దువ్వలో ఎంపీపీ ఘెరావ్
తణుకు రూరల్ : రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయూలని కోరు తూ తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన మహిళలు ఎంపీపీ కట్టా అనంతలక్ష్మి ఇంటిని శుక్రవారం చుట్టుముట్టారు. ఆమెను ఘెరావ్ చేశారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి అందలమెక్కిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి రూ.లక్ష మాత్రమే మాఫీ చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఎంపీపీని నిలదీశారు.
తెలుగుదేశం పార్టీ తీరు రేవు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వచ్చి రుణాల వివరాలు నమోదు చేసుకున్నారని, అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు, వ్యవసాయ రుణాలు, బంగారంపై తీసుకున్న రుణాలన్నిటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఆ సందర్భంలో తమ బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకుని ఇప్పుడు ఏమీ చెప్పడం లేదని వాపోయారు. ఎంపీపీ కట్టా అనంతలక్ష్మి మాట్లాడుతూ ఇది స్థానికంగా పరిష్కరించే సమస్య కాదన్నారు. ఈ విషయూన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతరం టీడీపీ నాయకుడు గిద్దా ధనరాజును కలిసిన మహిళలు రుణమాఫీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరారు.