ఇంకా నేర్చుకుంటున్నా...
సీనియర్ల సలహాలు తీసుకుంటున్నా
నటి, యాంకర్ గాయత్రి భార్గవి
బొబ్బిలి: తాను ఇంకా నటన నేర్చుకుంటున్నానని, షూటింగ్ ప్రదేశంలో ప్రతి ఒక్క ఆర్టిస్టును గమనించి మెలకువలు తెలుసుకుంటున్నానని నటి, టీవీ యాంకర్ గాయత్రి భార్గవి అన్నారు. బొబ్బిలిలో ముళ్లపూడి వర ద ర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను 18వ ఏట నుంచి ఈ రంగంలోనే ఉన్నానని తెలిపారు. చదువుతుండగా అవకాశాలు రావడంతో ఇటువైపు దృష్టి పెట్టానని, అయినా చదువు పూర్తి చేశానని చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన తోక్కుడు బిళ్లాట యాడ్ ఫిల్మ్‌లో నటించానన్నారు. ఆ సమయంలో ముళ్లపూడి వర ఆ యాడ్‌కు సారథ్యం వహించారని తెలిపారు.
మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. బీకాం చదువుతుండగానే అవకాశాలు వచ్చాయని, జెమినీలో డ్రీం గర్ల్ బ్యూటీషియన్ కాంటెస్టుతో ముందుగా టీవీ రంగంలోనికి అడుగుపెట్టానని తెలిపారు. ఆ తరువాత ఆట కావాలా.. పాట కావాలా.., అదిరింది వంటి షోలు చేసి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నట్లు తెలిపారు. ఇటీవల సాక్షి టీవీ ‘ఫ్యామిలీ షో’కు మంచి స్పందన వచ్చిం దని చెప్పారు.
దాదాపు ఆరు మాసాల పాటు కుటుంబాల్లో వ్యక్తులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భార్యభర్తల కల హాలు వంటి వాటిని పూర్తిస్థాయిలో తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కార మార్గం కూడా చూపించగలగడం సంతృప్తికరంగా ఉందని అన్నారు. సినీ ఇండస్ట్రీలో అగ్రనటులను ఇంటర్వ్యూ చేస్తుండడంతో పాటు స్టేజీ షోలు కూడా చేస్తున్నానని తెలిపారు. తాను మొదట సురేష్ ప్రొడక్షన్సలో వచ్చిన రవితేజ బలాదూర్ సినిమాలో నటించానని, తర్వాత గాలిపటం, అవును, బ్రహ్మిగాడి కథ, ఒక లైలా కోసం, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో నటించానని చెప్పారు.
అబ్బో చాలా తేడా ఉంది
యాంకరింగుకు, యాక్టింగుకు చాలా తేడా ఉందని ఆమె అన్నారు. సమయస్ఫూర్తితో ఎవరినీ నొప్పించకుండా అప్పటికప్పుడు తెలివితేటలను ఉపయోగించి యాంకరింగు చేయాలని తెలిపారు. యాంకరింగ్‌లో కొంచెం కూడా ఏమరపాటు అనేదే ఉండకూడదని అన్నారు. సినిమాల్లో మాత్రం అంతా దర్శకుడి చేతుల్లో ఉంటుందని చెప్పారు. తన భర్త ఆర్మీలో పనిచేస్తున్నారని, తనకు ఏడేళ్ల కొడుకున్నాడని, కుటుంబ జీవనానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకవైపు చూసుకుంటూ మరో వైపు సినిమా, టీవీ రంగాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. సీనియర్లు ఝాన్సీ, సుమల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తీసుకుంటున్నానని చెప్పారు. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ వృత్తిలో ముందుకు వెళుతున్నానని అన్నారు.