పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు.. | Utraan Movie Audio Launch in Tamil nadu | Sakshi
Sakshi News home page

పేరు కోసమైనా సక్సెస్‌ కావాలి

Sep 25 2019 7:50 AM | Updated on Sep 25 2019 7:50 AM

Utraan Movie Audio Launch in Tamil nadu - Sakshi

అయితే సినిమాల్లోకి వచ్చిన వారు పనికి రాకుండా పోకూడదన్నారు.

సినిమా: ఉట్రాన్‌ అన్న పేరు కోసమైనా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ పేర్కొన్నారు. సాయి సినిమాస్‌ పతాకంపై ఓ.రాజా గజనీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఉట్రాన్‌. నవ జంట రోషన్, హీరోషిణి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. రోషన్‌ తమిళనాడు పత్రికల సంఘం అధ్యక్షుడు సుభాష్‌ కొడుకన్నది గమనార్హం. ఇకపోతే నటి హిరోషిణి పదహారణాల తెలుగమ్మాయి. అంతే కాదు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్‌. కోమలి సిస్టర్స్‌ అంటే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో తెలియని వారుండరన్నది అతిశయోక్తి కాదు. ఆ సిస్టర్స్‌ యూట్యూబ్‌ కార్యక్రమాలతో అంత పాచుర్యం పొందారు. వారిలో పెద్ద సహోదరినే హిరోషిని కోమలి. ఈ చిన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో ఉట్రాన్‌ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి భిన్నంగా హైదరాబాద్‌కు చెందిన  హిరోషిణి రచ్చ గెలిచి ఇంట గెలవడానికి రెడీ అయ్యింది. కాగా రఘునందన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ మాట్లాడుతూ ఇది తన కుటుంబ వేడుకగా పేర్కొన్నారు.

తన జీవితం కమ్యూనిస్ట్‌ పార్టీ నుంచే మొదలైందన్నారు. తన ప్రియ సహోదరుడి మనుమడు రోషన్‌ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడన్నారు. ఇతనికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉదయకుమార్‌ అని చెప్పారు. ఈ చిత్ర టైటిల్‌ తనకు చాలా నచ్చిందన్నారు. ఉట్రాన్‌ అన్న పేరుకే ఈ చిత్ర యూనిట్‌ వేడుకను చేసుకోవాలన్నారు. చిత్రంలో నటుడు రోషన్‌ చాలా ఈజ్‌గా నటించినట్లు ప్రశంసించారు. దర్శకుడు దీన్ని పలు సమస్యలు, ద్రోహాలను ఎదురొడ్డి రూపొందించారని చెప్పారు. మరో అతిథి దర్శకుడు పేరరసు మాట్లాడుతూ పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చునని, అయితే సినిమాల్లోకి వచ్చిన వారు పనికి రాకుండా పోకూడదన్నారు. నటుడు రోషన్‌ను చూస్తుంటే అల్లుఅర్జున్‌ మాదిరి ఉన్నాడని అన్నారు. ఉట్రాన్‌ అంటే దగ్గర బందువు అని అర్ధం అని చెప్పారు. అనంతరం చిత్ర దర్శక నిర్మాత రాజా గజని మాట్లాడుతూ 18 చిత్రాలకు పని చేశానని, అలాంటిది తన కోసం ఏ నిర్మాత ముందుకు రాలేదని అన్నారు. అందుకే తానే నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో ఉట్రాన్‌ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రేక్షకులకు రుచించే అన్ని అంశాలు ఉట్రాన్‌ చిత్రంలో ఉంటాయని రాజాగజని తెలిపారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి, నిర్మాత కలైపులి ఎస్‌.థాను, కే.భాగ్యరాజ్, కే.రాజన్, నటుడు ఆరి పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement