
‘జయం’ రవి నటించిన కొత్త చిత్రం ‘కోమలి’. ఈ సినిమాలో కామెడీ కోసం వేసిన జోక్ కాంట్రవర్సీ అయింది. రజనీ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ‘కోమలి’ సినిమాలో 16 ఏళ్లు కోమాలో ఉండి బయటకు వస్తారు ‘జయం’ రవి. అయితే తాను కోమాలో ఉన్న విషయాన్ని అతను గ్రహించాడు. దాంతో 16 ఏళ్లు కోమాలో ఉన్నావని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అతన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలోనే పక్కనే ఉన్న టీవీలో న్యూస్ ప్లే అవుతుంటుంది. ‘త్వరలోనే రాజకీయాల్లో అడుగుపెడతాను’ అని రజనీకాంత్ ప్రసంగిస్తుంటారు. దాంతో తానింకా 2003లోనే ఉన్నాను అని హీరో అనుకుంటాడు. ఇది ఈ చిత్రం టీజర్‌లోని సీన్. ఏళ్ల తరబడి రాజకీయాల్లోకి వస్తానని రజనీ ఊరిస్తూ వస్తున్న విషయాన్ని చెప్పేలా ఈ సీన్ ఉందని ఆయన అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ సీన్ తీసేయాలని రజనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల చేశారు. దాంతో చిత్రబృందం కట్ చేస్తున్నట్టు ప్రకటించారు.