Ananda Rao
-
సీఐ ఆత్మహత్య.. జేసీ శవరాజకీయం.. ముందునుంచీ పోలీసులంటే చిన్నచూపే
అనంతపురం: ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్లోను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉనికి కోల్పోయారు. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు, తాడిపత్రిలో పైచేయి సాధించాలనే కుట్రపూరిత ఆలోచనతో సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయాస్త్రంగా వాడుకుంటున్నారు. ఈయన చవకబారు, శవరాజకీయాలపై ప్రజలు చీదరించుకుంటున్నారు. కుటుంబ కలహాలతో అర్బన్ సీఐ ఆనందరావు మూడు రోజుల క్రితం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఎస్పీ శ్రీనివాసరావే తాడిపత్రికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. సీఐ ఆత్మహత్యకు రాజకీయ, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు కారణం కాదని, కుటుంబ సమస్యల వల్లే ప్రాణం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు గురించి మీడియాకు వెల్లడించారు. అయితే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం సీఐ ఆత్మహత్యకు రాజకీయ రంగు పులిమి, హంగామా చేయడం విస్మయం కలిగిస్తోంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయులు ఘర్షణ పడిన సమయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారన్న చిన్నచూపుతో సీఐ ఆనందరావును దుర్భాషలాడారు. ‘వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై తన వర్గీయులు దాడులు చేస్తారు చూస్తావా.. అడ్డుకోవడం నీవల్ల అవుతుందా’ అంటూ హేళన చేస్తూ బెదిరించారు. ఈ విషయమై సీఐ అప్పట్లోనే స్థానిక డీఎస్పీతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులంటే జేసీ బ్రదర్స్‌కు ఎప్పుడూ చిన్నచూపే.. జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడు మాట వినని పోలీసులను దుర్భాషలాడడమే కాకుండా, వారి వాహనాలను దహనం చేయడంతో పాటు ఏకంగా పోలీస్ స్టేషన్‌కే తాళాలు వేయించారు. అలాంటి జేసీ సోదరులు ఇప్పుడు పోలీసులంటే ఎనలేని గౌరవం ఉన్నట్లు మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాజకీయ ప్రయోజ నాల కోసం సీఐ ఆత్మహత్యను వాడుకుంటున్నారు. సీఐ చావుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిళ్లు కారణమంటూ ఆరోపణలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో అలజడులు రేపేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు.. తాడిపత్రి పట్టణంలోని ఆంజనేయస్వామి మాన్యంలో నివసిస్తున్న పేదలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రజలకు మేలు చేయడం గిట్టని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుయాయులచే హైకోర్టులో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడ్డారు. ► అంబేడ్కర్ నగర్‌లోని మున్సిపల్ స్థలంలో ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మించడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేక తన అనుచరుడైన టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటిషన్ వేయించి పనులు అడ్డుకున్నారు. ► తాడిపత్రిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ఒప్పించారు. ఎస్పీ కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే తన సొంత డబ్బుతో స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జీర్ణించుకోలేక టీడీపీ కౌన్సిలర్‌తో జేసీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయించి స్టే తెప్పించారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. మున్సిపల్ అధికారులపైనా కక్ష సాధింపు.. ► మున్సిపల్ అధికారులు, సిబ్బందిని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపులకు దిగారు. ప్రొటోకాల్ పేరుతో దూషణలు, బెదిరింపులతో భయకంపితులను చేస్తున్నారు. ►మున్సిపాలిటీలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలని హుకుం జారీ చేస్తున్నారు. ► మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరెడ్డి అహంకారపూరిత ధోరణితో కమిషనర్ మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు వృత్తిపరంగా అనేక రకాలుగా తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రి పట్టణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నారు. శాంతిభద్రతల విషయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మూడు దశాబ్దాల తమ ఏక ఛత్రాధిపత్యానికి చెక్ పడటం జేసీ ప్రభాకర్‌రెడ్డికి మింగుడు పడలేదు. ఎలాగైనా తమ ప్రాభవం తిరిగి సంపాదించుకునేందుకు ఏదో ఒక అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. ► ఇప్పుడు ఏకంగా ఓ సీఐ ఆత్మహత్యను అస్త్రంగా తెరపైకి తీసుకువచ్చి, అందుకు రాజకీయ రంగును పులుముతూ, పబ్బం గడుపుకోవాలని చూస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన తెలిపేందుకు చిహ్నంగా వాడే నల్లదుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి సీఐ ఆనందరావుకు నివాళులర్పించడం పట్ల కొన్ని దళిత సంఘాలతో పాటు తాడిపత్రి ప్రజలు తప్పుపడుతున్నారు. మరణించిన వ్యక్తి చిత్రపటానికి పూలు చల్లడం, పూల మాల వేయడం, లేదా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం, వాటితో మానవహారం నిర్వహించడం వంటి చర్యలతో మృతి చెందిన వ్యక్తికి శ్రద్ధాంజలి, నివాళులర్పిస్తారు. అయితే సీఐ ఆనందరావు దళితుడైనందునే జేసీ ప్రభాకర్‌రెడ్డి నల్ల దుస్తులు ధరించి అగౌరవపరిచారని దళితులు కొందరు జేసీ తీరును తప్పుబట్టారు.జే అనుచరుల కోసం చాంబర్.. మున్సిపల్ చైర్మన్ హోదాను అడ్డుపెట్టుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ మున్సిపాలిటీలో లేని విధంగా రెండు చాంబర్లను ఆక్రమించుకున్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన చాంబర్ల తాళాలను కూడా తనవద్దే ఉంచుకుంటున్నారు. బయటి వ్యక్తులు, అనుచరులు చైర్మన్ చాంబర్లలోకి వచ్చి వెళుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచరులు కొందరు కార్యాలయంలోనే తిష్ట వేసి కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. జేసీ విపరీత పోకడలను తాళలేని సిబ్బంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. -
మంచి అధికారిని కోల్పోయాం
తాడిపత్రి/చంద్రగిరి : తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు (51) కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన సోమవారం తెల్లవారుజామున తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకున్నారు. పోలీసు శాఖలో మంచి అధికారిగా పేరున్న ఆయన ఇలా తనువు చాలించడాన్ని పోలీసులు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పనిచేసిన ప్రతిచోట సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌమ్యుడిగాను, సేవభావం కల్గిన అధికారిగానూ పేరొందారు. 1998 బ్యాచ్ అధికారి ఆనందరావు స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కల్‌రోడ్‌పల్లి. భార్య అనురాధ, కుమార్తెలు కావ్య (బీటెక్), భవ్య (ఇంటర్) ఉన్నారు. ఆయన 1998 సంవత్సరంలో పోలీసు శాఖలో ఎస్ఐగా విధుల్లో చేరారు. హిందూపుం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఈయన ఎస్ఐగా బ్యాచ్‌మేట్. ఎస్ఐగా, ఆ తర్వాత పదోన్నతిపై సీఐగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. ప్రతిచోట మంచి పేరు తెచ్చుకున్నారు. పోలీసు విధులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ శభాష్ అనిపించుకున్నారు. తాడిపత్రి పట్టణ సీఐగా గత ఏడాది సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయ సిఫారసులకు దూరంగా ప్రజలకు సేవలందించి మన్ననలు పొందారు. తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో నమోదైన పలు కేసులకు సంబంధించి లోక్ అదాలత్‌లో రాజీమార్గంలో పరిష్కారం చూపినందుకు గాను కొన్ని నెలల క్రితం జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. అంతకు ముందు కరోనా విపత్తు సమయంలో రైల్వే కోడూరులో విధులు నిర్వర్తించినప్పుడు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. యాచకులకు, కూలీలకు అండగా నిలిచారు. విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు అందించారు. కల్రోడ్డుపల్లిలో విషాదం సీఐ ఆనందరావు ఆత్మహత్యతో ఆయన స్వగ్రామం కల్రోడ్పల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోమవారం సాయంత్రం ఆనందరావు భౌతికకాయం కల్రోడ్పల్లికి చేరుకుంది. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. వారం క్రితమే గ్రామానికి వచ్చి వెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి అండగా ఉంటూ, కష్టాలలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేసేవారని వారు వెల్లడించారు. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని చిన్నాన్న గంగాధరం కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో కళ్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, తిరుమలలో ఏవీఎస్వోగా పనిచేశారని గుర్తు చేశారు. ఆనందరావు మృతి పట్ల చంద్రగిరి పీటీసీలో నివాళులర్పించారు. పలువురి నివాళి సీఐ ఆనందరావు మృతదేహానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో పాటు అదనపు ఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, డీఎస్పీ గంగయ్య, సీఐలు చిన్న పెద్దయ్య, శంకర్‌రెడ్డి, ఎస్ఐలు ధరణీబాబు, మహమ్మద్ గౌస్, గురుప్రసాద్, ఖాజా హుస్సేన్, శ్రీనివాసులు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి రమేష్‌రెడ్డి నివాళులర్పించారు. తాడిపత్రి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న సీఐ ఆనందరావు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని డీఎస్పీ గంగయ్య కొనియాడారు. -
తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లాక తలుపులు బిగించుకొని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.. సీఐ భార్యా, ఇద్దరు కూతుళ్ల నుంచి వివరాలు సేకరించిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించారు. తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి కుటుంబ కలహాలే కారణమని పేర్కొన్నారు. కొంత కాలం గా భార్యా భర్తల మధ్య విబేధాలు ఉన్నాయని.. నిన్న రాత్రి కూడా సీఐ ఆనందరావు దంపతుల మధ్య గొడవ జరిగిందని.. ఈ మనస్తాపం తోనే సీఐ ఆనందరావు బలవన్మరణానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. ఎమ్మెల్యే పరామర్శ తాడిపత్రి సీఐ ఆనందరావు మృతి పట్ల ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీఐ కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఆనందరావు మృతదేహానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నివాళులు అర్పించారు. సీఐ ఆనందరావు మృతదేహం వద్ద ఎస్పీ శ్రీనివాసరావు పోలీసు లాంఛనాలతో నివాళులు అర్పించారు. (చదవండి: పిడుగు పడి 11 మందికి గాయాలు)