'నా కోడలు ఆ పని చేయదు'
న్యూయార్క్: నాలుగు రోజుల పసికందును రిఫ్రిజిరేటర్లో పెట్టి ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసింది. ఈ ఘటన దక్షిణ కరోలినాలో చోటుచేసుకుంది. ఎంజెలా బ్లాక్ వెల్ (27) అనే మహిళ తన నాలుగు రోజుల పసికందు విలియం డేవిడ్ బ్లాక్ వెల్ ను మూడు గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అతడు హైపోథెర్మియా బారిన పడి ప్రాణాలు విడిచిపెట్టాడని పోలీసులు చెప్పారు. వాస్తవానికి ఈ ఘటన ఆరు నెలల కిందేట జరిగినా కేసు నిర్థారించేందుకు ఇన్ని రోజులు పట్టింది.
ఆధారాల కోసం, విచారణ కోసం తాము ఇంత సమయం తీసుకున్నామని, ఆమెనే ఈ హత్య చేసిందని నిర్ధారణకు వచ్చాకే ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకొచ్చామని చెప్పారు. కోర్టు ఆమెను ప్రశ్నిస్తున్న సమయంలో ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండి తల మాత్రమే ఊపుతూ నిశ్శబ్దంగా కోర్టు హాలును వదిలి వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనపై ఆ బాలుడి తాత ఇంటివద్ద స్పందిస్తూ ఎంజెలా తల్లి అయిన సందర్భంలో ఎంత సంతోషంగా ఉందో తనకు తెలుసు అని, తన కోడలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనిచేసి ఉండదని, అయితే, అసలు ఎవరు, ఎందుకు ఈ పనిచేశారో మాత్రం తనకు అర్థం కావడం లేదని చెప్పారు. కాగా, నవంబర్ 10న మరోసారి కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.