తాడిపత్రి/చంద్రగిరి : తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు (51) కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన సోమవారం తెల్లవారుజామున తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకున్నారు. పోలీసు శాఖలో మంచి అధికారిగా పేరున్న ఆయన ఇలా తనువు చాలించడాన్ని పోలీసులు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పనిచేసిన ప్రతిచోట సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌమ్యుడిగాను, సేవభావం కల్గిన అధికారిగానూ పేరొందారు.
1998 బ్యాచ్ అధికారి
ఆనందరావు స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కల్‌రోడ్‌పల్లి. భార్య అనురాధ, కుమార్తెలు కావ్య (బీటెక్), భవ్య (ఇంటర్) ఉన్నారు. ఆయన 1998 సంవత్సరంలో పోలీసు శాఖలో ఎస్‌ఐగా విధుల్లో చేరారు. హిందూపుం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఈయన ఎస్‌ఐగా బ్యాచ్‌మేట్. ఎస్‌ఐగా, ఆ తర్వాత పదోన్నతిపై సీఐగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. ప్రతిచోట మంచి పేరు తెచ్చుకున్నారు. పోలీసు విధులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ శభాష్ అనిపించుకున్నారు. తాడిపత్రి పట్టణ సీఐగా గత ఏడాది సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టారు.
కుల మతాలకు అతీతంగా, రాజకీయ సిఫారసులకు దూరంగా ప్రజలకు సేవలందించి మన్ననలు పొందారు. తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్‌లో నమోదైన పలు కేసులకు సంబంధించి లోక్ అదాలత్‌లో రాజీమార్గంలో పరిష్కారం చూపినందుకు గాను కొన్ని నెలల క్రితం జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. అంతకు ముందు కరోనా విపత్తు సమయంలో రైల్వే కోడూరులో విధులు నిర్వర్తించినప్పుడు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. యాచకులకు, కూలీలకు అండగా నిలిచారు. విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు అందించారు.
కల్‌రోడ్డుపల్లిలో విషాదం
సీఐ ఆనందరావు ఆత్మహత్యతో ఆయన స్వగ్రామం కల్‌రోడ్‌పల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోమవారం సాయంత్రం ఆనందరావు భౌతికకాయం కల్‌రోడ్‌పల్లికి చేరుకుంది. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. వారం క్రితమే గ్రామానికి వచ్చి వెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి అండగా ఉంటూ, కష్టాలలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేసేవారని వారు వెల్లడించారు. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని చిన్నాన్న గంగాధరం కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో కళ్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, తిరుమలలో ఏవీఎస్‌వోగా పనిచేశారని గుర్తు చేశారు. ఆనందరావు మృతి పట్ల చంద్రగిరి పీటీసీలో నివాళులర్పించారు.
పలువురి నివాళి
సీఐ ఆనందరావు మృతదేహానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో పాటు అదనపు ఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, డీఎస్పీ గంగయ్య, సీఐలు చిన్న పెద్దయ్య, శంకర్‌రెడ్డి, ఎస్‌ఐలు ధరణీబాబు, మహమ్మద్ గౌస్, గురుప్రసాద్, ఖాజా హుస్సేన్, శ్రీనివాసులు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్, వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి రమేష్‌రెడ్డి నివాళులర్పించారు. తాడిపత్రి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న సీఐ ఆనందరావు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని డీఎస్పీ గంగయ్య కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment