుందామె. ఆ సంతృప్తి ఎన్నాళ్లో లేదు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. భర్త నుంచి మాత్రమే కాదు, అత్తమామలు, ఆడపడుచులు మూకుమ్మడిగా ఆమెను కాల్చుకు తినేవారు. వారి చిత్రహింసలను తాళలేని కోమలి అర్ధంతరంగా తనువు చాలించింది. నాలుగేళ్ల కూతురిని, ఎనిమిది నెలల చిన్నారి కొడుకును దిక్కులేనివారిగా చేసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు అత్తింటి వారు. కానీ నాలుగేళ్ల కూతురి మాట వేరుగా ఉంది. రాత్రిపూట తన తండ్రి విపరీతంగా తల్లిని కొట్టాడని చెబుతోంది. ఆ దెబ్బలకు తాళలేకనే కోమలి చనిపోయిందంటున్నారు కోమలి బంధువులు. చనిపోయిన తర్వాత ఆమె మృతదేహానికి ఉచ్చువేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అంత పిరికిది కాదు... ‘కోమలి ఎం.కాం. చదువుకుంది. లోకజ్ఞానం కలిగి ఉంది. ఆత్మహత్య చేసుకునేంత ఆత్మస్థైర్యం లేనిది కాదు’ అంటున్నారు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు. అసలు విషయం తెలియక ‘అమ్మ ఎప్పుడు వస్తుంది’ అంటూ అమాయకంగా అడిగే చిన్నారి కూతురిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, గుండె నీరైపోతోందంటూ రోదిస్తున్నారు ఇరుగుపొరుగు వాళ్లు. ఈ ఉదంతం గురించి తెలిసిన చుట్టుపక్కల వాళ్లూ కన్నీళ్లు పెడుతున్నారు. వచ్చే నెల మూడో తేదీన కోమలి చెల్లెలి పెళ్లి. ఇప్పుడీ సంఘటనతో అదీ ఆగిపోయింది. ‘‘అత్తింటి క్రూరత్వం అంతా ఇంతా కాదు. అమ్మాయి కోమలిని తన చెల్లెలి నిశ్చితార్థానికీ పంపలేదు. పప్పన్నం పెట్టే రోజున భోజనానికి కూడా వెళ్లనివ్వలేదు. శుభకార్యానికి రాలేననీ, తన భర్త పంపడం లేదని వర్తమానం పంపింది’’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు కోమలి తల్లిదండ్రులు. ‘‘పెళ్లయిన కొత్తలో బాగానే ఉండేవారు. మనవరాలు పుట్టిన దగ్గర్నుంచీ అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. కట్టుకున్నవాడే కాదు... అత్తమామలూ, ఆడబడుచులూ అదనపు కట్నం కోసం ఆమెను కాల్చుకుతిన్నారు. తన చివరి కుమార్తె పెళ్లి అనుకున్న దగ్గరి నుంచీ తనకు మరింత కట్నం కావాలంటూ అల్లుడు శివబ్రహ్మం కోరాడనీ, పెద్దమనుషుల ముందు మాట్లాడి మళ్లీ కాపురానికి పంపామనీ, అయినా కట్టుకున్నవాడు, ఆ అత్తింటి వాళ్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారనీ కుమిలిపోతున్నారు కోమలి తల్లిదండ్రులు. ‘‘వాళ్ల వేధింపులు తట్టుకోలేక నా కూతురు కొన్నాళ్లు మా దగ్గరే ఉంది. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు పంపేవాళ్లమే కాదు’’ అంటూ ఆవేదన చెందుతున్నారు. పెళ్లికైనా వస్తుందనుకున్న కూతురు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలిసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇదీ నేపథ్యం... చిట్టినగర్‌కు చెందిన బరిగే సుబ్బారావు దంపతులకు నలుగురు కుమార్తెలు, వీరిలో మూడో కుమార్తె కోమలికి చీరాలకు చెందిన బూదా శివబ్రహ్మంతో వివాహం జరిగింది. వివాహ సమయంలో నాలుగు లక్షల నగదు, లక్ష రూపాయల బంగారు ఆభరణాలు, ఇంట్లోకి సామాను ఇచ్చారు. అయితే పెళ్ళయిన కొత్తలో బాగానే ఉన్నా, కూతురు మోక్షిత పుట్టిన దగ్గర్నుంచి కోమలికి ఎన్నో కష్టాలు... ఆడపిల్ల పుట్టిందంటూ ఛీత్కారాలు... ఆపై అదన పు కట్నం కోసం భర్త వేధింపులు... తన చెల్లికి పెళ్లి కుదిరిందని వచ్చేనెల మూడోతేదీన వివాహం జరగనుందని తెలిసినా వెళ్లలేని నిస్సహాయత... అంతకు ముందు నిశ్చయతాంబూలాలకు రావాలంటూ శివబ్రహ్మాన్ని కోమలి తల్లితండ్రులు కోరినా వచ్చేది లేదని, భార్యను కూడా పంపేది లేదని భీష్మించాడు. అంతేకాదు... వారు ఉంటున్న ఇంటిని తనకు రాసి ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో వారు పరిస్థితులు అవే సర్దుకుంటాయిలే అనుకుంటూ వెళ్లిపోయారు. చిన్న కూతురి వివాహ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా, కోమలి ఇక లేదనే పిడుగులాంటి వార్త రావటంతో హతాశులయ్యారు. అనునిత్యం అవమానాలు పెళ్ళయిన నాటి నుంచి కోమలి భర్త శివబ్రహ్మం అత్తమామల పట్ల చిన్నచూపుతో ఉండేవాడు. వాళ్ళ పేరు చెప్పినా సహించే వాడు కాదు. అత్తమామల ఇంటికి సమీపంలోనే ఉన్నప్పటికీ వారి ఇంటికి వెళ్లడం గానీ, వారితో మాట్లాడటం కానీ చేస్తే కోమలిపై చేయి చేసుకునే వాడు. వారితో ఫోన్లోనైనా మాట్లాడనిచ్చేవాడు కాదు. వారిని కనీసం పిల్లల అన్నప్రాశనకు కూడా పిలవలేదు. తమను కించపరచినా ఫర్వాలేదని, తమ కూతురు బాగుంటే చాలని అన్నీ భరించామని ఫొటోలలో తాము ఉన్న చోట వేస్ట్ అని రాసేవాడని, తమ ఫొటోలను కత్తిరించి డస్ట్‌బిన్‌లో పడేసేవాడని కోమలి తల్లిదండ్రులు వాపోయారు. కోమలికి కూతురు పుట్టిన తరువాత రోడ్డుమీదే కొట్టుకుంటూ తమ ఇంటికి తీసుకువచ్చి వదిలేశాడని గుర్తు చేసుకుని బోరుమన్నారు. అత్తమామలని తమకు కనీస మర్యాద ఇవ్వక పోగా ఒసేయ్ అరేయ్ అంటూ కించపరచేవాడని వాపోయారు. కనీసం చుట్టుప్రక్కలవారితో మాట్లాడినా కోమలిని కొట్టేవాడని చెప్పారు. పథకం ప్రకారమే హత్య... తన కూతురిని వదిలించుకుంటే రెండో పెళ్ళి చేసుకోవచ్చనే దురుద్దేశంతోనే అల్లుడు శివబ్రహ్మం తన కూతురుని పథకం ప్రకారం హత్య చేశాడని కోమలి తండ్రి సుబ్బారావు ఆరోపించారు. తాను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇరవై లక్షలు కట్నం వస్తుందని తన కూతురి వద్ద అల్లుడు శివబ్రహ్మం తరచు అనేవాడని, అతడి తల్లితండ్రులు కూడా అతడికి వంత పాడేవారని ఆరోపించారు. తన కూతురు చేతికి ఉండాల్సిన ఉంగరాలు, బీరువా తాళాలు తదితర సామాగ్రిని పర్సులో పెట్టి మంచం కింద పెట్టటం అనుమానాలకు తావిచ్చేలా ఉందంటున్నారు కోమలి తల్లిదండ్రులు. తన కూతురికి జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకుండా శివబ్రహ్మాన్ని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. - జి.పి. వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి, విజయవాడ నాన్న అమ్మను బెల్టుతో కొట్టేవాడు నాన్న తరచు అమ్మను బెల్టుతో కొట్టేవాడని, కొన్నిసార్లు అమ్మ బయటకు సైతం రాకుండా తనతో ఇంట్లోనే ఉండిపోయేదని చిన్నారి మోక్షిత చెప్పిన మాటలు అక్కడున్న వారందరినీ కంటతడిపెట్టించాయి. కోమలి లాంటివారు ఆత్మహత్యకు పాల్పడితే... దానికి రెండు కారణాలు ఉండవచ్చు. తన సమస్యకు మరే పరిష్కారం లభించదని అనిపించినా లేదా దీర్ఘకాలికంగా తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైనా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించవచ్చు. అలాంటి చర్యకు పాల్పడే ముందు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందనే సానుకూల దృక్పథంతో ఉండాలి. తీవ్రమైన నెగెటివ్ ఆలోచనలు వస్తుంటే కేవలం సైకియాట్రిస్టునే సంప్రదించాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఎవరు ఉంటే వారి నుంచి మాటసాయం తీసుకోవచ్చు. - డాక్టర్ పద్మ పాల్వాయి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఒక వివాహిత తన పెళ్లయిన ఏడేళ్లలోపే అనుమాస్పద పరిస్థితుల్లో మృతి చెందితే అది వరకట్నపు మరణంగా పరిగణించాలని భారతీయ శిక్షాస్మృతిలోని 304 బి నిబంధన పేర్కొంటోంది. ఒకవేళ ఆమెది ఆత్మహత్యే అయినా దాన్ని కూడా అందుకు ఆమెను పురిగొల్పినట్లు పరిగణించాలని ఐపీసీ 306 నిబంధన స్పష్టం చేస్తోంది. భర్త నుంచి, అత్తింటివారి నుంచి వరకట్నపు వేధింపులు ఉంటే 498 ఏ కింద కేసు పెట్టవచ్చు. కోమలి విషయంలో ఏం జరిగినా అది వరకట్నపు హత్యే అని చట్టం స్పష్టం చేస్తోంది. ఆమె పరిస్థితిని ఎదుర్కోడానికి తగిన వేదికలు (ఫోరమ్స్) ఉన్నాయి. ధైర్యం చెప్పే హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మహిళలు చట్టం అందించే ఆసరాను తీసుకోవాలి. - ఇ. పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
ప్రేమ విఫలం : సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
ఒంగోలు : చిన్ననాటి నుంచి వెంకటేష్ ప్రసాద్, కోమలి ఇద్దరూ కలిసే చదువుకున్నారు... అదికాస్తా స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంతలో కోమలికి బెంగుళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత వెంకటేష్ ప్రసాద్ కి బెంగుళూరులోనే ఉద్యోగం వచ్చింది. ఇంకే పెళ్లి చేసుందామనుకుంటున్న తరుణంలో ఆ ప్రేమికుల మధ్య కట్నం అడ్డుగోడగా నిలిచింది. దీంతో మనస్తాపం చెందిన కోమలి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ... నా కుమారుడు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే భారీగా కట్నం ఇవ్వాలని ప్రేమికుడి వెంకటేష్ ప్రసాద్ తల్లిదండ్రులు... కోమలి తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఆ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో కోమలి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దసరా పండగ నేపథ్యంలో కోమలి స్వగ్రామం బొడ్డువానిపాలెం వచ్చి... ఇలా విగత జీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ప్రేమకు మరణం లేదు!
స్వచ్ఛమైన ప్రేమకు మరణం లేదనే కథాంశంతో సువర్ణ సమర్పణలో పవన్‌కుమార్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘కోమలి’. నూతన దర్శకుడు స్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా సవీన్ రాయ్, సాకేత్, కార్తీక్, సాయి క్రిష్ణ, కాజల్, సంజన, కవిత హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘స్వచ్ఛమైన ప్రేమ గెలవడం ఖాయమని చెప్పే చిత్రం ఇది. అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. నిజామాబాద్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కమలాకర్ రావు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడం విశేషం. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కబీర్ రఫీ, రచన: సురేష్ జై, ఎడిటింగ్: యాదగిరి. -
కోమలిలో బయటపడ్డ 16 నాటు బాంబులు
అనంతపురం : అనంతపురం జిల్లా తాడ్రిపత్రి మండలం కోమలి గ్రామంలో బుధవారం నాటుబాంబులు బయపడిన ఘటన కలకలం సృష్టించింది. జేసీబీతో ఓ స్థలాన్ని చదును చేస్తుండగా 16 నాటు బాంబులు బయటపడ్డాయి. అయితే అదృష్టవశాత్తు అవి పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.