
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ నాయకులు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. అలాగే, కక్ష సాధింపు చర్యలను మానుకుని హామీలను అమలు చేయాలని కూటమి నేతలకు హితవు పలికారు.
అనంతరంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రబాబు పాలనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సాకే శైలజానాథ్ మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు?. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. టీడీపీ కూటమి.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ చంద్రబాబు జారుకునే యత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు తగదు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కొనసాగిస్తుంది. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. ప్రజల గొంతుకను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు మానుకుని ఇచ్చిన హామీలను అమలు చేయండి అని హితవు పలికారు.
వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ విద్యా మాజీ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. హామీల అమలులో చంద్రబాబు, పవన్‌కు చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. టీడీపీ కూటమి అరాచకాలపై నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటాం అని తెలిపారు.
