ఊపిరితిత్తులకు మేలు ఉష్ట్రాసనం
♦ బద్ధకోణాసనంతో సుఖప్రసవం
♦ ఉదరశక్తికి మహాముద్ర
1. బద్ధ కోణాసన : ఈ ఆసనంలో కాళ్లు రెండూ ముందుకు స్ట్రెచ్ చేసి సమస్థితిలో కూర్చోవాలి. రెండు కాళ్లను వదులుగా ఉంచి, పాదాలను పక్కలకి తిప్పుతూ మోకాళ్లను తుంటి కీలు భాగాలను విడదీయాలి. తరువాత రెండు కాళ్లను మడిచి పాదాలు రెండు... జననేంద్రియాలకు దగ్గరగా కలిపి ఉంచాలి. రెండు పాదాల కాలి వేళ్ళను రెండు చేతులతో కలిపి పట్టుకుని శరీరం నిటారుగా ఉంచి రెండు మోకాళ్లను పైకి, మళ్ళీ కిందికి తీసుకురావాలి.
ఈ ఆసనంలో మోకాళ్లు రెండూ పైకి కిందకు వచ్చినప్పుడు సీతాకోకచిలుక రెక్కల కదలిక వలె ఉంటుంది కనుక దీనిని బటర్ ఫ్లై భంగిమతో పోలుస్తారు. పూర్తి స్థితిలో ఉన్నప్పుడు మోకాళ్లు రెండూ భూమికి దగ్గరగా ఉన్నప్పుడు శ్వాస వదులుతూ పొట్ట కండరాలను లోపలకు లాగి ముందుకు వంగి తలను పాదాలకు తాకించే ప్రయత్నం చేయవచ్చు.
ఉపయోగాలు: తొడ లోపలి భాగాలకు, తుంటికీలు (గ్రొయిన్ ఏరియా) భాగాలలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. జీర్ణశక్తి, అన్న పేగు కదలికకు దోహదపడుతంది. రుతుక్రమం సమస్యల నుంచి, మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రీ నేటల్ యోగాలో ఇది ముఖ్యమైన ఆసనం. పెల్విక్ రీజియన్ ఓపెన్ అవుతుంది కనుక సుఖ ప్రసవం జరుగుతుంది. గుండె కండరాలు బలంగా అవుతాయి. ఊపిరితిత్తులకు మంచిది. అయితే గర్భిణీ స్త్రీలు చివరి మూడు నెలల్లో ఈ ఆసనం చేయకుండా ఉండటం మంచిది.
2. మహాముద్ర : సీతాకోక చిలుక భంగిమలో కూర్చోవాలి. గజ్జ భాగాలు సడలిన తరువాత కుడి పాదాన్ని జననేంద్రియాలకు దగ్గరగానే ఉంచి ఎడమకాలును ముందుకు చాపాలి. రెండు చేతులతో ఎడమపాదాన్ని పట్టుకుని వెన్నెముకను నిటారుగానే ఉంచి మొండాన్ని ఏటవాలుగా ముందుకు ఉంచి, మలద్వారం దగ్గర కండరాలను (మూలబంద్)లోపలకి, శ్వాస వదులుతూ పొట్ట దగ్గర కండరాలను లోపలికి లాగి (ఉడియాన బంద్), గొంతు దగ్గర కండరాలను సంకోచింప చేసి (జలంధర్ బంద్) ఉంచాలి. తిరిగి శ్వాస తీసుకుంటూ లాగి ఉంచిన కండరాలను అదే వరుసలో రిలీజ్ చేయాలి. ఈ విధంగా 3 సార్లు రిపీట్ చేసిన తరువాత తిరిగి రెండవ వైపు అంటే కుడికాలుని స్ట్రెచ్ చేసి ఎడమకాలుని ఫోల్డ్ చేసి చేయాలి.
ఉపయోగాలు: ఉదరకోశ సమస్యలను తగ్గించడానికి, జీర్ణశక్తి పెరగడానికి సింపథెటిక్, పారా సింపథెటిక్ నరాల వ్యవస్థను సమతుల్యం చేయడానికి తద్వారా మానసిక ప్రశాంతత కలగించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ధ్యానం చేయడానికి ముందు ఈ ఆసనం సాధన చేసినట్లయితే త్వరగా ఏకాగ్రత సాధించడానికి తేలిక అవుతుంది. యాంటీ ఏజింగ్కి ఉపయోగం ఈ ముద్ర
3. ఉష్ట్రాసనం
వజ్రాసనంలో కూర్చోవాలి. సీటు భాగం మడమల మీద ఉంచాలి. ఎడమ చెయ్యి అరచేతితో భూమి మీద నొక్కుతూ శ్వాస తీసుకుంటూ సీటు భాగాన్ని కుడిచేతిని పైకి లేపి, కుడి చేతిని వీలైనంత పైకి వెనుకకు స్ట్రెచ్ చేసి పొట్ట భాగాన్ని ముందుకు నె ట్టాలి. మోకాలు నుంచి తొడవరకు నిలువు రేఖలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దీనిని అర్థ ఉష్ట్రాసనం అంటారు. శ్వాస వదులుతూ యధాస్థితి వజ్రాసనంలోకి వెనుకకు రావాలి.
ఎడమ అరచెయ్యి వెనుక భూమి మీద బలంగా నొక్కుతూ పైకి లేవడం వలన లోయర్ బ్యాక్ మీద ఎటువంటి లోడ్ పడకుండా చాలా తేలికగా ఉంటుంది. ఇదే విధంగా రెండో వైపు కూడా అర్ధ ఉష్ట్రాసనం చేయాలి. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఏర్పడిన తరువాత రెండు మోకాళ్ల మీద నిలబడి కుడి చెయ్యి వెనుకనున్న కుడి అరిపాదం మీద, ఎడమ చెయ్యి ఎడమ అరిపాదం మీద ఉంచి తలని వెనుకకు వాలుస్తూ పొట్ట భాగాన్ని ముందుకు నెట్టాలి. ఈ ఆసనాన్ని ఒంటె భంగిమతో పోల్చుతారు. 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ వజ్రాసన స్థితికి రావాలి.
ఉపయోగాలు: జీర్ణశక్తి మెరుగుపడడానికి, ఊపిరితిత్తులు వ్యాకోచం చెందడానికి, రుతుక్రమ సమస్యలు పోవడానికి అన్నింటికంటే ముఖ్యంగా లోయర్ బ్యాక్ సమస్య పరిష్కారానికి ఉపయోగపడే ఆసనం ఇది. - సమన్వయం: ఎస్.సత్యబాబు, సాక్షి ప్రతినిధి