పోలీసుల అదుపులో మత్తు మందు విక్రయిస్తున్న వ్యక్తి
గుంటూరు(తెనాలి) : శస్త్రచికిత్సల సమయంలో రోగులకు ఇచ్చే మత్తు ఇంజక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీనివాసరావు అనే వ్యక్తి మత్తు ఇంజక్షన్లను అక్రమంగా తెప్పించి విక్రయిస్తుంటాడు. వైద్యుల ప్రిస్ర్కిప్షన్ లేకుండా విక్రయించకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఈ ఇంజక్షన్‌ను రూ.5 లకు చెన్నై, ఒరిస్సా ప్రాంతాల నుంచి లారీ డ్రైవర్ల ద్వారా తెప్పించి ఒక్కో వయల్‌ను రూ. 80కు విక్రయిస్తున్నాడు.
ఈ ఇంజక్షన్ ను వ్యక్తి నరానికి నేరుగా ఇన్జక్ట్ చేస్తే రెండు రోజుల పాటు మత్తులో జోగుతాడు. వీధి బాలలు, కళాశాల విద్యార్థులు కొందరు ఈ మత్తుకు బానిసలవుతున్నారు. ఇతను గతంలో కూడా ఇంజక్షన్లు అమ్మి జైలుపాలయ్యాడు . జైలు జీవితం గడిపినప్పటికీ బుద్ధి మార్చుకోకుండా మళ్లీ అదే అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ పోలీసులకు చిక్కాడు.