అనంతపురం: ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్‌లోను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉనికి కోల్పోయారు. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు, తాడిపత్రిలో పైచేయి సాధించాలనే కుట్రపూరిత ఆలోచనతో సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయాస్త్రంగా వాడుకుంటున్నారు. ఈయన చవకబారు, శవరాజకీయాలపై ప్రజలు చీదరించుకుంటున్నారు. కుటుంబ కలహాలతో అర్బన్ సీఐ ఆనందరావు మూడు రోజుల క్రితం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఎస్పీ శ్రీనివాసరావే తాడిపత్రికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు.
సీఐ ఆత్మహత్యకు రాజకీయ, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు కారణం కాదని, కుటుంబ సమస్యల వల్లే ప్రాణం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు గురించి మీడియాకు వెల్లడించారు. అయితే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం సీఐ ఆత్మహత్యకు రాజకీయ రంగు పులిమి, హంగామా చేయడం విస్మయం కలిగిస్తోంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయులు ఘర్షణ పడిన సమయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారన్న చిన్నచూపుతో సీఐ ఆనందరావును దుర్భాషలాడారు. ‘వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై తన వర్గీయులు దాడులు చేస్తారు చూస్తావా.. అడ్డుకోవడం నీవల్ల అవుతుందా’ అంటూ హేళన చేస్తూ బెదిరించారు. ఈ విషయమై సీఐ అప్పట్లోనే స్థానిక డీఎస్పీతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
పోలీసులంటే జేసీ బ్రదర్స్‌కు ఎప్పుడూ చిన్నచూపే..
జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడు మాట వినని పోలీసులను దుర్భాషలాడడమే కాకుండా, వారి వాహనాలను దహనం చేయడంతో పాటు ఏకంగా పోలీస్ స్టేషన్‌కే తాళాలు వేయించారు. అలాంటి జేసీ సోదరులు ఇప్పుడు పోలీసులంటే ఎనలేని గౌరవం ఉన్నట్లు మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాజకీయ ప్రయోజ నాల కోసం సీఐ ఆత్మహత్యను వాడుకుంటున్నారు. సీఐ చావుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిళ్లు కారణమంటూ ఆరోపణలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో అలజడులు రేపేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు..
తాడిపత్రి పట్టణంలోని ఆంజనేయస్వామి మాన్యంలో నివసిస్తున్న పేదలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రజలకు మేలు చేయడం గిట్టని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుయాయులచే హైకోర్టులో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడ్డారు.
► అంబేడ్కర్ నగర్‌లోని మున్సిపల్ స్థలంలో ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మించడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేక తన అనుచరుడైన టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటిషన్ వేయించి పనులు అడ్డుకున్నారు.
► తాడిపత్రిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ఒప్పించారు. ఎస్పీ కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే తన సొంత డబ్బుతో స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జీర్ణించుకోలేక టీడీపీ కౌన్సిలర్‌తో జేసీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయించి స్టే తెప్పించారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి.
మున్సిపల్ అధికారులపైనా కక్ష సాధింపు..
► మున్సిపల్ అధికారులు, సిబ్బందిని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపులకు దిగారు. ప్రొటోకాల్ పేరుతో దూషణలు, బెదిరింపులతో భయకంపితులను చేస్తున్నారు.
►మున్సిపాలిటీలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలని హుకుం జారీ చేస్తున్నారు.
► మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరెడ్డి అహంకారపూరిత ధోరణితో కమిషనర్ మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు వృత్తిపరంగా అనేక రకాలుగా తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు.
ప్రశాంతతకు భంగం కలిగించేందుకే..
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రి పట్టణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నారు. శాంతిభద్రతల విషయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మూడు దశాబ్దాల తమ ఏక ఛత్రాధిపత్యానికి చెక్ పడటం జేసీ ప్రభాకర్‌రెడ్డికి మింగుడు పడలేదు. ఎలాగైనా తమ ప్రాభవం తిరిగి సంపాదించుకునేందుకు ఏదో ఒక అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు.
► ఇప్పుడు ఏకంగా ఓ సీఐ ఆత్మహత్యను అస్త్రంగా తెరపైకి తీసుకువచ్చి, అందుకు రాజకీయ రంగును పులుముతూ, పబ్బం గడుపుకోవాలని చూస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన తెలిపేందుకు చిహ్నంగా వాడే నల్లదుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి సీఐ ఆనందరావుకు నివాళులర్పించడం పట్ల కొన్ని దళిత సంఘాలతో పాటు తాడిపత్రి ప్రజలు తప్పుపడుతున్నారు. మరణించిన వ్యక్తి చిత్రపటానికి పూలు చల్లడం, పూల మాల వేయడం, లేదా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం, వాటితో మానవహారం నిర్వహించడం వంటి చర్యలతో మృతి చెందిన వ్యక్తికి శ్రద్ధాంజలి, నివాళులర్పిస్తారు. అయితే సీఐ ఆనందరావు దళితుడైనందునే జేసీ ప్రభాకర్‌రెడ్డి నల్ల దుస్తులు ధరించి అగౌరవపరిచారని దళితులు కొందరు జేసీ తీరును తప్పుబట్టారు.జే
అనుచరుల కోసం చాంబర్..
మున్సిపల్ చైర్మన్ హోదాను అడ్డుపెట్టుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ మున్సిపాలిటీలో లేని విధంగా రెండు చాంబర్లను ఆక్రమించుకున్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన చాంబర్ల తాళాలను కూడా తనవద్దే ఉంచుకుంటున్నారు. బయటి వ్యక్తులు, అనుచరులు చైర్మన్ చాంబర్లలోకి వచ్చి వెళుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచరులు కొందరు కార్యాలయంలోనే తిష్ట వేసి కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. జేసీ విపరీత పోకడలను తాళలేని సిబ్బంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment