తాడిపత్రి మున్సిపాలిటీ సమస్యలు పట్టని చైర్మన్
6 నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా అడ్డంకులు
‘బస్సు యాత్ర’ పేరుతో గాలి తిరుగుళ్లు
ప్రజల చెవిలో పూలు పెట్టే యత్నాలు
తాడిపత్రి, రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి నవరసాలు పండించారు. అవకాశం ఇస్తే అలా చేస్తా, ఇలా చేస్తా అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. బొటాబొటి ఆధిక్యతతో ఎలాగోలా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మాత్రం గాలికొదిలేశారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతూ ఉంటే, ఎక్కడ అధికార పార్టీకి పేరు వస్తుందనే అక్కసుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై చర్చించడానికి, పరిష్కార మార్గం చూపడానికి వేదికై న కౌన్సిల్ సమావేశాన్ని కూడా 6 నెలలుగా నిర్వహించకుండా అడ్డు పడుతున్నారు. కమిషనర్ సహకరించడం లేదంటూ ప్రజల చెవిలో పూలు పెట్టే యత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి.. తాను మాత్రం గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఒక్క మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి చేతకాని ఆయన.. నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తానంటూ కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మాటున పల్లెల్లో కక్షలు రాజేస్తున్నారు.
రచ్చ చేయడమే పని..
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డు తగులుతున్నారు. ‘నేను చేయను.. మీరు చేయొద్దు..’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగిన సమయంలో పట్టణంలో పేరుకుపోయిన చెత్తను ఎమ్మెల్యే తన సొంత నిధులతో తొలగించే ప్రయత్నం చేస్తే అడ్డుకుని నానా యాగీ చేశారు. వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా బోర్ల మరమ్మతులు చేయిస్తుంటే టీడీపీ శ్రేణులతో కలిసి అడ్డుకుని రచ్చ చేశారు. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యే ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అడ్డు తగలడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదంటూ మళ్లీ తనే ఎల్లో మీడియాతో కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు.
ఆది నుంచి అంతే..
చైర్మన్‌గా ఎన్నికై నప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. గత టీడీపీ హయాంలో చేసిన అరాచకాన్ని కొనసాగించారు. మున్సిపాలిటీ ప్రతిష్టను బజారు కీడ్చారు. కొన్నాళ్ల పాటు చైర్మన్ చాంబర్ కోసం కౌన్సిలర్లతో కలిసి నానా రభస చేశారు. తనకు కేటాయించిన చాంబర్ కాదని కమిషనర్ కార్యాలయాన్ని కేటాయించాలని పట్టుబట్టారు. కొన్ని రోజుల పాటు కమిషనర్ చాంబర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు చాంబర్ కేటాయించే విషయంపైనా రచ్చ చేశారు. తన మాట వినడం లేదంటూ గతంలో ఉద్యోగులపై రెచ్చిపోయారు.
దీంతో కొందరు ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడానికి ప్రయత్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాక ఏ కమిషనర్ కూడా ఎక్కువ రోజులు పనిచేయలేదు. అసలు మున్సిపాలిటీ అభివృద్ధినే ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు. కౌన్సిల్ మీట్ జరుగుతున్న సమయంలో తాను చాంబర్‌లోనే ఉన్నా, వైస్ చైర్మన్లతో సమావేశాలను జరిపించారంటేనే ఆయనకు ప్రజలపై ఏ మాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలను జేసీ సోదరులు పిచ్చోళ్లనుకుంటున్నారు
మున్సిపాలిటీ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్‌రెడ్డి అనర్హుడు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. అలాంటి వ్యక్తి బస్సుయాత్రల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తుండడం హాస్యాస్పదం. నమ్మి ఓట్లేసిని ప్రజలను జేసీ సోదరులు పిచ్చివారు అనుకుంటున్నారు. ఇలాంటి వారికి జనమే గుణపాఠం చెప్పాలి. – పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment