వాతావరణ సమతుల్యత కోసమే హరితహారం
నందిపేట : వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి పోచారం అన్నారు. నందిపేట మండలం ఆంధ్రనగర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తామన్నారు. ప్రతి ఇంటికి నల్లానీరు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.5 కోట్ల మొక్కలు నాటామన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు చేరుకోగానే గుత్పను ప్రారంభిస్తామని తెలిపారు. ఆంధ్రనగర్ గ్రామంలో వెటర్నరీ భవనానికి రూ. 40 లక్షలు, కళ్యాణ మండపానికి రూ. 25 మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అంకంపల్లి యమున, ఎంపీటీసీ నాయుడు రామారావు, సర్పంచ్ రామకృష్ణ, ఆర్డీవో యాదిరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ మధుసూదన్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, నక్కల భూమేశ్, ఉల్లి శ్రీనివాస్‌గౌడ్, మీసాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.