పైసాచికట్నం | special story to dowery | Sakshi
Sakshi News home page

పైసాచికట్నం

Published Thu, Feb 25 2016 11:05 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

పైసాచికట్నం - Sakshi

పైసాచికట్నం

కోమలి వృత్తాంతం తెలుసుకుంటే కన్నీరు ఉబుకుతుంది.
కోమలి పడిన కష్టాలను తలచుకుంటే గుండె కరుగుతుంది.
కోమలి మానసిక వేదనను ఆమె తండ్రి చెబుతుంటే గుండె అవిసిపోతుంది.
కోమలి కూతురు మోక్షిత మాటలు వింటుంటే మనసు నీరైపోతుంది.
వరకట్న ‘పైసా’చికత్వాలను తలచుకుంటే రక్తం సలసలా మరుగుతుంది.
శివబ్రహ్మం లాంటి భర్తలకు తగిన శాస్తి జరగాలనిపిస్తుంది.
అలా మరే ఆడకూతురికీ జరగకుండా మనం చూసుకున్నప్పుడే
మహిళలకు న్యాయం జరుగుతుంది. సమాజం బాగుపడుతుంది.

 
వరకట్న పిశాచం మరో అబలను బలి తీసుకుంది. అత్తింటివారి వేధింపులకు ఇంకో బతుకు అర్ధంతరంగా ముగిసింది. ముద్దులు మూటగట్టే పిల్లల కంటే కట్నపు కాసులే విలువైనవిగా అనిపించాయి ఆ మృగాడికి. నిక్షేపంలాంటి ఉద్యోగం ఉన్నా, అత్తింటివారి అదనపు కట్నకానుకలే ఆకర్షణీయంగా అనిపించింది ఆ కర్కోటకుడికి. అందుకే తన మాటలతో వేధించి, చేతలతో హింసించి... కట్టుకున్న భార్యను కాటికి పంపేశాడు. విజయవాడలో జరిగిన ఈ సంఘటన కరకు గుండెలను సైతం కంటతడిపెట్టిస్తుంది. తల్లి చనిపోయిందని తెలియక ఎప్పుడొస్తుందంటూ అమాయకంగా అడుగుతున్న ఆ చిన్నారులను చూస్తే ఎంతటి వారికైనా మనసు కరిగిపోతుంది. గుండె నీరైపోతుంది. తండ్రి సుబ్బారావు చెప్పిన వివరాల ప్రకారం కోమలి ఉదంతం ఇది.
 
బూదా కోమలి ఎప్పుడూ చలాకీగా ఉండేది. రైల్వే ఉద్యోగి శివబ్రహ్మంతో పెళ్లి జరిగింది. ఎన్నో కలలతో అత్తవారింట అడుగుపెట్టిందామె. విజయవాడలోని అయోధ్యానగర్‌లో వాళ్ల నివాసం. ఆర్థికంగా ఎలాంటి లోటూ లేని కుటుంబం. ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలనుకుందామె. ఆ సంతృప్తి ఎన్నాళ్లో లేదు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. భర్త నుంచి మాత్రమే కాదు, అత్తమామలు, ఆడపడుచులు మూకుమ్మడిగా ఆమెను కాల్చుకు తినేవారు. వారి చిత్రహింసలను తాళలేని కోమలి అర్ధంతరంగా తనువు చాలించింది. నాలుగేళ్ల కూతురిని, ఎనిమిది నెలల చిన్నారి కొడుకును దిక్కులేనివారిగా చేసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు అత్తింటి వారు. కానీ నాలుగేళ్ల కూతురి మాట వేరుగా ఉంది. రాత్రిపూట తన తండ్రి విపరీతంగా తల్లిని కొట్టాడని చెబుతోంది. ఆ దెబ్బలకు తాళలేకనే కోమలి చనిపోయిందంటున్నారు కోమలి బంధువులు. చనిపోయిన తర్వాత ఆమె మృతదేహానికి ఉచ్చువేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
 
అంత పిరికిది కాదు...
‘కోమలి ఎం.కాం. చదువుకుంది. లోకజ్ఞానం కలిగి ఉంది. ఆత్మహత్య చేసుకునేంత ఆత్మస్థైర్యం లేనిది కాదు’ అంటున్నారు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు. అసలు విషయం తెలియక ‘అమ్మ ఎప్పుడు వస్తుంది’ అంటూ అమాయకంగా అడిగే చిన్నారి కూతురిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, గుండె నీరైపోతోందంటూ రోదిస్తున్నారు ఇరుగుపొరుగు వాళ్లు. ఈ ఉదంతం గురించి తెలిసిన చుట్టుపక్కల వాళ్లూ కన్నీళ్లు పెడుతున్నారు. వచ్చే నెల మూడో తేదీన కోమలి చెల్లెలి పెళ్లి. ఇప్పుడీ సంఘటనతో అదీ ఆగిపోయింది. ‘‘అత్తింటి క్రూరత్వం అంతా ఇంతా కాదు. అమ్మాయి కోమలిని తన చెల్లెలి నిశ్చితార్థానికీ పంపలేదు. పప్పన్నం పెట్టే రోజున భోజనానికి కూడా వెళ్లనివ్వలేదు. శుభకార్యానికి రాలేననీ, తన భర్త పంపడం లేదని వర్తమానం పంపింది’’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు కోమలి తల్లిదండ్రులు. ‘‘పెళ్లయిన కొత్తలో బాగానే ఉండేవారు. మనవరాలు పుట్టిన దగ్గర్నుంచీ అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. కట్టుకున్నవాడే కాదు... అత్తమామలూ, ఆడబడుచులూ అదనపు కట్నం కోసం ఆమెను కాల్చుకుతిన్నారు. తన చివరి కుమార్తె పెళ్లి అనుకున్న దగ్గరి నుంచీ తనకు మరింత కట్నం కావాలంటూ అల్లుడు శివబ్రహ్మం కోరాడనీ, పెద్దమనుషుల ముందు మాట్లాడి మళ్లీ కాపురానికి పంపామనీ, అయినా కట్టుకున్నవాడు, ఆ అత్తింటి వాళ్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారనీ కుమిలిపోతున్నారు కోమలి తల్లిదండ్రులు.

 ‘‘వాళ్ల వేధింపులు తట్టుకోలేక నా కూతురు కొన్నాళ్లు మా దగ్గరే ఉంది. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు పంపేవాళ్లమే కాదు’’ అంటూ ఆవేదన చెందుతున్నారు. పెళ్లికైనా వస్తుందనుకున్న కూతురు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలిసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
 
ఇదీ నేపథ్యం...
 చిట్టినగర్‌కు చెందిన బరిగే సుబ్బారావు దంపతులకు నలుగురు కుమార్తెలు, వీరిలో మూడో కుమార్తె కోమలికి చీరాలకు చెందిన బూదా శివబ్రహ్మంతో వివాహం జరిగింది. వివాహ సమయంలో నాలుగు లక్షల నగదు, లక్ష రూపాయల బంగారు ఆభరణాలు, ఇంట్లోకి సామాను ఇచ్చారు. అయితే పెళ్ళయిన కొత్తలో బాగానే ఉన్నా, కూతురు మోక్షిత పుట్టిన దగ్గర్నుంచి కోమలికి ఎన్నో కష్టాలు... ఆడపిల్ల పుట్టిందంటూ ఛీత్కారాలు... ఆపై అదన పు కట్నం కోసం భర్త వేధింపులు... తన చెల్లికి పెళ్లి  కుదిరిందని వచ్చేనెల మూడోతేదీన వివాహం జరగనుందని తెలిసినా వెళ్లలేని నిస్సహాయత... అంతకు ముందు నిశ్చయతాంబూలాలకు రావాలంటూ శివబ్రహ్మాన్ని కోమలి తల్లితండ్రులు కోరినా వచ్చేది లేదని, భార్యను కూడా పంపేది లేదని భీష్మించాడు. అంతేకాదు... వారు ఉంటున్న ఇంటిని తనకు రాసి ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో వారు పరిస్థితులు అవే సర్దుకుంటాయిలే అనుకుంటూ వెళ్లిపోయారు. చిన్న కూతురి వివాహ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా, కోమలి ఇక లేదనే పిడుగులాంటి వార్త రావటంతో హతాశులయ్యారు.
 
అనునిత్యం అవమానాలు
పెళ్ళయిన నాటి నుంచి కోమలి భర్త శివబ్రహ్మం అత్తమామల పట్ల చిన్నచూపుతో ఉండేవాడు. వాళ్ళ పేరు చెప్పినా సహించే వాడు కాదు. అత్తమామల ఇంటికి సమీపంలోనే ఉన్నప్పటికీ వారి ఇంటికి వెళ్లడం గానీ, వారితో మాట్లాడటం కానీ చేస్తే కోమలిపై చేయి చేసుకునే వాడు. వారితో ఫోన్‌లోనైనా మాట్లాడనిచ్చేవాడు కాదు. వారిని కనీసం పిల్లల అన్నప్రాశనకు కూడా పిలవలేదు. తమను కించపరచినా ఫర్వాలేదని, తమ కూతురు బాగుంటే చాలని అన్నీ భరించామని ఫొటోలలో తాము ఉన్న చోట వేస్ట్ అని రాసేవాడని, తమ ఫొటోలను కత్తిరించి డస్ట్‌బిన్‌లో పడేసేవాడని కోమలి తల్లిదండ్రులు వాపోయారు. కోమలికి కూతురు పుట్టిన తరువాత రోడ్డుమీదే కొట్టుకుంటూ తమ ఇంటికి తీసుకువచ్చి వదిలేశాడని గుర్తు చేసుకుని బోరుమన్నారు. అత్తమామలని తమకు కనీస మర్యాద ఇవ్వక పోగా ఒసేయ్ అరేయ్ అంటూ  కించపరచేవాడని వాపోయారు. కనీసం చుట్టుప్రక్కలవారితో మాట్లాడినా కోమలిని కొట్టేవాడని చెప్పారు.
 
పథకం ప్రకారమే హత్య...
తన కూతురిని వదిలించుకుంటే రెండో పెళ్ళి చేసుకోవచ్చనే దురుద్దేశంతోనే అల్లుడు శివబ్రహ్మం తన కూతురుని పథకం ప్రకారం హత్య చేశాడని కోమలి తండ్రి సుబ్బారావు ఆరోపించారు. తాను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇరవై లక్షలు కట్నం వస్తుందని తన కూతురి వద్ద అల్లుడు శివబ్రహ్మం తరచు అనేవాడని, అతడి తల్లితండ్రులు కూడా అతడికి వంత పాడేవారని ఆరోపించారు. తన కూతురు చేతికి ఉండాల్సిన ఉంగరాలు, బీరువా తాళాలు తదితర సామాగ్రిని పర్సులో పెట్టి మంచం కింద పెట్టటం అనుమానాలకు తావిచ్చేలా ఉందంటున్నారు కోమలి తల్లిదండ్రులు. తన కూతురికి జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకుండా శివబ్రహ్మాన్ని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
 - జి.పి. వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి, విజయవాడ
 
నాన్న అమ్మను బెల్టుతో కొట్టేవాడు
 నాన్న తరచు అమ్మను బెల్టుతో కొట్టేవాడని, కొన్నిసార్లు అమ్మ బయటకు సైతం రాకుండా తనతో ఇంట్లోనే ఉండిపోయేదని చిన్నారి మోక్షిత చెప్పిన మాటలు అక్కడున్న వారందరినీ కంటతడిపెట్టించాయి.  
 
 కోమలి లాంటివారు ఆత్మహత్యకు పాల్పడితే... దానికి రెండు కారణాలు ఉండవచ్చు. తన సమస్యకు మరే పరిష్కారం లభించదని అనిపించినా లేదా దీర్ఘకాలికంగా తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైనా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించవచ్చు. అలాంటి చర్యకు పాల్పడే ముందు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందనే సానుకూల దృక్పథంతో ఉండాలి. తీవ్రమైన నెగెటివ్ ఆలోచనలు వస్తుంటే కేవలం సైకియాట్రిస్టునే సంప్రదించాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఎవరు ఉంటే వారి నుంచి మాటసాయం తీసుకోవచ్చు.
 - డాక్టర్ పద్మ పాల్వాయి,
 కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
 
 ఒక వివాహిత తన పెళ్లయిన ఏడేళ్లలోపే అనుమాస్పద పరిస్థితుల్లో మృతి చెందితే అది వరకట్నపు మరణంగా పరిగణించాలని భారతీయ శిక్షాస్మృతిలోని 304 బి నిబంధన పేర్కొంటోంది. ఒకవేళ ఆమెది ఆత్మహత్యే అయినా దాన్ని కూడా అందుకు ఆమెను పురిగొల్పినట్లు పరిగణించాలని ఐపీసీ 306 నిబంధన స్పష్టం చేస్తోంది. భర్త నుంచి, అత్తింటివారి నుంచి వరకట్నపు వేధింపులు ఉంటే 498 ఏ కింద కేసు పెట్టవచ్చు. కోమలి విషయంలో ఏం జరిగినా అది వరకట్నపు హత్యే అని చట్టం స్పష్టం చేస్తోంది. ఆమె పరిస్థితిని ఎదుర్కోడానికి తగిన వేదికలు (ఫోరమ్స్) ఉన్నాయి. ధైర్యం చెప్పే హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మహిళలు చట్టం అందించే ఆసరాను తీసుకోవాలి.
 - ఇ. పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement