నవ బంధాలు
ప్రతి కుటుంబానికి ఆయువు నుదురు తుడిచే కొంగు
అమ్మ... ఏదీ దాచుకోదు. ఏమీ కావాలనుకోదు. పిల్లలు నవ్వితే నవ్వుతుంది. పిల్లల కంట్లో నలక పడ్డా తాను ఏడుస్తుంది. వేవిళ్లు... వికారం... ప్రాణగండం... వెన్నులో మత్తు ఇంజెక్షన్... ఆపరేషన్ బల్ల మీద సిజేరియన్ గాటు... అన్నీ భరిస్తుంది. కేర్మన్న ఏడుపుతో తిరిగి ప్రాణం పోసుకుంటుంది. నాన్నను దబాయించలేదు. ఎవ్వర్నీ డిమాండ్ చేయలేదు. ఉత్త అమ్మగా ఉంటుంది. వేదనను ముక్కుపుడకగా బిగించుకుంటుంది. కంఠాన్ని దుఃఖానికి చెలియలికట్టగా మార్చుకుంటుంది. అమ్మకు ఏం కావాలి?‘ అమ్మా... ఎలా ఉన్నావు’ అన్న పలకరింపు.‘ అన్నం తిన్నావా’? ‘ఏమైనా కావాలా?’ ‘నా దగ్గర వచ్చి ఉండకపోతే ఊరుకోను’... ‘నువ్వు గుర్తుకొస్తున్నావ్ అమ్మా’... ప్రతి మాటకూ అమ్మ ప్రాణం పోసుకుంటుంది. ఏ తల్లీ పిల్లలను మోసం చేయదు. తల్లిని మోసం చేయని అపురూపమైన బంధానికి ప్రతి సంతానం పదే పదే కట్టుబడాల్సి ఉంటుంది.
మణికట్టు మీద పాత వాచీ
నాన్న... కష్టపడతాడు... కష్టపడతాడు... కష్టపడతాడు... కష్టం మొదట పుట్టి నాన్న ఆ వెంటనే పుట్టాడు. బజారుకు వెళ్లి ఏం పని చేస్తాడో. పని కోసం ఎన్ని పాట్లు పడతాడో. ఎన్ని తిట్లు తింటాడో. ఎన్ని ఒత్తిళ్లు పడతాడో. ఎన్ని అవమానాలు దిగమింగుకుంటాడో. కాని ఇంటికి మాత్రం మిఠాయి పొట్లాన్ని మర్చిపోకుండా తెస్తాడు. నెల జీతాన్ని తప్పకుండా తెస్తాడు. వంటింట్లో అమ్మ చేతికి సరుకులు అందజేసే తీరతాడు. ఆకలి మీద పోరాడే వీరుడు నాన్న. తన కుటుంబాన్ని ఆకలికి దూరం చేయడమే నాన్న ఏకైక ఎజెండా. పిల్లలకు బట్టలు కొంటే తనకు కొనుక్కున్నట్టే. పిల్లలకు బైక్ కొనిస్తే తన పాతసైకిల్ కారుతో సమానమైనట్టే. నాన్న... ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. విశ్రాంతిని పాడు చేసుకుంటాడు. తన క్షోభలు తానే పడుతూ పైకి మాత్రం పండుగ పూట తల స్నానం చేసి పిల్లల చేతికి నవ్వుతూ రూపాయి కాసు ఇస్తాడు. నాన్నకు ఏం ఇవ్వాలి? ప్రత్యేకంగా చెప్పాలా? మనల్ని మనం సమర్పించుకోవడం కాదూ?
తెల్లమీసం... బోసినవ్వు
అమ్మమ్మ-తాతయ్య... ఒక ఊళ్లో ఉంటారు. నానమ్మ-తాతయ్య... ఇంకో ఊళ్లో ఉంటారు. ఊళ్లా అవి? మన కోసం వెయిట్ చేసే వెయిటింగ్ రూమ్స్. అక్కడ ఆ పెద్దవాళ్లు, తల పండిన వాళ్లు, మన కుటుంబానికి మూలవేరులాంటి వాళ్లు మనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొడుకూ కోడలు పిల్లలతో వస్తారు... కూతురూ అల్లుడు పిల్లలతో వస్తారు... ఆ పెరళ్లలో వాళ్లు తిరిగితే వాళ్లకు ఆనందం. ఆ వరండాల్లో వాళ్లతో కూచుని కబుర్లు చెప్తే ఆనందం. మూటగట్టుకున్న అనుభవాల నుంచి కొన్ని ముత్యాలు రత్నాలు ఎంచి ఇస్తే ఆనందం. జీవితం ఇచ్చే కలవరాలను వరాలుగా ఎలా మార్చుకోవచ్చో చెప్తే ఆనందం. వాళ్లు లేనిదే మనం లేము. వారిది చాదస్తం కాదు. చేదు హస్తం అంతకన్నా కాదు. మనమే వారికి చేతి కర్ర. మలి నడకలకు భుజం ఆసరా. వాళ్లు ఓల్డ్ మెన్ కారు. గోల్డ్ మెన్. ఆ బంగారు పళ్లాలకు మన ఆదరణే గోడ చేర్పు.
ఒరే పెద్దోడా
ఇంటికి పెద్దోడు... కుటుంబానికి పాలేరు. కష్టం తెలుసుకోవాలి. బాధ్యత తెలుసుకోవాలి. నాన్న మోసే పల్లకీకి సహ బోయీగా మారాలి. చైర్మన్గారికి పీఏ. ఏ పని జరగాలన్నా అప్లికేషన్ పట్టుకొని నాన్న దగ్గరకు వెళ్లాలి. ఒప్పించాలి. మెప్పించాలి. తమ్ముడికి చెల్లెలికి కావల్సింది అమర్చి పెట్టాలి. కొంత కఠినంగా ఉంటాడు. కొంత పెత్తనం చలాయిస్తాడు. నాలుగు లడ్లలో మొదటి లడ్డు తనే తీసుకుంటాడు. కాని... పడాల్సి వస్తే మొదటి మాట తనే పడతాడు. ఇంట్లో తొలి ఉద్యోగి. ఫీజులు కట్టే గుమాస్తా. చెల్లెలికి బాడీగార్డ్. తమ్ముడికి గైడ్. మాటా మాటా వచ్చుండొచ్చు. కాని మన కంటే ముందు అమ్మకడుపులో నుంచి వచ్చాడు కదా. అన్న కదా. అన్నయ్యా... నీకు వందనం.
ఏరా చిన్నోడా
అబ్బో... అల్లరివాడు... గారాలవాడు... నాన్నను దబాయించగలిగే ధీరుడు. అమ్మ స్థిమితాన్ని దొంగిలించే చోరుడు. ఇంటి మీదకు ఫైటింగులు తెస్తాడు. ఇంట్లో లైట్లు పగలగొడతాడు. కాని- కళ. తమ్ముడుంటే చాలా కళ. నవ్వుతాడు. నవ్విస్తాడు. తుర్రున బజారుకు వెళ్లి కావల్సింది క్షణాల్లో పట్టుకొస్తాడు. పాపం... కంప్లయింట్లు చేయడు. అన్న వాడినవి సెకండ్హ్యాండ్గా భరిస్తాడు. అన్నను చదివిస్తే తాను సేద్యం చేస్తాడు. అన్న కలెక్టర్ అయితే తాను కార్మికుడు అవుతాడు. కాని సత్యం పలుకుతాడు. కుటుంబం కాస్త అటూ ఇటూ అయితే వచ్చి భుజానికి ఎత్తుకుంటాడు. అదిలిస్తాడు. నిలదీస్తాడు. అందరి కోసం ప్రాణం పెడతాడు. ఎలా ఉన్నావురా?... అని తమ్ముణ్ణి తప్పకుండా అడగాలి. పిలిచి మరీ గుండెలకు హత్తుకోవాలి.
మహలక్ష్మి
ఇంట్లో పట్టీల మోత... గజ్జెల సవ్వడి... బొట్టుబిళ్ల... రాళ్లహారం... గోరింటాకు... పూలజడ... చెల్లాయ్. లక్ష్మిదేవి అనంటే కరెన్సీయా? కాదు. చెల్లెలి నవ్వు. తన కొత్త డ్రస్సు. తను పెట్టే గుజ్జనగుళ్లు. పేర్చే బొమ్మల కొలువు. ఇంటికి చెల్లెలే పెద్ద ఓదార్పు. ఇంటికి ఆడపిల్లే ఆధార సూత్రం. పెళ్లి చేసుకుని పరాయి ఇంటి మనిషి అవుతుంది. కాని అనునిత్యం మన క్షేమం కోరుతుంది. ఇంట్లో హక్కు చెలాయించగలిగే ఏకైక వ్యక్తి. మాట నెగ్గించుకోగల ఒకే ఒక శక్తి. అమ్మకు అమ్మ. నాన్నకు అమ్మ. ఇంట్లోని మగపురుగులకు చెల్లెమ్మ. ఏ బ్యాంకు ఖాతా అయినా సజీవంగా ఉండాలంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతుండాలి. ఏ ఇంటి అనుబంధాలైనా సజీవంగా ఉండాలంటే ఆడపడుచు రాకపోకలు ఉండాలి. చెల్లెలో... అక్కో... కాని అమృత బంధంగా ఆమెనే చూడాలి.
అమ్మ తర్వాత అమ్మ
మెట్టినింటిని తన ఇల్లుగా చేసుకుంటుంది. అత్త మామల్లో తల్లిదండ్రులను చూసుకుంటుంది. కొత్తల్లో తికమక. సర్దుబాటులో మకతిక. భర్తను గమనించుకోవాలి. ఇంటి పెద్దలను సంతృప్తి పరచగలగాలి. ఆడపడుచును ఆకట్టుకోవాలి. మరిదిని కడుపున పుట్టినవాడిలా మలుచుకోవాలి. అమ్మ తర్వాత అమ్మ అంటారు. వదినమ్మ అంటారు. ఇంటికి కోడలు. గౌరవానికి సిసలైన ఆనవాలు. లోపాలు సరిచేయాల్సిన బాధ్యత ఆమెదే. అందరినీ ఒక తాటి మీదకు తీసుకురావాల్సిన నైపుణ్యమూ ఆమెదే. ఖర్చులు గమనించుకోవాలి. బాధ్యతలను బేరీజు వేసుకోవాలి. ప్రతి భవిష్యత్తుకూ బాసట కావాలి. ఇంటికి వంశాకురాన్ని ఇచ్చే ఒడి ఆమె. బోసినవ్వులకు స్వాగతం పలికే మాతృమూర్తి ఆమే. కుటుంబానికి కొనసాగింపు. నలుగురికీ ఆమెను చూస్తేనే మతింపు. అందుకే వదినకు జేజే. ఇంటి ఇల్లాలికి జేజే.
దగ్గరి చుట్టం
అమ్మ పుట్టిల్లు ఇతనికి తెలుసు. ప్రతి కుటుంబం ఇతనంటే మురుసు. ప్రతి శుభకార్యం ఇతని చేతి మీదుగానే జరగాలి. మంచికీ చెడ్డకీ ఇతనొచ్చి నిలవాలి. అమ్మకు సోదరుడు. నాన్నకు బావమరిది. పిలుపుకి మేనమామ. ప్రతి ఘర్షణకు కాసింత కామా. కాగల కార్యాలన్నీ ఇతనే చేస్తాడు. కాకూడనివన్నీ ఇతడే ఆపుతాడు. బతుకు కోరడంలో మేటి. తన ఇంటి కంటే తోడబుట్టినదాని ఇంటి మీదే ధ్యాస ఎక్కువ. పిల్లల్ని కని ఈ ఇంటికి స్నేహితులుగా ఇస్తాడు. అవసరమైతే తన కుమార్తెను కోడలిగా పంపుతాడు. తన కొడుకును అల్లుడిగా ఇచ్చి ఆధారం చూపుతాడు. మేనమామ లేకుంటే ఏ కుటుంబమూ సంపూర్ణం కాదు. అతడి ప్రమేయం లేని ఏ సంబరమూ సంబరం కాదు. చందమామ సోన అంతటా ఉండాలి. మేనమామ మేనా ప్రతి ఇంటికీ వస్తుండాలి.
ప్రబల శక్తి
అమ్మో... అందరికీ కాసింత బెరుకే. ఏం తేడా వస్తుందోనని కాస్తంత అదురే. మర్యాదలు అందుకునే ఏకైక మనిషి. మర్యాద చేయాల్సిన ఏకైక మనిషి. పుణ్యం కొద్దీ పురుషుడు. వెతగ్గా వెతగ్గా దొరికే అల్లుడు. నాన్నకు ‘గారు’ పెట్టకపోయినా పర్లేదు. ఈయనకు మాత్రం పెట్టే తీరాలి. అంతా బాగుంటే చాలా సులువు. లేకుంటే ప్రతిదీ కష్టం. కాని ఇదంతా కొన్నిరోజులే. కాలం గడిచే కొద్దీ కుటుంబంలో భాగమవుతాడు. అవసరమైతే ఇంటికి పెద్దకొడుకవుతాడు. సూచనలు సలహాలు ఇస్తాడు. కీలకనిర్ణయాల్లో భాగం అవుతాడు. ఇంటికి దర్పం తెచ్చే బంధం. ఇల్లు గర్వపడే బంధం. మంచి అల్లుడు దొరికితే అదృష్టం అంటారు. మన ఇంటి మంచి కొడుకు మెట్టినింటికి మంచి అల్లుడే కదా. అల్లుడు గారూ జిందాబాద్. - నెటిజన్ కిశోర్