డ్రగ్స్ వ్యాపారంలో కొత్త పుంతలు.. కీటమైన్ పొడి తయారీ!
డ్రగ్స్ వ్యాపారంలో హైదరాబాద్ నగరం సరికొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న మొన్నటి వరకు విదేశాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే డ్రగ్స్ దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించేవాళ్లు. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. శస్త్రచికిత్స సమయంలో రోగులకు నొప్పి తెలియకుండా మత్తు కలిగించే 'కీటమైన్ హైడ్రోక్లోరైడ్' అనే పదార్థాన్ని మాదకద్రవ్యాలుగా మార్చి నగరంలో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. దీన్నుంచి పొడిని తయారుచేసి దాన్ని నిషాకోసం వాడిస్తూ యువత బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో వివిధ రకాల మాదకద్రవ్యాలు వాడుతూ లేదా అమ్ముతూ పలువురు పట్టుబడినా, ఈ తరహాలో కొత్తరకం మాదకద్రవ్యం, అది కూడా ఇక్కడే తయారుచేసి అమ్మడం మాత్రం ఇదే తొలిసారని పోలీసులు కూడా అంటున్నారు. ఈ తరహా వ్యూహం పోలీసులనే దిమ్మతిరిగేలా చేసింది. కమిషనరేట్ చరిత్రలోనే ఈ తరహా ముఠాలు పట్టుబడటం ఇది తొలిసారని పోలీసులే చెప్పారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.
కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో శిక్షణ పొందిన ఫెరోజ్ అహ్మద్ అనే వ్యక్తి తన క్లాస్మేట్ నుంచి ఈ కీటమైన్ పొడి తయారుచేయడం నేర్చుకుని, దానికి బానిస అయ్యాడు. తర్వాత దాని అమ్మకాలు కూడా మొదలుపెట్టాడు. అత్యంత తేలిగ్గా ఈ పొడిని అతడు తయారుచేస్తున్నాడు. స్టీలు గిన్నెలో మూడో వంతు నీరు పోసి.. దానిపై స్టీల్ ప్లేటు మూతవేస్తాడు. ప్లేటుపై కీటమైన్ ఇంజెక్షన్ సీసాలోని ద్రవాన్ని పోస్తాడు. గిన్నెలోని నీటిని 10 నుంచి 20 నిమిషాలు మరిగిస్తాడు. నీటి ఆవిరి ప్రభావంతో గిన్నెపై ఉన్న ప్లేటు వేడెక్కుతుంది. అంతే.. కీటమైన్లోని ద్రవం ఆవిరైపోయి పొడి మాత్రమే మిగులుతుంది. 10 మిల్లీలీటర్ల ఇంజెక్షన్‌ను రూ.100కు కొనుగోలు చేసి, గ్రాము పొడిని తయారు చేస్తున్నాడు. దాన్ని 2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నాడు. చివరకు పోలీసుల నిఘాలో పట్టుబడ్డాడు.