సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర
తిరుపతి : సీమాంధ్రలో విభజన సెగలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ నేతలు చేపట్టని దీక్ష నాలుగో రోజుకు చేరింది. మరోవైపు పట్టణంలో ఆటో కార్మికులు బంద్ నిర్వహిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కేబుల్ ఆపరేటర్లు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు.
వరదాయపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అలాగే విద్యార్థులు సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దగ్ధం చేశారు. కాగా సత్యవీడు మండలం మదనంబేడు వద్ద ఆందోళనకారులు ఓ ఆర్టీసీ బస్సును దగ్ధం చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. నేడు జిల్లావ్యాప్తంగా కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే సీకే బాబు చేపట్టిన ఆమరణ దీక్ష నేటికి ఏడోరోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. మరోవైపు పుంగనూరులో సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. చెన్నై-ముంబై జాతీయ రహదారిపై గోడ కట్టారు.
మరోవైపు సమైక్యాంధ్రకు మద్దుతుగా ఎస్వీయూలో విద్యార్థులు చేపట్టిన దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేపట్టిన వారిని పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. కాణిపాకంలో అర్చకులు ర్యాలీ నిర్వహించారు.