Angelic Kerber
-
కెర్బర్, వీనస్ ఇంటిముఖం
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. తొలి రోజు మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 81వ ర్యాంకర్ అనస్తాసియా పొటపోవా (రష్యా) 6–4, 6–2తో ఐదో సీడ్ కెర్బర్‌ను బోల్తా కొట్టించగా... తొమ్మిదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 2002 రన్నరప్ వీనస్‌ను ఓడించింది. పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో కెర్బర్ కచ్చితమైన సర్వీస్ చేయలేకపోయింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన కెర్బర్ 21 అనవసర తప్పిదాలు కూడా చేసింది. స్వితోలినాతో 73 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వీనస్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పోటీనివ్వలేదు. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన 38 ఏళ్ల వీనస్ ఏకంగా 34 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 22వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొన్న వీనస్ 2006 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–3తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)పై, మాజీ చాంపియన్, 19వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 5–7, 6–2, 6–2తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)పై, 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో జెస్సికా పొంచెట్ (ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఫెడరర్... వరుసగా 60వ సారి పురుషుల సింగిల్స్ విభాగంలో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శుభారంభం చేశాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న మూడో సీడ్ ఫెడరర్ 6–2, 6–4, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫెడరర్‌కు తొలి రౌండ్లో వరుసగా 60వ విజయం కావడం విశేషం. 91 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించాడు. 30సార్లు నెట్ వద్దకు వచ్చి 25సార్లు పాయింట్లు సాధించాడు. ఫెడరర్‌తోపాటు ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ నిషికోరి (జపాన్), 11వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. సిట్సిపాస్ 6–2, 6–2, 7–6 (7/4)తో మార్టెరర్ (జర్మనీ)పై, నిషికోరి 6–2, 6–3, 6–4తో క్వెంటన్ హాలిస్ (ఫ్రాన్స్)పై, సిలిచ్ 6–3, 7–5, 6–1తో ఫాబియానో (ఇటలీ)పై గెలిచారు. ప్రజ్నేశ్‌కు నిరాశ... భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ తొలి రౌండ్ దాటలేకపోయాడు. తన ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడిన ప్రజ్నేశ్ 1–6, 3–6, 1–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 46 వేల యూరోలు (రూ. 35 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ప్రజ్నేశ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
చాంపియన్స్ డ్యాన్స్...
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ చాంపియన్స్‌కు అధికారికంగా నిర్వహించిన విందు కార్యక్రమంలో కలిసి నృత్యం చేస్తున్న పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు నొవాక్ జొకోవిచ్, ఎంజెలిక్ కెర్బర్. -
అయ్యో... కెర్బర్
► తొలి రౌండ్లోనే ఓడిన టాప్ సీడ్ ► మకరోవా అద్భుత ప్రదర్శన పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ పెను సంచలనంతో ప్రారంభమైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ ఊహించనిరీతిలో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. రష్యా అన్‌సీడెడ్ ప్లేయర్ ఎకతెరీనా మకరోవా అద్వితీయ ఆటతీరుకు కెర్బర్ చేతులెత్తేసింది. ఈ క్రమంలో టాప్ సీడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన మొదటి క్రీడాకారిణిగా కెర్బర్ గుర్తింపు పొందింది. గతంలో టాప్ సీడ్ హోదాలో హెనిన్ (బెల్జియం) 2004లో, సెరెనా (అమెరికా) 2014లో రెండో రౌండ్లో వెనుదిరిగారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 40వ ర్యాంకర్ మకరోవా 6–2, 6–2తో కెర్బర్‌ను చిత్తు చేసి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ‘ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే టాప్ సీడ్ క్రీడాకారిణిని ఓడించిన తొలి ప్లేయర్‌గా నేను చరిత్ర సృష్టించానన్న విషయం తెలియగానే నమ్మలేకపోయాను’ అని మకరోవా వ్యాఖ్యానించింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మకరోవా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 27 విన్నర్స్ కొట్టిన ఆమె, నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచింది. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించి, వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన కెర్బర్‌కు ఈ ఏడాది కలిసి రావడంలేదు. తాజా సీజన్లో ఆమె 19 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. మరోవైపు కెర్బర్‌కు ముందు నాలుగుసార్లు మాత్రమే టాప్ సీడ్ క్రీడాకారిణులు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో తొలి రౌండ్లో ఓడిపోవడం జరిగింది. గతంలో టాప్ సీడ్ హోదాలో రుజుకి (1979 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో), స్టెఫీ గ్రాఫ్ (1994 వింబుల్డన్‌లో), మార్టినా హింగిస్ (1999, 2001 వింబుల్డన్‌లో) తొలి రౌండ్లో ఓడిపోయారు. ఆకట్టుకున్న క్విటోవా: గత డిసెంబరులో తన ఇంట్లో ఆగంతకుడి కత్తి దాడిలో చేతికి గాయమై ఆటకు దూరమైన పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) ఫ్రెంచ్ ఓపెన్‌తో పునరాగమనం చేసింది. తొలి రౌండ్లో క్విటోవా 6–3, 6–2తో జూలియా బోసెరప్ (అమెరికా)పై అలవోకగా గెలిచి శుభారంభం చేసింది. ‘గత వారంలోనే నేను ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాను. కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని క్విటోవా వ్యాఖ్యానించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కుజ్నెత్సోవా (రష్యా) 7–5, 6–4తో మెక్‌హాలె (అమెరికా)పై పదో సీడ్ వీనస్ (అమెరికా) 6–4, 7–6 (7/3)తో కియాంగ్ (చైనా)పై గెలిచారు. థీమ్ శుభారంభం: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో టామిక్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. 11వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–2, 6–3, 6–4తో రాబర్ట్ (ఫ్రాన్స్)పై, 23వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా) 7–6 (7/5), 7–5, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందారు.